కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ

Published Wed, May 31 2017 7:13 PM

కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు గౌరవం దక్కడం లేదని, ఎవరి త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడిందో ఆ అమరవీరుల కోసం ఒక రోజును కేటాయించడానికి కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసిన 3వ తేదీని అమరవీరుల దినోత్సవంగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు.

‘ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ కోసం తొలి ఉద్యమంలో 369 మంది, మలి ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారని అధికారికంగా ప్రకటించారు. వీరి కుటుంబాలకు వ్యవసాయ భూమి, రూ.10లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూం ఇంటిని ఇస్తామని తీర్మానం చేశారు. కానీ, అమరవీరులను గౌరవించే విషయంలో ప్రభుత్వ దృక్పథం మారినట్లు కనిపిస్తోంది. మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ 500 మంది అమరుల కుటుంబాలకు మాత్రమే సాయం చేసి చేతులు దులిపేసుకున్నారు. మిగిలిన కుటుంబాలను ఇప్పటికీ గుర్తించడం లేదు.

తెలంగాణ సమాజానికి అమరవీరుల త్యాగాలను గుర్తుచేయడం ఇష్టం లేకనే ఆ కుటుంబాలను మీరు పట్టించుకోవడం లేదన్నది మా పార్టీ అభిప్రాయం’  అని ఆ లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన స్మృతి చిహ్న నిర్మాణం తక్షణమే ప్రారంభించాలని, 31 జిల్లాల్లో స్మృతి స్థూపాల నిర్మాణాలు చేపట్టాలని, ఉద్యమ సమయంలో వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని రేవంత్‌ రెడ్డి ఆ బహిరంగ లేఖలో డిమాండ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement