పరీక్షలు పెట్టరు.. ఫలితాలు ఇవ్వరు..జేఎన్టీయూహెచ్ తీరిది! | Sakshi
Sakshi News home page

పరీక్షలు పెట్టరు.. ఫలితాలు ఇవ్వరు..జేఎన్టీయూహెచ్ తీరిది!

Published Mon, May 26 2014 12:42 AM

పరీక్షలు పెట్టరు.. ఫలితాలు ఇవ్వరు..జేఎన్టీయూహెచ్ తీరిది!

  • వరుసగా వాయిదా పడుతోన్న బీటెక్ పరీక్షలు
  •  సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూహెచ్)లో బీటెక్ వార్షిక పరీక్షల వ్యవహారం ప్రహసనంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం ముంచుకొస్తున్నా.. గత విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీటెక్ కోర్సులో మొదటి మూడేళ్ల విద్యార్థులకు ఇంతవరకు పరీక్షలు జరగలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఇకనైనా పరీక్షలు జరుగుతాయో లేదోనని విద్యార్థులు అం దోళన చెందుతున్నారు.

    ఇదిలా ఉంటే.. ఎన్నికల కమిషన్ అనుమతితో బీటెక్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించిన జేఎన్టీయూహెచ్ పరీక్షలు ముగిసి నెలయినా ఇంతవరకు ఫలితాలను ప్రకటించలేదు. అత్యంత సాంకేతిక వ్యవస్థను నెలకొల్పామని చెబుతున్న అధికారులు ఫలితాల జాప్యంపై నోరు మెదపడంలేదు. ఫలితంగా విదేశాల్లో ఉన్నత విద్యకోసం దరఖాస్తు చేసుకున్న ఫైనలియర్ అభ్యర్థులకు అవకాశాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది.
     
    వాయిదాల పర్వం

    యూనివర్సిటీ ఆవిర్భవించాక ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పరీక్షల విభాగం అధికారులు వార్షిక పరీక్షలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. దీంతో విద్యార్థులు తమ వేసవి సెలవులను ప్రశాంతంగా  గడిపేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల సంవత్సరంలో  పరీక్షల షెడ్యూలును  ప్రకటించడంలో యంత్రాంగం విఫలమైంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వార్షిక పరీక్షలు ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడగా మూడోసారి ప్రకటించిన షెడ్యూలు ప్రకారమైనా పరీక్షలు జరుగతాయో లేదో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

    తొలుత ఏప్రిల్ 22నుంచి మే 5 వరకు షెడ్యూలు ప్రకటించగా, వాటిని ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. రెండోసారి మే 20 నుంచి జూన్ 5 వరకు ప్రకటించగా వాటిని ఏ కార ణంత్లో వాయిదా వేశారో ఎవరికీ తెలియలేదు. మూడోసారి జూన్ 3 నుంచి జూన్ 17వరకు ప్రకటించారు. కొత్త రాష్ట్రాల అవతరణ నేపథ్యంలో అవి కూడా వాయిదా పడనున్నాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
     
    జూన్ 3 నుంచి సాధ్యమేనా?
     
    జూన్ 1, 2 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొని, జూన్ 3 నుంచి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఎలా హాజరు అవుతారని యాజమాన్యం భావించిందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఒకవేళ విద్యార్థులు ఈ పరీక్షలను మరోసారి నిర్వహించమంటే షెడ్యూలు మారుస్తుందా?  కీలకమైన ఈ పరీక్షల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
     

Advertisement
Advertisement