ఆర్‌టీసీలో బినామీలు | Sakshi
Sakshi News home page

ఆర్‌టీసీలో బినామీలు

Published Mon, Nov 17 2014 2:57 AM

rtc employees are also in shops tenders

నిజామాబాద్ బస్టాండ్‌లోని దుకాణాల సముదాయాలకు ఇటీవల టెండర్లు నిర్వహించారు. దుకాణం నంబరు 11 కోసం నిజామాబాద్ ఒకటవ డిపోకు చెందిన ఓ యూనియన్ నాయకుడు తన బంధువు పేరు మీద రూ.11 వేలకు టెండర్ దాఖలు చేశారు. అదే దుకాణానికి మరో వ్యక్తి రూ. 20 వేల కు టెండర్ వేశారు. యూనియన్ నాయకుడికి దుకాణం వచ్చేలా ఆర్‌టీసీ కార్యాలయ ఉద్యోగులే ఆయన టెండరు ఫారాలలో రూ. 11 వేలను రూ. 21 వేలుగా మార్చారు. దీనిని గమనించిన ఓ అధికారి టెండర్లను నిలిపి వేశారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు.

నిజామాబాద్ అర్బన్ : రీజియన్‌లో నిజామాబాద్‌దే ప్రధాన బస్‌స్టేషన్. ఇక్కడ 21 దుకాణాలకు గత నెలలో టెండర్లు నిర్వహించగా 92 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే దుకాణాలు ఉన్న వారితోపాటు ఆర్‌టీసీ ఉద్యోగులు కూడా పోటీ పడ్డారు. రీజియన్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి నాలుగు షాపులకు దరఖాస్తు చేసుకున్నా రు. ఇతర దరఖాస్తులు చెల్లుబాటు కాకుండా సహచర ఉద్యోగులతో కలిసి వా రిని అనర్హులుగా సృష్టించారు. హైదరబాద్‌కు వెళ్లే సూపర్‌లగ్జరీ, ఇంద్ర బస్సులకు సహాయకులను నియమించేందుకు అధికారులు టెండర్లు పిలువగా మరో ఉద్యోగి తన బంధువు పేరుతో టెండర్లను దక్కించుకున్నారు.

బస్‌స్టేషన్‌లో శానిటేషన్ కాంట్రాక్టర్‌గా ఆరేళ్ల నుంచి ఆర్‌టీసీ మాజీ ఉద్యోగే ఉన్నారు. మరో ఉద్యోగి బస్‌స్టేషన్ల నిర్వహణ టెండర్ దాఖలు చేసి ఏకంగా 12 బస్‌స్టేషన్లను కాంట్రాక్టు పొందారు. గత సెప్టెంబర్ నెలలో ఆరు దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. బస్టాండ్ ప్రవేశ మార్గంలో ఉన్న మెడికల్ దుకాణాన్ని ఆర్‌టీసీ ఉద్యోగికే కేటాయించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ దరఖాస్తును మరిచిపోయామని అందుకే ఆలస్యంగా పరిశీలించామని చెప్పుకొచ్చారు.

నెలవారి వసూళ్లు
ఆర్‌టీసీ అధికారులకు దుకాణాల సముదాయాల నుంచి వసూళ్ల పర్వం  కొనసాగుతోంది. ఓ దుకాణదారు అధికారులు, వ్యాపారస్తులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. దుకాణానికి నెలకు రూ. 1200 చొప్పున వసూలు చేసి ఆర్‌ఎం కార్యాలయంలో ఇద్దరికి, ఒకటవ డిపోలో మరో ఇద్దరికి అందిస్తున్నారని సమాచారం. ఈ మధ్యవర్తికి దాదాపు పదేళ్లుగా ఒకే చోట షాపును కేటాయించడం గమనార్హం. దీపావళి పండుగ సందర్భంగా బస్టాండ్‌కు చెందిన ఓ అధికారి ఆరువందల చొప్పున వసూలు చేసి అధికారులకు ఇవ్వకుండా తానే ఉపయోగించుకున్నారని, దీంతో వ్యాపారులు ఆ అధికారిపై ఫిర్యాదు చేశారని తెలిసింది. ఇటీవల పాత బస్టాండ్‌ను కూల్చివేశారు. ఇందులో ఉన్న దుకాణాలను వేరే చోటుకు తరలించారు. ఒకే చోట మూడు షాపులను అధికారులు తమవారికి కేటాయిం చారు. ఇతరులకు మాత్రం మీ డబ్బులు వాపస్ ఇస్తామంటూ, నాలుగు దరఖాస్తులు వెనక్కి తీసుకునేలా చేశారు.

చర్యలు తీసుకుంటాం
ఈ విషయం నా దృష్టికి వచ్చింది. టెండర్ల నిర్వహణ కమిటీ నాకు ఇంకా నివేదిక ఇవ్వలేదు. నివేదిక రాగానే పరిశీలించి తప్పు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో మా ఉద్యోగుల పాత్ర ఉంటే కూడా చర్యలు తప్పవు. పారదర్శకంగా టెండర్ల నిర్వహణ చేపడుతాం.

- రమాకాంత్, ఆర్‌టీసీ ఆర్‌ఎం

Advertisement

తప్పక చదవండి

Advertisement