సొరంగంలో సాఫీగా | Sakshi
Sakshi News home page

సొరంగంలో సాఫీగా

Published Fri, Nov 3 2017 1:21 AM

Rs .215 crore tunnel khajaguda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి.. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ఎక్కడా ఆగకుండా ఇబ్బందులు లేని ప్రయాణానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) భారీ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పంజగుట్ట ఎన్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి జూబ్లీ చెక్‌పోస్టు వరకు.. అక్కడి నుంచి రోడ్‌ నంబర్‌ 45 వరకు.. తర్వాత దుర్గంచెరువు కేబుల్‌ స్ట్రేబిడ్జి ద్వారా ఇనార్బిట్‌ మాల్‌ వరకు టెండర్లు పూర్తి చేసిన జీహెచ్‌ఎంసీ.. తాజాగా ఇనార్బిట్‌ మాల్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు సాఫీ ప్రయాణానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం సొరంగ మార్గంతోపాటు పలు ఫ్లైఓవర్లను నిర్మించనుంది. ఈ పనులకు త్వరలోనే టెండర్లు పిలవనుంది. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,247 కోట్లు కాగా.. వీటిల్లో సొరంగ మార్గానికే దాదాపు రూ.214 కోట్లు వ్యయం కానుంది. ఈ పనులన్నీ పూర్తయితే ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌(ఎన్‌ఎఫ్‌సీఎల్‌) నుంచి ఓఆర్‌ఆర్‌ అవతలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు దాదాపు 11 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు.

ప్రస్తుతం ఇందుకు గంటంపావు సమయం పడుతోంది. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, ఖాజాగూడ, మైండ్‌స్పేస్, బయోడైవర్సీటీ తదితర ప్రాంతాల్లో సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. రాబోయే రోజుల్లో హైటెక్‌సిటీ పరిసరాల్లో ఎన్నో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులు రానున్నాయి. హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీ, మీనాక్షి టవర్స్‌ తదితరమైనవి విస్తరణ దశలో ఉన్నాయి. భవిష్యత్‌ అభివృద్ధి దృష్ట్యా ఐటీ కారిడార్‌లో పది లక్షల మేర జనాభా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రద్దీ సమయాల్లో గంటకు 7 వేల నుంచి 18 వేల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. భవిష్యత్‌లో పరిస్థితి మరింత తీవ్రం కానుండటంతో వీటికి చెక్‌ పెట్టేందుకు ఈ పనులకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు ఖాజాగూడ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ దాటి విప్రో జంక్షన్‌ వైపు ఫీనిక్స్‌ రోడ్‌ వరకు సాఫీ ప్రయాణానికి ఈ భారీ ప్రణాళిక రూపొందించింది.

త్వరలో సొరంగ మార్గానికి టెండర్లు..
ఇనార్బిట్‌ మాల్‌ వైపు నుంచి ఖాజాగూడ జంక్షన్‌ వరకు సొరంగ మార్గం నిర్మించాలని గత ఏడాది ఆలోచించిన అధికారులు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు. భూసార పరీక్షలు తదితరమైనవి నిర్వహించి ఇనార్బిట్‌ మాల్, ఖాజాగూడ మధ్యనున్న పెద్దగుట్టలో సొరంగ మార్గం నిర్మాణానికి అవకాశం ఉండటం తో ప్రస్తుతం టెండర్లకు సిద్ధమవుతున్నారు. రెండు సొరంగ మార్గాలను ఒక్కొక్కటి నాలుగు లేన్ల క్యారేజ్‌ వేలతో ఏర్పాటు చేస్తారు. సొరంగం పొడవు 502.91 మీటర్లు.

