నైపుణ్యాభివృద్ధికి రూ.32 వేల కోట్లు | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధికి రూ.32 వేల కోట్లు

Published Sat, Sep 3 2016 1:13 AM

నైపుణ్యాభివృద్ధికి రూ.32 వేల కోట్లు

- రెండేళ్లలో ఖర్చు చేస్తామన్న కేంద్ర మంత్రి ప్రతాప్ రూడీ
- తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం
 
 సాక్షి, హైదరాబాద్: యువతలో నైపుణ్యాన్ని పెంపొం దించేందుకు రానున్న రెండేళ్లలో రూ.32 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్‌రూడీ చెప్పారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా 25 వేల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి రాజధానిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవల ప్‌మెంట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏవీ కళాశాలలో జరిగిన సభలో మాట్లాడు తూ.. ‘తరగతి గది బోధనలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం లభించడం లేదు. చైనా, జపాన్ తదితర దేశాల్లో విద్యార్థులకు ఫ్యాక్టరీల్లోనే శిక్షణ ఇస్తున్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. దేశంలో ఏటా 18 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తుంటే.. 9 లక్షల మందికి ఉద్యోగాలు లభించడం లేదు. తెలంగాణలో యువతకు నైపుణ్య శిక్షణను అందించేందుకు తెలంగాణ జాగృతి ముందుకు రావడం అభినందనీయం’ అన్నారు.  

 విద్యపై ఎంపీలు దృష్టి సారించాలి: గవర్నర్
 రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిందని, ప్రతి ఎంపీ తమ నియోజకవర్గాల్లో విద్యపై దృష్టి సారించాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. విద్యారంగంలో పెనుమార్పులు తీసుకురావాలని, స్కిల్ డెవలప్‌మెంట్ అనేది విద్యలో భాగంగా ఉండాలన్నారు. నైపుణ్యాభివృద్ధి లేకుపోతే మేక్ ఇన్ ఇండియాను తయారు చేయలేమన్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్యూన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... నిరుద్యోగ సమస్యను నిర్మూలించినపుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో నైపుణ్యం కలిగిన యువత తక్కువగా ఉండడమే నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమన్నారు.

 మానవ  వనరుల అభివృద్ధే కీలకం
 అభివృద్ధి అంటే కేవలం రహదారులు, ప్రాజెక్ట్‌ల నిర్మాణం మాత్రమే కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. మానవ వనరుల అభివృద్ధి ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తె లంగాణలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా కేంద్రాల్లో 18 విభాగాల్లో టెన్త్, అంతకన్నా తక్కువ చదువుకున్న వారికి  ఉపాధి శిక్షణను అందిస్తున్నామన్నారు. ఎంపీలు జితేందర్‌రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లలో నైపుణ్య శిక్షణ పొందిన యువతీయువకులు, ట్రైనర్లకు ప్రశంసా పత్రాలు, అవార్డులను కేంద్ర మంత్రి, గవర్నర్ అందించారు. తెలంగాణ జాగృతి బ్రోచర్, వెబ్‌సైట్ ఆవిష్కరించారు.

Advertisement
Advertisement