వేల కళ్లల్లో ఆనందం | Sakshi
Sakshi News home page

వేల కళ్లల్లో ఆనందం

Published Sun, May 25 2014 11:58 PM

Rs 5 meal in hyderabad

సాక్షి, హైదరాబాద్: అది నాంపల్లి సరాయి..! సమయం ఇంకా మధ్యాహ్నం 12 గంటలు కాలేదు. పరిసరాల్లోని ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళలు ఇద్దరు ముగ్గురు అక్కడున్నారు. ఇంకా.. ఆటో డ్రైవర్లు.. చిరు వ్యాపారులు.. దినవేతన కార్మికులు.. కాలేజీ కుర్రాళ్లు.. ఇతరత్రా వర్గాల వారు క్రమేపీ పెరుగుతున్నారు. 12 గంటలయ్యాక వాహనంలో అక్కడకు చేరుకున్న వేడివేడి భోజనాన్ని ఆరగించేందుకు ఎంతో ముందుగానే వారంతా అక్కడకు చేరుకున్నారు. క్యూలో నుంచొని టోకెన్ తీసుకొని.. టేబుల్ వద్దకెళ్లి విస్తరాకుల్లో వడ్డించిన భోజనాన్ని ఆత్రంగా అందుకున్న వారి కళ్లలో చెప్పలేని సంతృప్తి.

ఆకలిగొన్న వారు అమృతసమానంగా దాన్ని ఆరగిస్తున్న తీరు అనిర్వచనీయం. కారణం ఎదురుగానే ఉన్న హోటల్‌లో కప్పు చాయ్ రూ. 10. ఇక్కడ అందులో సగం ధర రూ. ఐదులకే కడుపునిండా భోజనం. ఆకలిగొన్న వారికి అంతకన్నా కావాల్సిందేముంటుంది? ప్రతినిత్యం వివిధ సమస్యలతో జీహెచ్‌ఎంసీని తిట్టుకునే వారు సైతం అది ప్రారంభించిన ఈ రూ.ఐదు లకే భోజన పథకాన్ని చూసి ఔరా అనాల్సిందే. ఎందరెందరో అభాగ్యులు.. అనాథలే కాక అన్నార్తులైన అందరికీ ఐదు రూపాయలకే నాణ్యమైన వేడి భోజనాన్ని అందించడం అంత ఈజీ కాదు. హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్‌తో కలిసి జీహెచ్‌ఎంసీ దాదాపు మూడు మాసాల క్రితం ప్రారంభించిన ఈ పథకం ఎందరో అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. నాణ్యతలో రాజీ లేదు. నగరంలోని ఎనిమిది ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ ప్రస్తుతం ఈ పథకాన్ని నిర్వహిస్తోంది.

త్వరలోనే మరో 42 ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచనలో ఉంది. స్థానికులకే కాక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సైతం ఎంతో ఉపయోగపడుతోందీ పథకం. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం తాగునీటి సదుపాయం లేదు. చాలాచోట్ల పైకప్పు లేక వర్షాకాలంలో ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. ఈ చిన్న సమస్యల్ని కూడా తీరిస్తే.. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే కాదు.. హైదరాబాద్ చరిత్రలోనే ఇదో అద్భుత కార్యక్రమంగా మారనుంది. ఆయా ప్రాంతాల్లో పథకం తీరును విజిట్ చేసిన ‘న్యూస్‌లైన్’కు కనిపించిన దృశ్యాలిలా ఉన్నాయి.

 బడ్జెట్ తీరిదీ..
 గ్రేటర్‌లో ఈ పథకం అమలుకు ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 18 కోట్లు కేటాయించారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 300 మందికి ఈ సదుపాయం వర్తింపచేయాలన్నది యోచన కాగా కొన్ని ప్రాంతాల్లో అంతకన్నా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 200-250 మంది వినియోగించుకుంటున్నారు. లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న ఈ పథకంలో భోజన ఖర్చు రూ. 22.50 అవుతుండగా, రూ. 5 లు మాత్రమే ప్రజల నుంచి తీసుకుంటున్నారు. హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ రూ. 2.50 లు తనవంతు విరాళంగా అందజేస్తోంది. మిగతా రూ 15లు జీహెచ్‌ఎంసీ చెల్లిస్తోంది. పేదల ఆకలి తీర్చేందుకు మరింత ఖర్చుకైనా వెనుకాడేది లేదని భావిస్తోంది.

 ఏ కార్పొరేషన్‌లో లేదు..
 తమిళనాడులో అమ్మ పథకం పేరిట సబ్సిడీ ధరలకు క్యాంటీన్లున్నాయి. కానీ దేశంలోని మరే ఇతర నగరంలోనూ ఇలాంటి పథకం లేదు. ఏ మునిసిపల్ కార్పొరేషన్ కూడా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement