మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ.. రేపు..?: రేవంత్‌ | Sakshi
Sakshi News home page

ఎన్నో సమస్యలు పరిష్కరించింది: కోమటిరెడ్డి

Published Tue, Nov 5 2019 1:26 PM

Revanth Reddy Demands CBI Investigation Over Tahsildar Vijaya Reddy Murder - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పట్టపగలే ప్రభుత్వ కార్యాలయంలో తహశీల్దార్‌ విజయారెడ్డి హత్య జరగడం దారుణమని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగానే విజయారెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...  ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు దూరం ప్రభుత్వమే పెంచిందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. ఘటనపై ఉద్యోగులు భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తే కాంగ్రెస్‌ పార్టీ వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తుందని హామీ ఇచ్చారు.

‘మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న అధికారిణిపై దాడి దారుణం. దాదాపు ఐదు వందల ఎకరాల భూ వివాదం నేపథ్యంలో ఈ హత్య జరిగింది. ఇంతటి ఘోరమై ఘటన జరిగితే న్యాయం చేస్తామని ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దగ్గరే ఉంది. హత్య జరిగి 24 గంటలు గడుస్తున్నా సీఎం నివాళులు అర్పించేందుకు రాలేదు. రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. మంత్రి కేటీఆర్ రెవెన్యూ అధికారులపై దాడి చేయాలని పిలుపునివ్వడం ఇలాంటి ఘటనలకు ఉసిగొల్పుతుంది. ఘటనపై సీబీఐ విచారణ జరపాలి’ అని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 

అధికారిక లాంఛానలతో జరపాలి!
‘భూ వివాదంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి. మొన్న ఆర్టీసీ, నిన్న రెవెన్యూ.. రేపు మరో శాఖకు ఇలాంటి చేదు అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులందరు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. జ్యూడిషియల్ అధికారి విధి నిర్వహణలో మరణిస్తే అధికారిక లాంఛనాలతో జరపాలని ప్రభుత్వం ప్రకటించలేదు. విజయారెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి కనీసం పలకరించకపోవడం బాధాకరం. బాధిత కుటుంబాన్ని సీఎం పరామర్శించాలి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలి’ అని రేవంత్‌రెడ్డి ప్రభత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎన్నో సమస్యలు పరిష్కరించింది: కోమటిరెడ్డి
విజయారెడ్డిపై దాడి మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఉందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. తహశీల్దార్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటన తనను వేదనకు గురిచేసిందన్నారు. ‘విజయారెడ్డి ఎన్నో సమస్యలను పరిష్కరించింది. ఆమె హత్య చూసి సమాజం బాధ పడుతోంది. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా. రెవెన్యూశాఖ సమస్యలను ఒకేసారి పరిష్కారం చేయలేము. అధికారుల పై విపరీతమైన ఒత్తిడి ఉంది’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement