‘సైఫ్‌’ పిటిషన్‌పై 24న ఉత్తర్వులు

18 May, 2019 01:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 వాటాల బదలాయింపు వ్యవహారంలో ‘సైఫ్‌ మారిషస్‌ కంపెనీ లిమిటెడ్‌’దాఖలు చేసిన పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిపై ఈనెల 24న ఉత్తర్వులు ఇస్తామని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ–హైదరాబాద్‌) పేర్కొంది. ట్రిబ్యునల్‌ సభ్యుడు అనంత పద్మనాభ స్వామి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. తమతో చేసుకున్న ఒప్పందం మేరకు టీవీ 9 వాటాల బదలాయింపు జరగలేదని, ఈ విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలను ‘ఐ విజన్‌ మీడియా’ ధిక్కరించిందని గతంలోనే సైఫ్‌ మారిషస్‌ కంపెనీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఐ విజన్‌ మీడియాపై ధిక్కార చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొంది.

ఆ తర్వాత పరిణామాల్లో సైఫ్‌ పెట్టిన పెట్టుబడిని వెనక్కి ఇచ్చేసేందుకు ఏబీసీఎల్‌ శ్రీనిరాజు అంగీకరించారు. ఈ మేరకు ఐ విజన్, సైఫ్‌ మారిషస్‌ కంపెనీల మధ్య ఒప్పందం జరిగింది. దీంతో తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని ఎన్‌సీఎల్‌టీని సైఫ్‌ మారిషస్‌ కోరింది. దీనిపై విచారణ జరుగుతుండగానే.. టీవీ9లో తాను వాటాదారుడినని చెప్పుకుంటున్న సినీనటుడు శివాజీ అభ్యంతరం తెలిపారు. ఈ పరిస్థితుల్లో సైఫ్‌ మారిషస్‌ పిటిషన్‌ శుక్రవారం ఎన్‌సీఎల్‌టీ ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణకు శివాజీ తరపు న్యాయవాదులు ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో ఉపసంహరణ పిటిషన్‌పై ఈ నెల 24న తగిన ఉత్తర్వులు జారీ చేస్తానని ట్రిబ్యునల్‌ సభ్యుడు అనంతపద్మనాభ స్వామి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు