జూపార్కు అభివృద్ధికి రూ.2 కోట్లు | Sakshi
Sakshi News home page

జూపార్కు అభివృద్ధికి రూ.2 కోట్లు

Published Thu, Mar 2 2017 12:12 PM

జూపార్కు అభివృద్ధికి రూ.2 కోట్లు

► ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
► వీవీకేకు కాకతీయ జూలాజికల్‌ పార్కుగా నామకరణం
► జూ లోగో, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ
► ఎన్‌క్లోజర్‌లోకి చిరుతలు
► బ్యాటరీ వాహనం, జంతువుల దత్తత పథకం ప్రారంభం
 
కాజీపేట అర్బన్‌ : హన్మకొండ హంటర్‌ రోడ్డులోని కాకతీయ జూలాజికల్‌ పార్కు అభివృద్ధికి రూ.2.కోట్ల నిధులు మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. హన్మకొండలోని జూ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలను  ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తొలుత వనవిజ్ఞాన కేంద్రానికి కాకతీయ జూలాజికల్‌ పార్కుగా నామకరణం చేశారు. ప్రజల సందర్శనకు అనువుగా బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించారు.
 
హైదరాబాద్‌ నుంచి గత నెల 18న వీవీకేకు తీసుకొచ్చిన తొమ్మిదేళ్ల వయస్సు ఉన్న దేవా, 14 ఏళ్ల వయస్సు గల స్రవంతి అనే రెండు చిరుతలను ప్రజల సందర్శనార్థం ఎన్‌క్లోజర్‌లోకి పంపించారు. అనంతరం జూలాజికల్‌ పార్కు లోగో, మున్‌లైట్‌ క్రియేషన్స్‌ రూపొందించిన పార్కు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అటవీశాఖ జూలోని మూగ జీవాల సంరక్షణ కోసం ప్రత్యేకంగా దత్తత అనే పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ హైదరాబాద్‌ తర్వాత రెండో రాజధానిగా ఓరుగల్లును అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఏటా రూ.300.కోట్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు.1985లో అప్పటి గవర్నర్‌ శంకర్‌దయాల్‌శర్మ చేతులమీదుగా ప్రారంభమైన వనవిజ్ఞాన కేంద్రం ప్రస్తుతం జూలాజికల్‌ పార్కుగా ఎదగడం ఆనందంగా ఉందన్నారు. దీనిని మరింత విస్తరిస్తామన్నారు. జూ ఆక్రమణలకు గురికాకుండా తక్షణమే ప్రహరీ నిర్మించాలని çఅటవీ శాఖ అధికారులకు సూచించారు. 
 
ఏడాదిలోగా జూకు పెద్ద పులి, సింహం
ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ఏడాదిలోపు కాకతీయ జూలాజికల్‌ పార్కుకు పెద్ద పులి, సింహాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఈసందర్భంగా అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలికాట మూడు హంసలు, సీపీ జి.సుదీర్‌బాబు ఐదు నెమళ్లు, ఒక హంస, 13 పావురాలు, వీనస్‌ జ్యూవెల్లర్స్‌ అధినేత రవిచంద్రన్‌ రూ.1.20.లక్షలతో వివిధ రకాల పక్షులు, జంతువులను, వాకర్స్‌ అసోసియేషన్, అటవీశాఖ రూ.50వేలతో చిరుతను దత్తత తీసుకున్నారు. జూపార్కులో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆంధ్యాబ్యాంకు జోనల్‌ బ్రాంచ్‌ రూ.2.లక్షల నిధులు, నగదు రహిత లావాదేవీలకు స్వైపింగ్‌ మిషన్‌ను అందించింది.
 
అనంతరం స్నేక్‌ సొసైటీ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ బాధ్యులు ప్రదర్శించిన స్నేక్‌ షో ఆకట్టుకుంది. మొక్కలు, పర్యావరణ పరిరక్షణపై కీస్, ఇండియన్‌ హైస్కూల్‌ విద్యార్థులు ప్రదర్శించిన నాటకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, మేయర్‌ నన్నపునేని నరేందర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, ఎంపీ పసునూరి దయాకర్, ‘కూడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు జోరిక రమేష్, మాధవిరెడ్డి, బోడ డిన్న, జిల్లా అటవీశాఖ అధికారులు భీమానాయక్, జలాలుద్దీన్‌అక్బర్, పురుషోత్తం, పశువైద్యాధికారి ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement