బదిలీల కథ మొదటికి..! | Sakshi
Sakshi News home page

బదిలీల కథ మొదటికి..!

Published Mon, Jun 16 2014 11:40 PM

బదిలీల కథ మొదటికి..! - Sakshi

- తహసీల్దార్ల బదిలీ ఉత్తర్వులు రద్దు చేసిన ట్రిబ్యునల్
- పాత స్థానాల్లోనే నియమించాలని ఆదేశాలు
- ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఐదుగురు తహసీల్దార్లు
- తాజాగా బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం మొగ్గు
- ప్రభుత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటామని వెల్లడి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తహసీల్దార్ల బదిలీల కథ అడ్డం తిరిగింది. కలెక్టర్ జారీచేసిన బదిలీ ఉత్తర్వులను రద్దు చేస్తూ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించి వెనక్కివచ్చిన తహసీల్దార్లకు పాత స్థానాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో బదిలీలు జరిగాయనే ఆరోపణలు రావడంతో సతమతమవుతున్న యంత్రాంగాన్ని తాజాగా ట్రిబ్యునల్ తీర్పు మరింత ఇరకాటంలో పడేసింది. సొంత జిల్లా/ మూడేళ్లు పైబడి ఒకే జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లకు స్థానచలనం క ల్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్నికల వేళ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తహసీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో వీరంతా జిల్లాకు తిరిగొచ్చారు.

ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ వెనక్కివచ్చిన తహసీల్దార్లకు పోస్టింగ్‌లిచ్చారు. అయితే, బదిలీల పర్వంలో రాజకీయ ఒత్తిళ్లు శృతిమించడం, సమర్థతను గాకుండా పైరవీలు చేసుకున్నవారికే పెద్ద పీట వేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.  తెలంగాణ గెజిటెట్ అధికారుల(టీజీఓ) సంఘం ఏకంగా తమ అసంతృప్తిని ప్రభుత్వానికి కూడా తెలియపరిచింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని కాదని, మరో సంఘం సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చారని ఆ సంఘం అభ్యంతరం తెలిపింది.

ఈ క్రమంలోనే 13 మంది తహసీల్దార్లు కొత్త మండలాల్లో బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో జిల్లాలో రెవెన్యూ పాలనా వ్యవస్థ స్తంభించింది. ప్రభుత్వమే నేరుగా నియమించిన డిప్యూటీ తహసీల్దార్లు కూడా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకున్నారు. మరోవైపు తాజాగా మరో ఐదుగురు తహసీల్దార్లు వసంతకుమారి (శంకర్‌పల్లి), దేవుజా (ఘట్‌కేసర్), శ్రీనివాస్(శామీర్‌పేట), యాదయ్య (షాబాద్), ప్రేంకుమార్ (ఉప్పల్)  కూడా ట్రిబ్యునల్ ద్వారా స్టే పొందారు. కలెక్టర్ ఉత్తర్వులు రద్దు చేస్తూ, పాత స్థానాల్లోనే వీరిని నియమించాలని ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఉత్తర్వులు రద్దు?
ట్రిబ్యునల్ ఉత్తర్వులతో బదిలీల అంశం మొదటికొచ్చింది. కోర్టును ఆశ్రయించిన ఐదుగురికి పాత స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వాలని నిర్దేశించిన ట్రిబ్యునల్.. అదేసమయంలో రెండు విడతలుగా కలెక్టర్ జారీచేసిన బదిలీ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో బదిలీలపై మీమాంస నెలకొంది. ట్రిబ్యునల్ తీర్పును పరిశీలిస్తే బదిలీల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని స్పష్టమవుతుందని, దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ఆయా చోట్ల విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్లకు తాజా పరిణామం మింగుడుపడడంలేదు. బదిలీల ప్రక్రియ రాద్ధాంతం సృష్టించడం, ఉద్యోగసంఘాలు రెండుగా చీలిపోవడం జిల్లా ఉన్నతాధికారులకు కూడా తలనొప్పిగా తయారైంది.  మరోవైపు మునుపెన్నడూలేని విధంగా బదిలీల్లో ప్రజాప్రతినిధులు తలదూర్చడం కూడా యంత్రాంగానికి ఇబ్బంది మారింది.

Advertisement
Advertisement