గజ్వేల్ మార్కెట్‌యార్డుకు మహర్దశ | Sakshi
Sakshi News home page

గజ్వేల్ మార్కెట్‌యార్డుకు మహర్దశ

Published Thu, Nov 6 2014 1:08 AM

Rs 4 crore funds allocated to gajwel market yard in budget

గజ్వేల్ : సీఎం సొంత నియోజకవర్గంలోని గజ్వేల్ మార్కెట్ యార్డుకు మహర్దశ పట్టనుంది. దీని అభివృద్ధి కోసం రూ.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గోదాం, షెడ్లు, సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు గురువారం మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.

అదేవిధంగా  మార్కెట్‌యార్డులో రూ.5కే సద్దిమూట కార్యక్రమం అమలు కానుంది. గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, తూప్రాన్ మండలాల రైతుల ప్రయోజనాల కోసం గజ్వేల్‌లో 19 ఏళ్ల క్రితం మార్కెట్ కమిటీ ఏర్పాటైంది. తూప్రాన్ రోడ్డువైపున సకల హంగులతో యార్డును నిర్మించారు. జిల్లా రైతులే కాకుండా నియోజకవర్గానికి సమీపంలో ఉన్న నల్గొండ, వరంగల్ జిల్లాల రైతులకు కూడా ఈ యార్డు ఆధారమే.

ప్రతిసారి ఆదాయపరంగా సిద్దిపేట తర్వాత స్థానాన్ని సాధిస్తూ జిల్లాలో రెండోస్థానంలో నిలుస్తోంది. కానీ ఈ యార్డులో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ మూడు ఓపెన్ ప్లాట్‌ఫారాలు, మరో మూడు గోదాములు ఉన్నాయి. ఒక గోదామును పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు అద్దెకు ఇచ్చారు. మరో రెండింటిని సీజనల్ అవసరాల కోసం వినియోగిస్తున్నారు.

 రైతులు తీసుకువచ్చే ఉత్పత్తులను ఈ గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అనుమతి లేదు. ఈ మూడు ఓపెన్ షెడ్లలో మాత్రమే రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకునేంత వరకు నిల్వ చేసుకునే వీలుంది. కానీ ఇబ్బడిముబ్బడిగా వస్తున్న ఉత్పత్తులకు ఇది సరిపోవడం లేదు. రెండేళ్లుగా యార్డులో కొనుగోళ్ల సందర్భంగా నిత్యం వేలాది క్వింటాళ్ల ధాన్యం ఆరుబయటే ఉంచాల్సి రాగా, అకాల వర్షాలు కురిసి భారీ నష్టం చోటుచేసుకుంటోంది.

 ఈ క్రమంలోనే యార్డు ఆదాయం నుంచి ఇటీవలే రూ.1.25 కోట్లతో 2500 మెట్రిక్ టన్నుల గోదాము నిర్మాణం పనులను ప్రారంభించగా..అవి ప్రగతి పథంలో సాగుతున్నాయి. అదేవిధంగా మరో రూ.67 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అయినా రైతుల ఇబ్బందులు తీరే అవకాశం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం యార్డు అభివృద్ధికి మరో రూ.4 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులలోని రూ. 1.30 కోట్లతో 2,500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాము, రూ.1.20 కోట్లతో కవర్‌షెడ్ల నిర్మాణం, రూ.80 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.60 లక్షల వ్యయంతో రైతుల విశ్రాంతి భవనం, సమావేశ మందిరం, రూ.10 లక్షల వ్యయంతో టాయిలెట్ల నిర్మాణం జరుగనున్నది.

 ‘సద్దిమూట’కు శ్రీకారం...
 యార్డుకు ఉత్పత్తులను అమ్ముకోవడానికి వచ్చే రైతులకు రూ.5లకే ‘సద్దిమూట’ పథకం కింద హరేరామ ఫౌండేషన్ సంస్థలు భోజనాన్ని అందించనున్నాయి. అభివృద్ధి పనులతోపాటు ‘సద్దిమూట’ పథకాన్ని మంత్రి హరీష్‌రావు ప్రారంభించనున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement