చిన్ననీటి పారుదలకు రూ.100 కోట్లు | Sakshi
Sakshi News home page

చిన్ననీటి పారుదలకు రూ.100 కోట్లు

Published Tue, Jul 22 2014 4:09 AM

Rs 100 crore for minor irrigation

వరంగల్ :  చిన్న నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రాజెక్టుల అభివృద్ధి కోసం జిల్లాకు రూ.100 కోట్ల నిధులు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య చెప్పారు. హైదరాబాద్, వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా రెండున్నర లక్షల ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయిం చినట్లు తెలిపారు. హన్మకొండలోని టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 తమ సర్కార్ తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేస్తోందని, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకుసాగుతోందన్నారు. ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం చూపేందుకు ‘మన ప్రణాళిక’ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందులో అన్ని వర్గాలను భాగస్వామ్యములను చేస్తున్నట్లు పేర్కొన్నా రు. ఇలా చేయడం వల్ల అన్ని సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుందని, ఆ మేరకు బడ్జెట్ కేటాయింపులు చేయనున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతరంగా అఖిలపక్షం ఇందులో పాల్గొనాలని సూచిం చారు.

 సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిం దని, దళితులకు రూ.50వేల కోట్లు, బీసీలకు రూ.25వేల కోట్లు, మైనార్టీలకు రూ.10వేల కోట్లు, గిరిజనలకు రూ.15వేల కోట్లు కేటాయించినట్లు తెలి పారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడు తూ ‘మన ఊరు-మన ప్రణాళిక’ అమలుకు కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ మహత్తరమైన ‘మన ప్రణాళిక’లో ప్రజలంతా భాగస్వాములై రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

 వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ సమాజంలో 85 శాతంగా ఉన్న దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దళిత, గిరిజన కుటుంబాలకు అండగా కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ సహోదర్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మార్నేని రవీందర్‌రావు, పార్టీ నాయకులు మరుపల్ల రవి, లలితాయాదవ్, సంపత్, రాజేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement