కరువు ప్రాంతాల్లో తాగునీటికి రూ.179 కోట్లు | Sakshi
Sakshi News home page

కరువు ప్రాంతాల్లో తాగునీటికి రూ.179 కోట్లు

Published Mon, Mar 7 2016 2:31 AM

కరువు ప్రాంతాల్లో తాగునీటికి రూ.179 కోట్లు

గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య విభాగం ప్రతిపాదనలు
 
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కరువు పరి స్థితులు నెలకొన్న ప్రాంతాల్లో తాగునీటి  ఎద్దడి నివారణకు చేపట్టాల్సిన చర్యల నిమిత్తం రూ.179 కోట్లు అవసరమని ప్రకృతి వైపరీత్యాల విభాగం సర్కారుకు నివేదించింది. పల్లెల్లో పరిస్థితులపై గ్రామీణ  నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్), పట్టణ ప్రాంతాల్లో ఎద్దడి పరిస్థితులపై ప్రజారోగ్య విభాగం, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఇచ్చిన అంచనాల మేరకు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు తాజాగా నివేదికను సిద్ధం చేశారు. దాన్ని పరిశీలించి  నిధులను విడుదల చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ప్రకృతి వైపరీత్యాల విభాగం సిఫారసు చేసింది. కరువు ప్రాంతాల్లో తాగునీటి కోసం అవసరమైన చోట్ల కొత్త బోర్లను వేయాలని, పనిచేయని స్థితిలో ఉన్న వాటిని మరమ్మతులు చేయించాలంది. గ్రామీణ ప్రాంతాల్లో బావులను కొత్తగా తవ్వించడం, పాతవాటిని  లోతు చేయాలంది. ఆయా బావు లకు పవర్ పంపులను అమర్చాలంది. గ్రామాల్లోని చెరువులను కాల్వల ద్వారా వచ్చే నీటితో నింపాలంది.గత్యంతరం లేని స్థితిలోనే అద్దె పద్ధతిన ప్రైవేటు వ్యక్తులకు చెందిన వ్యవసాయ బావుల నుంచి నీటి సరఫరా చేయాలంది. తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయాలు లేని పక్షంలోనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని పేర్కొంది.

కరువు మండలాలపై కేంద్రం శీతకన్ను
రాష్ట్రంలోని 231 మండలాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సాయం కోరినా ఆశించిన మేరకు సాయం అందలేదు. కరువు ప్రాంతాల్లో తాగునీటి కోసం రూ.486.16 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, కేంద్రం రూ.88.5 కోట్లు ఇచ్చింది. రూ.310.61 కోట్లు కావాలని ప్రతిపాదనలిచ్చిన గ్రామీణ నీటిసరఫరా విభాగానికి రూ.72.86 కోట్లు, రూ.86.25 కోట్లు అడిగిన ప్రజారోగ్యశాఖకు రూ.9.21 కోట్లు, రూ.83.30 కోట్లను కోరిన హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్‌కు రూ.6.43 కోట్లు ఇచ్చేందుకే కేంద్రం ఆమోదం తెలిపింది.  కరువు మండలాల్లో ప్రస్తుతం నెలకొన్న నీటి ఎద్దడి నివారణకు తక్షణం రూ.179.04 కోట్లు విడుదల చేయాలని ఆయా విభాగాలు కోరాయి.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.55 కోట్లు విడుదల చేయగా, మిగిలిన మొత్తం విడుదలకు సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది.
 

Advertisement
Advertisement