యాన్యుటీ విధానంలో టెండర్లు
ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు జీహెచ్‌ఎం సీ వద్ద లేకపోవడంతో యాన్యుటీ విధానంలో టెండర్లను పిలవనున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్సార్‌డీపీ)లో భాగంగా రూ.2,631 కోట్లతో 18 జంక్షన్‌ వద్ద మల్టీలెవెల్‌ ఫ్లైఓవర్లు తదితర పనులకు రెండేళ్ల క్రితం యాన్యుటీ విధానంలో టెండర్లు పిలిచి నప్పటికీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవ డంతో వాటిని రద్దు చేశారు. తర్వాత రూ.వెయ్యి కోట్ల మేర పనులకు ఈపీసీ విధానంలో టెండర్లు పిలవడం తెలిసిందే. యాన్యుటీ విధానంలో తొలుత కాంట్రాక్టరే పెట్టుబడి పెట్టి పనులు పూర్తి చేయాలి. పనులు పూర్తయ్యాక నిర్ణీత వ్యవధుల్లో జీహెచ్‌ఎంసీ నిధులు చెల్లిస్తుంది. ఇటీవల ప్రజారోగ్య శాఖ చేపట్టిన నీటి ప్రాజెక్టులకు యాన్యుటీ విధానంలో టెండర్లు రావడంతో దీనికి అదే విధానం అనుసరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రాజెక్టులోని ముఖ్యమైన పనులు..
►దుర్గంచెరువు కేబుల్‌ స్ట్రేబిడ్జి కింద జంక్షన్‌ను అభివృద్ధి చేయనున్నారు. అక్కడి నుంచి టన్నెల్‌ వైపు రహదారి వరకూ ఆయా ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం.
►టన్నెల్‌ వైపు నుంచి కేబుల్‌ స్ట్రేబిడ్జి వైపు కూడా ఇదే తరహాలో నిర్మాణం.
►కేబుల్‌ స్ట్రేబిడ్జి, ఇనార్బిట్‌మాల్‌ వైపు నుంచి టన్నెల్‌ వైపు ఫ్లైఓవర్‌.
►టన్నెల్‌ వైపు నుంచి ఇనార్బిట్‌మాల్‌ రోడ్‌ వైపు ఫ్లైఓవర్‌.
►హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ప్రాంతం నుంచి టన్నెల్‌ వైపు వచ్చేవారి కోసం రోడ్డు వెంబడి ఎడమవైపు లూప్‌.
► టన్నెల్‌ వైపు నుంచి నానక్‌రామ్‌గూడ, ఓఆర్‌ఆర్‌ వైపు వెళ్లే వారికి సదుపాయంగా టన్నెల్‌ వైపు నుంచి చిత్రపురి కాలనీవైపు రెండో వరుసలో ఫ్లైఓవర్‌. ఇది రెండు వైపులా ఉంటుంది.
►బయో డైవర్సీటీ/గచ్చిబౌలి/లింగంపల్లి వైపు నుంచి టన్నెల్‌ వైపు అప్‌ ర్యాంప్‌.
► టన్నెల్‌ వైపు నుంచి మూడు లేన్ల డౌన్‌ ర్యాంప్‌ 2 లేన్లుగా విడిపోయి మెహిదీపట్నం వైపు.. రెండు లేన్ల కుడివైపు లూప్‌ రెండో వరుస ఫ్లైఓవర్‌ను మొదటి వరుస ఫ్లైఓవర్‌ వద్ద(ఖాజాగూడ జంక్షన్‌) దాటి లింగంపల్లి/బయోడైవర్సిటీ వైపు వెళ్తుంది.
► ఖాజాగూడ జంక్షన్‌ వద్ద(ఓల్డ్‌ ముంబై హైవే) అండర్‌పాస్‌.
►కేబుల్‌ స్ట్రేబిడ్జి కింద, ఖాజాగూడ వద్ద రోటరీలు.

స్టీల్‌ ఫ్లైఓవర్లు..

ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే ఫ్లైఓవర్లను సాధారణ పద్ధతిలో కాకుండా స్టీల్‌తో నిర్మిస్తారు. వీటి పునాది మాత్రం సాధారణ పద్ధతిలోనే ఉంటుంది. మిగతా ఫ్లైఓవర్‌ మొత్తం స్టీల్‌తోనే ఏర్పాటు చేస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement