ఎర్రజెండోళ్ల ఇంటి ముందు ధర్నా చేయండి | Sakshi
Sakshi News home page

ఎర్రజెండోళ్ల ఇంటి ముందు ధర్నా చేయండి

Published Mon, Sep 7 2015 12:34 AM

ఎర్రజెండోళ్ల ఇంటి ముందు ధర్నా చేయండి

పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి హరీశ్‌రావు సలహా
సీఎం చెప్పినా వినిపించుకోరా?
వాళ్ల మాటలు విని మోసపోయాం.. న్యాయం చేయాలని కార్మికుల వేడుకోలు  

 
రామచంద్రాపురం: ఉద్యోగాలు పోవడానికి కారకులైన ఎర్రజెండోళ్ల ఇంటి ఎదుట ధర్నా చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్‌రెడ్డి నివాసానికి వచ్చిన ఆయనను జీహెచ్‌ఎంసీలో తొలగించిన పారిశుద్ధ్య కార్మికులు కలిశారు. తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరారు. స్పందించిన మంత్రి.. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశుద్ధ్య కార్మికులతో కలసి చీపురు పట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే. అదే మాదిరిగా పారిశుద్ధ్య కార్మికులను అన్నా నమస్తే అంది మన ముఖ్యమంత్రే. సమ్మె వివరమించుకోమని.. జీతాలు పెంచుతానని ముఖ్యమంత్రి చెప్పినా వినిపించుకోకుండా సమ్మె చేశారు. ముఖ్యమంత్రి మాట విని 20 వేల మంది కార్మికులు సమ్మె నుంచి విధుల్లోకి వచ్చారు. మిగతా రెండు వేల మంది ఎర్రజెండోళ్ల మాట విని సమ్మె చేసి నౌకరీలు పోగొట్టుకున్నారు. ముఖ్యమంత్రి దండం పెట్టి మీకు ఇళ్లు కూడా కట్టిస్తానని చెప్పినా ఎవరూ వినకపాయే.

స్థానిక ఎమ్మెల్యే కూడా విరమించమని కోరినా మీరు వినిపించుకోలేదు. అందుకే తొలగించడం జరిగింది’ అన్నారు. దాంతో కార్మికులు ఎర్రజెండోళ్లను నమ్మి మోసపోయామని.. మాకు న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 

Advertisement
Advertisement