Sakshi News home page

నాలుగు రోజులు.. 3 కోట్లు!

Published Fri, Feb 27 2015 2:49 AM

నాలుగు రోజులు.. 3 కోట్లు!

* సాగర్‌లో ‘అరుణాచలం’    
 * టీఆర్‌ఎస్ శిక్షణశిబిరానికి జెన్‌కో సీఈ ఏర్పాట్లు
 
 నాగార్జునసాగర్:  ‘‘30 రోజుల్లో రూ.30 కోట్లు ఖర్చు చేయాలి..అప్పుడే మూడు వేల కోట్ల రూపాయలకు అధిపతి అవుతావు’’ అని అరుణాచలం సినిమాలోనిదీ డైలాగ్. హీరో రజనీకాంత్ విలాస జీవితం గడిపి ఈ పోటీలో గెలుస్తాడు. అచ్చం ఇలానే ఉంది సాగర్ జెన్‌కో సివిల్ చీఫ్ ఇంజినీర్ రామ్మోహన్‌రావు పరిస్థితి. కేవలం నాలుగు రోజుల్లో రూ.3 కోట్లు ఖర్చు చేయాలి. అప్పుడే గులాబీ దళపతి వద్ద మెప్పు పొం దాల్సి ఉంది. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? మార్చి 4,5వ తేదీల్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు శిక్షణ  తరగతులు జరగనున్నాయి.
 
 అందుకుగాను రెండురోజులు సీఎంతోపాటు ప్రజాప్రతినిధులు సాగర్‌లో బస చేయనున్నారు. 3వ తేదీ సాయంత్ర మే తెలంగాణలోని గులాబీ దళం సాగర్‌కు చేరుకోనుంది. అయితే రెండో తేదీ వరకే జెన్‌కో అతిథిగృహాన్ని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌గా మార్చి పోలీస్‌శాఖకు  అప్పగించాల్సి ఉంది. జెన్‌కో అతిథిగృహంలో సకల వసతులకు రూ.3 కోట్లు కేటాయించారు. శిక్షణ శిబిరానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ నాలుగు రోజుల్లో మూడు కోట్లు ఖర్చు చేసి అతిథి గృహానికి అందాలు అద్దడానికి చీఫ్ ఇంజనీర్ దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. ఎస్‌ఈ, ఈఈలు, ఏఈలు జేఈలు కంటి మీద కునుకు లేకుండా కృషి చేస్తున్నారు. గురువారం జెన్‌కో సివిల్ చీఫ్ ఇంజనీర్ రామ్మోహన్‌రావు హైదరాబాద్ నుంచి వచ్చి పనులను సందర్శించి ఎంత మేరకు పూర్తయ్యాయో అధికారులతో సమీక్ష సమావేశం జరిపి వెళ్లారు.  
 

Advertisement
Advertisement