దోపిడీ దొంగలు దోచుకుపోయారు.. | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగలు దోచుకుపోయారు..

Published Wed, Dec 10 2014 12:12 AM

దోపిడీ దొంగలు దోచుకుపోయారు.. - Sakshi

సోమవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు తెగబడ్డారు.. పక్కా వ్యూహంతో బ్యాంకులోకి చొర బడి అందినకాడికి దోచుకుపోయారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్లు, అధునాతన పరికరాలు ఉపయోగించి లూటీకి పాల్పడ్డారు. ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని జోడిమెట్ల దక్కన్ గ్రామీణ బ్యాంకులో చోరీ ఘటన మంగళవారం జిల్లాలో కలకలం రేపింది. తెల్లవారుజామున బ్యాంకు కిటికీ చువ్వలను వంచి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.32 లక్షల నగదు, తొమ్మిది తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్లతో లాకర్లను ఓపెన్ చేస్తున్న సమయంలో వెలువడిన నిప్పురవ్వల కారణంగా రికార్డులకు మంటలు అంటుకున్నాయి. దీంతో దొంగలు పారిపోయారు. పోలీసులు వివరాలు సేకరించారు.  

ఘట్‌కేసర్: దక్కన్ గ్రామీణ బ్యాంకులో దోపిడీకి పాల్పడింది చోరీల్లో ఆరితేరిన ముఠాయేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు బ్యాంకు దోపిడీకి పక్కా ప్రణాళికను అమలు చేయడం ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తోంది. కాగా ప్రస్తుతానికి బ్యాంకులో రూ.32 లక్షలు, 9 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అయితే దోపిడీకి గురైన ఇంకో లాకర్ యజమాని అందుబాటులో లేకపోవడంతో అందులో ఏమేర సొమ్ము చోరీకి గురైందన్న విషయాన్ని పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు.

బ్యాంకులో పెద్ద ఎత్తున లావాదేవీలు
మండలంలోని చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని జోడిమెట్లలో పదేళ్ల క్రితం దక్కన్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేశారు. పోచారంలో ఇన్ఫోసిస్, ఐటీఐఆర్ ప్రాజెక్టుల ఏర్పాటుతో ఇక్కడ రియల్ వ్యాపారం పుంజుకొని ఈ బ్యాంకులో లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రోజూ మాదిరిగానే సోమవారం సాయంత్రం కార్యకలాపాలు ముగిసిన అనంతరం సిబ్బంది బ్యాంకుకు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం 5.30గంటలకు బ్యాంకు నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు బ్యాంకు మేనేజర్ శ్రవణ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి బ్యాంకును తెరిచిచూడగా లోపల దట్టంగా పొగ అలుముకుంది. అనుమానంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. తగులబడుతున్న రికార్డులు, ఫైళ్లపై నీరుపోసి పోలీసులు బ్యాంకులోపలికి ప్రవేశించారు. బ్యాంకులో ఉండవలసిన డబ్బు లేకపోవడం, లాకర్లు పగిలి ఉండటం, కిటికీ ఇనుప చువ్వలు వంచి ఉండటంతో బ్యాంకు దోపిడీకి గురైనట్లు పోలీసులు గ్రహించారు.

దోపిడీ జరిగింది ఇలా..
మంగళవారం తెల్లవారుజామున దుండగులు బ్యాంకు సమీపంలోని భవనానికి ఎడమ వైపున వాహనాన్ని నిలిపారు. చుట్టు పక్కల ఇళ్లు లేకపోవడంతో వీరిని ఎవరూ గమనించే అవకాశం లేకపోయింది. అనంతరం వాహనాలను పైకి ఎత్తే జాకీ సాయంతో కిటికీ చువ్వలను వంచారు. అందులోనుంచి లోనికి వెళ్లిన దుండగులు వారితో పాటు గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, టార్చి, ఇనుపరాడ్, ఆక్సబ్లేడ్, టైబార్, కారం పొడి పొట్లాలు తీసుకువెళ్లారు. గ్యాస్ కట్టర్ సాయంతో లాకర్‌రూంలోకి చొరబడి అక్కడ ఉన్న క్యాష్ చెస్ట్‌లో ఉన్న రూ.32 లక్షలను తీసుకున్నారు. అనంతరం అక్కడ ఉన్న 70 లాకర్లలో రెండింటిని తెరిచారు. 36వ నంబర్ లాకర్ లో పోచారంకు చెందిన అనంత్‌రెడ్డి దాచిన 9 తులాల బంగారు నగలు దోచుకున్నారు. 27వ నంబర్ చెందిన లాకర్‌ను ధ్వంసం చేశారు. దాని యాజమాని అందుబాటులో లేరు.

అనంతరం మరో లాకర్‌ను గ్యాస్ కట్టర్‌తో  కట్ చేస్తుండగా నిప్పురవ్వలు పడి అక్కడున్న రికార్డులు అంటుకున్నాయి. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. దీంతో దుండగులు ఇక అక్కడ ఉండటం మంచిది కాదని భావించి పరారయ్యారు. వెళ్లే సమయంలో సీసీకెమెరాల పుటేజీ హర్డ్‌డిస్క్‌ను తీసుకెళ్లారు. గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, టైబార్, కారంపొడి ప్యాకెట్లు, టార్చి, మూడు మంకీక్యాప్‌లను అక్కడే వదిలారు. బ్యాంకులో చోరీ సంఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. జేసీపీ శివధర్, డీసీపీ రమారాజేశ్వరీ, మల్కాజిగిరి ఏసీపీ రవిచంద్రన్‌రెడ్డి తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగీలం బ్యాంకులోనికి వెళ్లి పరిసరాల్లో కొంత దూరం వరకు వెళ్లి తిరిగి వచ్చింది. క్లూస్‌టీం,  ఎస్‌ఓటీ, ఎస్‌బీ, ఐబీ పోలీసులు బ్యాంకులో ఆధారాలను సేకరించారు.

ఆందోళనలో ఖాతాదారులు
చోరీల్లో ఆరితేరిన ముఠానే దక్కన్ గ్రామీణ బ్యాంకులో దోపిడీకి పాల్పడిందని డీసీపీ రమా రాజేశ్వరి తెలిపారు. సంఘటన స్థలం వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఇలాంటి దొంగతనాలు గతంలో కరీంనగర్, షాద్‌నగర్, వరంగల్‌లో జరిగినట్లు చెప్పారు. దోపిడీకి గ్యాస్‌కట్టర్, గ్యాస్ సిలిండర్, జాకీ తదితర వస్తువులను వాడటాన్ని బట్టి పెద్ద ముఠాయే ఈ దోపిడీకి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇప్పటికి రూ.32 లక్షల నగదు, 9తులాల బంగారం బ్యాంకులో దోపిడీకి గురైనట్లు నిర్ధారించామని, దోపిడీకి గురైన సొమ్ము ఇంకా పెరగవచ్చన్నారు. బ్యాంకులో దోపిడీ విషయం తెలుసుకున్న ఖాతాదారులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ లాకర్లు సురక్షితంగా ఉన్నాయో లేవోనన్న ఆందోళన వారిలో కనిపించింది. అయితే రెండు లాకర్లు మాత్రమే చోరీకి గురైనట్లు బ్యాంకు అధికారులు తెలపడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.  బ్యాంకు వద్దకు  స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎంపీపీ బండారి శ్రీనివాస్ వెళ్లి ఖాతాదారులకు ధైర్యం చెప్పారు.

Advertisement
Advertisement