125 రూపాయలకే..పేదలకు ‘పవర్‌’ | Sakshi
Sakshi News home page

125 రూపాయలకే..పేదలకు ‘పవర్‌’

Published Thu, Jul 6 2017 1:40 AM

125 రూపాయలకే..పేదలకు ‘పవర్‌’

రూ.3 వేల విలువైన విద్యుత్‌ సామగ్రి కూడా ఉచితం
పేదల కోసం ‘దీన్‌ దయాళ్‌ యోజన’ కింద కొత్త పథకం


సాక్షి, హైదరాబాద్‌
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సదుపాయానికి నోచుకోని పేదలకు సర్కారు శుభవార్త తెచ్చింది. పేదల గృహాలకు కేవలం రూ.125 కే కొత్త విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడంతోపాటు.. మీటరు, హౌజ్‌ వైరింగ్, రెండు ఎల్‌ఈడీ బల్బులు, సర్వీసు వైరును ఉచితంగా అందజేయనుంది. విద్యుత్‌ సదుపాయం లేని ప్రాంతాలకు కొత్త విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయూజేవై)’పథకం కింద డిస్కంలు ఈ కార్యక్రమాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నాయి.

పూర్తిస్థాయి విద్యుదీకరణలో భాగంగా
ప్రస్తుతం కొత్త విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రూ.1,200 చెల్లించాలి. దీంతోపాటు మీటరు, సర్వీసు వైరు, ఇంట్లో అవసరమైన వైర్లు, విద్యుత్‌ పరికరాలు వంటి వాటిని స్వయంగా కొనుక్కోవాలి. ఇది పేదలకు భారంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ విద్యుత్‌ (పవర్‌ ఫర్‌ ఆల్‌)’ కార్యక్రమంలో భాగంగా ‘డీడీయూజేవై’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు కేవలం రూ.100 సెక్యూరిటీ డిపాజిట్, రూ.25 దరఖాస్తు రుసుము కలిపి మొత్తం రూ.125 చెల్లిస్తే కొత్త విద్యుత్‌ కనెక్షన్‌ జారీ చేస్తారు. రూ.3 వేలు విలువైన విద్యుత్‌ సామగ్రిని ఉచితంగా అందజేస్తారు. ఇందులో విద్యుత్‌ మీటర్, సర్వీస్‌ వైరుతో పాటు ఇంట్లో ఒక బల్బు, ఫ్యాన్, సాకెట్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా బోర్డుతో సహా హౌస్‌ వైరింగ్, ఇంటిలోపల, బయట పెట్టుకునేందుకు రెండు ఎల్‌ఈడీ బల్బులు ఉంటాయి. మొత్తంగా ఏడాదిలోగా రాష్ట్రంలో విద్యుత్‌ సదుపాయం లేని పేదల ఇళ్లన్నింటికీ విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రూ.457 కోట్ల అంచనా వ్యయంతో డీడీయూజేవై కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా... అందులో 75 శాతం నిధులను కేంద్రం, మిగతా 25 శాతం నిధులను డిస్కంలు భరించనున్నాయి.

50 యూనిట్ల లోపు ఉచితం..
నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే పేద ఎస్సీ, ఎస్టీల గృహాలకు డిస్కంలు ఇప్పటికే ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాయి. రూ.125కే కొత్త విద్యుత్‌ కనెక్షన్‌ పొందే పేద ఎస్సీ, ఎస్టీల కుటుంబాలు సైతం ఈ పథకం కింద లబ్ధిపొందనున్నాయని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. దీంతో పేద ఎస్సీ, ఎస్టీల కుటుంబాలపై విద్యుత్‌ బిల్లుల భారం ఉండదన్నారు.

ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో..
గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో పేదల గృహాలకు విద్యుత్‌ కనెక్షన్లు లేవు. తాజా కార్యక్రమం కింద ఆ గృహాలన్నింటికి కనెక్షన్లు మంజూరు చేసేం దుకు డిస్కంలు చర్యలు ప్రారంభించాయి. ఒక్కో డివిజనల్‌ ఇంజనీర్‌ కార్యాలయం పరిధిలోని ఇలాంటి గృహాలకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాయి. రాష్ట్రంలో 3.5 లక్షల గ్రామీణ గృహాలకు డీడీయూజేవై కార్యక్రమం కింద విద్యుత్‌ కనెక్షన్లు జారీ చేయనున్నారు. విద్యుత్‌ సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో కొత్త విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, సబ్‌స్టేషన్లను సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement
Advertisement