విద్యుత్‌ గోదాములో దొంగలు పడ్డారు

25 May, 2019 08:38 IST|Sakshi
స్టోర్స్‌లోని సామగ్రిని తరలిస్తున్న డీసీఎం

అవినీతికి నిలయంగా మారిన సిటీ స్టోర్స్‌

కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే మెటీరియల్‌ సరఫరా

తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని ‘స్టోర్స్‌’ అవినీతికి ఆలవాలంగా మారింది. ఇక్కడ ఇంటి దొంగలు కొందరు గుట్టుచప్పుడు కాకుండా ‘దోచుకుంటున్నారు’. కమీషన్లు ఇచ్చిన వారికే విద్యుత్‌ పరికరాలు పంపిణీ చేస్తున్నారు.  కేబుళ్లు మొదలు ట్రాన్స్‌ఫార్మర్లు, సీటీమీటర్‌ బాక్సులు, ప్యానల్‌ బోర్డులు, కండక్టర్లు, డిస్కులు, ఇన్సులేటర్ల వరకు ఏది కావాలన్నా అడిగినంత కమీషన్‌ ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే రోజుల తరబడి కాంట్రాక్టర్లు స్టోర్ల చుట్టూ తిరగాల్సిందే. ఈ అంశంపై ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు ఆ శాఖ డైరెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేశారు. తాజాగా గురువారం రాత్రి సిటీస్టోర్‌ నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఖరీదైన మెటీరియల్‌ను ఓ ప్రైవేటు డీసీఎంలో బయటకు తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడటం వివాదాస్పదంగా మారింది. దీనిపై కొందరు కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించడం గమనార్హం.

సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి విద్యుత్‌ స్టోర్స్‌(విద్యుత్‌ పరికరాల నిల్వ, పంపిణీ కేంద్రాలు)అవినీతికి నిలయంగా మారాయి. కేబుళ్లు మొదలు ట్రాన్స్‌ఫార్మర్లు, సీటీమీటర్‌ బాక్సులు, ప్యానల్‌ బోర్డులు, కండక్టర్లు, కాసారాలు, మెటల్‌పార్ట్స్, డిస్కులు, ఇన్సులేటర్ల వరకు ఏదీ కావాలన్నా అడిగినంత కమీషన్‌ ఇచ్చుకోవాల్సిందే. లేదంటే సదరు కాంట్రాక్టర్లు స్టోర్ల చుట్టూ రోజుల తరబడి ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఎస్టిమేషన్‌ ప్రకారం డీడీ రూపంలో బిల్లు చెల్లించినా స్టోర్‌ నుంచి మెటీరియల్‌ తీసుకునేందుకు భారీగా ముడుపులు సమర్పించాల్సి వస్తోంది. ఇదే అంశంపై ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు పీ అండ్‌ ఎంఎం డైరెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేయడంతో  ఆయన సంబంధిత ఏడీఈని తీవ్ర స్థాయిలో మందలించారు. తాజాగా గురువారం రాత్రి సిటీస్టోర్‌ నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఖరీదైన మెటీరియల్‌ను ఓ ప్రైవేటు డీసీఎంలో బయటికి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడటం వివాదాస్పదంగా మారింది. దీనిపై కొందరు కేటీఆర్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించడం గమనార్హం. ప్రాథమిక విచారణ అనంతరం స్టోర్‌ ఏఈ యాదయ్యను సస్పెండ్‌ చేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.    

నాణ్యత పేరుతో ఆంక్షలు...
గ్రేటర్‌ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, వాటి పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఇటీవల నగరశివార్లలో కొత్తగా వెలుస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు, వెంచర్లు, పారిశ్రామిక వాడలకు కరెంట్‌ సరఫరా చేసేందుకు కొత్తగా లైన్లు వేయాల్సి వస్తుంది. కొత్త లైన్లు, భూగర్భకేబుళ్లు, కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు వంటి ప్రభుత్వ పనులే కాకుండా, ప్రైవేటు వ్యాపార, వాణిజ్య సంస్థలు, అపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన వర్కులను ప్రైవేటు కాంట్రాక్టర్లే ఎక్కువగా చేస్తుంటారు. ఇందుకు అవసరమైన మెటీరియల్‌ను గతంలో కాంట్రాక్టరే స్వయంగా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేవారు. అయితే కొందరు నాశిరకం మెటీరియల్‌ వాడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ట్రాన్స్‌కో, బయటి మెటీరియల్‌పై ఆంక్షలు విధించింది. వర్క్‌ ఎస్టిమేషన్‌ తర్వాత అందుకయ్యే ఖర్చు మొత్తాన్ని సదరు కాంట్రాక్టర్‌ డీడీ రూపంలో సంస్థకు చెల్లిస్తేవారికి అవసరమైన మెటీరియల్‌ను డిస్కమే సరఫరా చేస్తుంది. ఇందుకుగాను ఎర్రగడ్డలోని హైదరాబాద్, రంగారెడ్డి స్టోర్‌లను ఏర్పాటు చేసింది.  

ఒక్కో మెటీరియల్‌కు ఒక్కో రేటు...
ఇలా కొత్తలైన్లకు సంబంధించి ఎలాంటి విద్యుత్‌ మెటీరియలైనా ఇక్కడి నుంచి సరఫరా కావాల్సిందే. దీనిని అవకాశంగా తీసుకుంటున్న కొందరు ఇంజనీర్లు ఒక్కో మెటీరియల్‌కు ఒక్కో రేటు నిర్ణయించారు. ఎవరైనా కాంట్రాక్టర్‌ దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎలక్ట్రిక్‌ స్టోర్‌ నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ తీసుకువెళ్లాలంటే...ఎస్టిమేషన్‌ ఖర్చులు మొత్తం డీడీ రూపంలో చెల్లించిన తర్వాత కూడా స్టోర్‌ ఇంజినీర్లకు అదనంగా ముడుపులు చెల్లించాల్సి వస్తుంది. ఏడీఈకి రూ.1000, ఏఈకి రూ.500, హమాలీకి రూ.500 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఇక ట్రాన్స్‌ఫోర్ట్‌ ఛార్జీలు అదనం. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ పొందాలంటే అదనంగా రూ.7నుంచి రూ.10వేల వరకు ముడుపులు సమర్పించుకోవాల్సి వస్తుంది. దీనికితోడు తూకంలోనూ మోసాలు తప్పడం లేదు. 100కేజీల కండక్టర్‌కు డీడీ చెల్లిస్తే...90 కేజీలే ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక చిన్నచిన్న ఫిన్‌ ఇన్సులేటర్లు, డిస్క్‌లు, వాటికి అమర్చే మెటల్‌ పార్ట్స్‌ను కూడా ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో లెక్కలు చూపుతున్నారు. ఇలా మిగిల్చిన మెటీరియల్‌ను గుట్టుచప్పుడు కా కుండా బయటికి తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇంటి దొంగల పనే..
అమీర్‌పేట: ఎర్రగడ్డ జీటీఎస్‌ కాలనీలోని ఎలక్ట్రికల్‌ స్టోర్స్‌ పనిచేసే ఉద్యోగి రూ.లక్షల విలువైన సామాగ్రిని కాజేసేందుకు యత్నించాడు. దీనిని గుర్తించిన మరో ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తమై ఆయన బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సామగ్రిని తరళిస్తున్న వాహనాన్ని పట్టుకుని ఎస్‌ ఆర్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. కాగా అక్రమంగా మెటీరియల్‌ తరలిస్తున్న డీసీఎంపై టీఎస్‌ఎస్‌పీడీ సీఎల్‌ అని రాసి ఉండగా సదరు వాహనానికి సంస్థకు ఎలాంటి సంబంధం లేదని తేలడం గమనార్హం. సిటీ ఎలక్ట్రికల్‌ స్టోర్స్‌లో డివిజన్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏడీ)తో పాటు మరో ఇద్దరు ఏఈలు కిందిస్థాయి సిబ్బంది పనిచేస్తుంటారు. ఏఈ యాదయ్య గురువారం సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా డీసీఎంలో సుమారు రూ.3 లక్షల విలువైన మెటీరియల్‌ను ఎలాంటి పేపర్లు లేకుండానే బయటికి తరలించాడు.  దీనిని గుర్తించిన మరో ఉద్యోగి ఉన్నత అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో సదరు డీసీఎం బాలానగర్‌ వైపు వెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు దానిని అదుపులోకి తీసుకుని  సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్టోర్స్‌ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉండటంతో కేసును అక్కడికి బదలీ చేశారు. ఏడీ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ అజేయ్‌కుమార్‌ తెలిపారు.  ఏఈ యాదయ్యతో పాటు ఇతర సిబ్బందిని విచారిస్తున్నారు. వాహనం డ్రైవర్‌ నర్సింహ, మరో వ్యక్తి వెంకటేష్‌లను అదుపు లోకి తీసుకున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు