కష్టాలకు కరిగిపోతా.. : ఎమ్మెల్యే సండ్ర | Sakshi
Sakshi News home page

కష్టాలకు కరిగిపోతా.. : ఎమ్మెల్యే సండ్ర

Published Sun, Jun 30 2019 2:22 PM

Sakshi Personal Interview with Sathupalli MLA Sandra Venkata Veeraiah

‘నాకు పాలేరు నియోజకవర్గం రాజకీయ జన్మనిస్తే.. సత్తుపల్లి రాజకీయంగా పునర్జన్మనిచ్చింది. బాల్య దశ నుంచే విద్యార్థి, యువజన ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించా. ప్రజలతో నా అనుబంధం పెనవేసుకోవడంతో సామాన్యుల కష్టాలు, పేదల కన్నీళ్లు, మధ్యతరగతి ప్రజల అవసరాలు మరొకరు చెప్పకుండానే అర్థం చేసుకునే అవకాశం లభించింది. బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో రాజకీయ ప్రస్థానం కొనసాగుతోంది. జనం మధ్య.. ప్రజల కోసం పరితపించడం అంటే నాకు అత్యంత ఇష్టం. కమ్యూనిస్టు భావాలతో పెరిగిన నేను పేదల కష్టానికి ఇట్టే కరిగిపోతా.. హేతుబద్ధంగా ఆలోచించడానికి ఇష్టపడతా.. అంటున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో ఈ వారం పర్సనల్‌ టైమ్‌.

           మాది సాధారణ రైతు కుటుంబం. నాన్న పేరు భిక్షం, అమ్మ లక్ష్మమ్మ. ఉన్నదాంట్లో సర్దుకోవడం, ఎవరికైనా ఆపద వస్తే నేనున్నాననే ఆత్మస్థైర్యం కల్పించడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. చిన్న వయసులోనే అమ్మను కోల్పోయినా.. మాతృప్రేమను రుచి చూపించింది మాత్రం కమల సరోజిని, ఒండ్రు దేవదానం దంపతులే. 4వ తరగతి నుంచి వారే పెంచి పెద్ద చేశారు. కూసుమంచి ప్రభుత్వ పాఠశాలలో వారు పనిచేస్తున్న సమయంలో ఏర్పడిన పరిచయం ఇప్పటికీ ఆత్మీయత, అనురాగాల మధ్య కొనసాగుతోంది. వాళ్లని దేవుడిచ్చిన తల్లిదండ్రులుగానే భావిస్తా. ఏ హోదాలో ఉన్నా.. ఏ పనిచేసినా క్రమశిక్షణాయుతంగా చేయడం నాకు చిన్నప్పటి నుంచి అబ్బిన అలవాటు. దీనికి కారణం అతి చిన్న వయసులో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తగా పనిచేయడంతో క్రమశిక్షణ అలవడింది.

విద్యార్థి సంఘం నాకు వ్యక్తిగత క్రమశిక్షణను నేర్పితే.. డీవైఎఫ్‌ఐ యువజన విభాగం నా రాజకీయ ఎదుగుదలకు కారణమైంది. రాజకీయంగా ఏ హోదాలో పనిచేసినా ప్రజల మధ్య.. ప్రజల కోసం పనిచేసే లక్ష్యం సీపీఎం నుంచే లభించింది. సీపీఎంలో అనేక మంది నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంది నా రాజకీయ ఎదుగుదలలో అత్యంత కీలక పాత్ర. అలాగే సీపీఎం మాజీ శాసనసభా పక్ష నాయకుడు బోడేపూడి వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు యోధులు మంచికంటి రామకిషన్‌రావు, కేఎల్‌.నరసింహారావు, పిల్లుట్ల వెంకన్న నాకు స్ఫూర్తిప్రదాతలు.  

‘తుమ్మల’ది అత్యంత కీలక పాత్ర.. 

రాజకీయంగా సీపీఎం నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీలో చేరిన నన్ను అక్కున చేర్చుకుని.. రాజకీయంగా అండదండలు అందించి.. నా రాజకీయ ప్రస్థానం కొనసాగడంలో అత్యంత కీలక పాత్ర మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది. తుమ్మల ధైర్యం కల్పించడంతో సత్తుపల్లిలో 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించా. అప్పటి నుంచి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలే నా సర్వస్వం. రాజకీయ నేతల పట్ల ప్రజలకున్న అభిప్రాయాన్ని తప్పు పట్టలేం కానీ.. ప్రతి నాయకుడిని ఒకే గాటన కట్టి చూడడం మాత్రం ఒక్కోసారి బాధేస్తుంది. నా రాజకీయ జీవితంలో డబ్బు పాత్ర చాలా పరిమితం. డబ్బులతో రాజకీయం చేసే పరిస్థితి, అవసరం నాకు రాకపోవడం ఇప్పటికీ అదృష్టంగా భావిస్తా. ఇందుకు కారణం కమ్యూనిస్టు పార్టీల్లో పెద్దల అండదండలు ఉండడం, ప్రజల కష్టాలు తెలిసిన మనిషిగా పేరుండడంతో నా రాజకీయ జీవితాన్ని ప్రజలే లిఖించే అవకాశం లభించింది.

ఆడంబరాలు నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. ఇప్పటికీ హైదరాబాద్‌లో ఒకరోజు పని ఉంటే ఆర్టీసీ బస్సులోనే వెళ్లి.. పని చూసుకుని మళ్లీ తిరిగి వచ్చే అలవాటు. సెక్రటేరియట్‌కు, అసెంబ్లీకి ఆటోలో వెళ్లడానికే ఇష్టపడతా. ఇక స్నేహానికి ప్రాణం ఇవ్వడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా స్నేహితుల ఇంట్లో పెళ్లి అయినా.. శుభకార్యమైనా వాళ్ల కుటుంబాల్లో కష్టమైనా.. ఆపదైనా నేనుండి తీరాల్సిందే. వారితో పెనవేసుకున్న అనుబంధం అలాంటిది. నాయకుడిగా నా పరిమితులు, నా పరిస్థితులపై అవగాహన ఉన్న స్నేహితుల మధ్య గడుపుతుండడం ఒకింత గర్వంగా ఉంటుంది. కూసుమంచిలో నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు నా స్నేహితుడు రమణ క్లాస్‌ లీడర్‌గా ఎన్నికైతే ఆయనను అభినందించడం కోసం కూసుమంచి చెరువులో తామరపూలు కోయడానికి స్నేహితుల బృందంతో వెళ్లాం. చెరువులోకి దిగడం ఎంత సులభమో.. రావడానికి మాత్రం తలప్రాణం తోకకొచ్చింది.

కాళ్లకు తామర దారాలు అడ్డం పడి కదిలే పరిస్థితి లేకపోవడంతో నాతోపాటు చెరువులోకి దిగిన స్నేహితులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నాం. చాలా సేపటి తర్వాత బయటకు రాగలిగాం. ఎట్టకేలకు తామరపూలు తెచ్చి రమణను అభినందించాం. ఇక నాకు ఆర్థికంగా ఏ అవసరం వచ్చినా స్నేహితులపై ఆధారపడే అలవాటు ఈ నాటిది కాదు. విద్యార్థి నాయకుడిగా.. యువజన నాయకుడిగా.. సీపీఎం, టీడీపీ. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నా.. నాకు కష్టం వస్తే స్నేహితులకు చెప్పుకోవడం.. వారి ఆర్థిక చేయూతతో సంక్లిష్ట ఎన్నికలను సైతం సునాయాసంగా గట్టెక్కడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు స్నేహితులుగా వారు నాకిచ్చే గౌరవం, నా ఎదుగుదలకు వారిచ్చే ప్రాధాన్యం కారణమని అనిపిస్తుంది.  

వారి అండదండలే.. 

సత్తుపల్లి ప్రజల అభిమానం.. అండదండలే నన్ను నడిపిస్తున్నాయి. పాలేరు, సత్తుపల్లి రెండు నియోజకవర్గాలు నాకు రెండు కళ్లు. అందుకే ఇరు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ఖమ్మంను నివాస కేంద్రంగా చేసుకున్నా.. అంతకుమించి మరో ఆలోచన లేదు. ఇక అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికైన గుర్తింపు సైతం నాకే లభించింది. 1994లో ఎమ్మెల్యేగా పాలేరు నుంచి సీపీఎం తరఫున గెలిచే నాటికి నా వయసు కేవలం 26 ఏళ్లు. ఇక నా కుటుంబ వ్యవహారాలన్నీ మా ఆవిడ మహాలక్ష్మి చూసుకునేది. ఆవిడకు భూదేవికి ఉన్నంత ఓర్పు.. సహనం ఎక్కువ. నా కోపాన్ని భరించడం ఆమెకు మాత్రమే సాధ్యమైంది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కస్సుబుస్సులు సహజమే అయినా.. అవి నలుగురి మధ్య కాక నాలుగు గోడల మధ్య ప్రదర్శించినా.. అర్థం చేసుకునే అర్థాంగి దొరకడం నా అదృష్టం.

ఇక తాతయ్య నాన్నకు ఐదెకరాల పొలం అప్పగిస్తే.. నాన్న అదే ఐదెకరాలు నాకు అప్పజెప్పారు. దానిని కాపాడుకుంటే నేను గొప్పవాడినేనని నాన్న ఎప్పుడూ అంటుండేవారు. ఇప్పటికీ నాన్న మాట మాత్రం నిలబెట్టా. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడుతూనే ప్రజల కోసం ఉద్యమం చేసిన నేతగా పలు కేసులు ఎదుర్కొంటూ న్యాయస్థానాలకు హాజరయ్యేవాడిని. ప్రజల కోసం కోర్టు ముందు ఉన్నాననే భావన ఎంతో సంతృప్తినిచ్చేది. ఇక డీవైఎఫ్‌ఐ ఖమ్మం డివిజన్‌ అధ్యక్షుడిగా నిర్వహించిన కబడ్డీ చాంపియన్‌ టోర్నీ నా రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. అత్యంత పకడ్బందీగా యువకులకు మనో ఉల్లాసం కలిగించే విధంగా నిర్వహించిన కబడ్డీ పోటీలకు ఆలిండియా కబడ్డీ కెప్టెన్‌ హర్‌దీప్‌సింగ్‌ను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్యంను బహుమతి ప్రదానోత్సవానికి పిలిచాం. కమ్యూనిస్టు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించడం, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంతో క్రమశిక్షణాయుత జీవితం అలవడటమేకాదు ఏ ఒక్క చెడు అలవాటు కాలేదు.

నా ప్రాణ స్నేహితుడు లీలామోహన్‌ ఆకస్మిక మరణం నాతోపాటు స్నేహితులందరినీ కొద్దినెలలపాటు కోలుకోలేకుండా చేసింది. ఆయన కుటుంబానికి అండగా ఉండాలనే నా ప్రతిపాదన మిగితా స్నేహితులు, అప్పటి కాంట్రాక్టర్లు కొందరు అంగీకరించడంతో ఇద్దరు ఆడపిల్లల తండ్రి అయిన లీలామోహన్‌ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 1999లో ఆయన మరణించిన కొద్ది రోజులకే ఇద్దరు పిల్లల పేరుపై చెరి రూ.4లక్షల చొప్పున డిపాజిట్‌ చేశాం. ఆయన సతీమణికి గుంటూరు విద్యాశాఖలో ఉద్యోగం ఇప్పించాం. ఆయన ఇద్దరు పిల్లలకు ఏ కష్టం వచ్చినా తామే ఉన్నామనే భరోసా కల్పించాం. వారి పెళ్లిళ్లు అయ్యే సమయానికి చెరొక రూ.24లక్షలు అప్పుడు డిపాజిట్‌ చేసిన ఫిక్స్‌డ్‌ నగదు ఇవ్వగలిగాం. మోహన్‌ను తేలేకపోయినా.. వారి కుటుంబానికి స్నేహితులున్నారనే మనోధైర్యం కల్పించాం. ఇక నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు భార్గవ్, రెండోవాడు తేజ. ఇప్పటికే ఉన్నత చదువులు పూర్తి చేసుకున్నారు. పారిశ్రామిక రంగంలో అడుగిడాలన్నది వారి సంకల్పం.   

Advertisement
Advertisement