సారాపై సమరం | Sakshi
Sakshi News home page

సారాపై సమరం

Published Sun, Sep 13 2015 4:35 AM

సారాపై సమరం - Sakshi

- గ్రామాభివృద్ధి కమిటీలకు అవగాహన కల్పిసున్న ఎక్సైజ్
- నిషేధం అమలుకు పకడ్బందీ చర్యలు
- 48 మంది సారా విక్రేతల బైండోవర్
మోర్తాడ్ :
సారాపై ఎక్సైజ్ శాఖ సమర భేరి మోగించింది. సారా అమ్మకాలపై ఇప్పటివరకు చూసీ చూడనట్టుగా వ్యవహరించారన్న విమర్శలను మూటగట్టుకున్న ఎక్సైజ్ అధికారులు.. తమపై పడిన మచ్చను తుడుచుకునేందుకు చర్యలు చేపట్టారు. గ్రామాలలో తిరుగుతూ, సారా అమ్మితే ఏర్పడే ఇబ్బందులు.. తాగితే కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు. సారా నిషేధం అమలు దిశగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. సారా విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, ఇందుకోసం సర్వాధికారాలను ఉపయోగించుకోవాలని, ఈ విషయంలో విఫలమైతే ఊరుకునేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎక్సైజ్ అధికారుల్లో మునుపెన్నడూ లేనంత కదలిక వచ్చింది. ఒకవైపు దాడులు కొనసాగిస్తూ, మరోవైపు ప్రజలను చైతన్యవంతం చేస్తూ ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
 
కేసులు, బైండోవర్లు
మోర్తాడ్, భీమ్‌గల్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, బిచ్కుంద, దోమకొండలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలోని గ్రామాలలో సారా తయారీ, విక్రయదారులపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. వీరిని అరెస్టు చేస్తున్నారు. గతంలో కేసులలో ఉన్న వారిని సంబంధిత తహశీల్దారుల ముందు బైండోవర్ చేస్తున్నారు. ఇకపై సారా విక్రయించబోమంటూ వారి నుంచి లక్ష రూపాయలకు పూచీకత్తు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 48 మంది సారా విక్రేతలను బైండోవర్ చేశారు. వీరిలో ఒక్క మోర్తాడ్ సర్కిల్ పరిధిలోనే 22 మంది ఉన్నారు. నల్ల బెల్లం వ్యాపారులను కూడా తహశీల్దారుల ఎదుట బైండోవర్ చేసి, కేసులు నమోదు చేస్తున్నారు.
 
ప్రజలతో సమావేశాలు
జిల్లాలోగల పది ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాల చొప్పున సారా నిషేధంపై ప్రజలతో సమావేశాలను అధికారులు నిర్వహిస్తున్నారు. సారా విక్రయాలకు అంతర్గతంగా సహకరిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలకు అవగాహన కల్పిస్తున్నారు. తమ గ్రామం నుంచి సారాను పారదోలుతామంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. సారా తయారీ, విక్రయాలు సాగకుండా చూస్తామంటూ మోర్తాడ్ సర్కిల్ పరిధిలోని గుమ్మిర్యాల్, తిమ్మాపూర్, రామన్నపేట్, దోన్‌పాల్, సుంకెట్ తాండ, చౌట్‌పల్లి, గట్ల కోనాపూర్; భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని సంతోష్‌నగర్; కామారెడ్డి సర్కిల్ పరిధిలోని క్యాసంపల్లి, శాబ్దిపూర్; దోమకొండ సర్కిల్ పరిధిలోని యాడారం, సంగమేశ్వర్ గ్రామాల ప్రజల నుంచి ఎక్సైజ్ అధికారులు హామీ తీసుకున్నారు. మిగతా గ్రామాల ప్రజల నుంచి కూడా ఇలాగే మాట తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
 
జరిమానాకు తీర్మానం
గుమ్మిర్యాల్‌లో సారా విక్రయాలకు అక్కడి గ్రామాభివృద్ధి కమిటీ గతంలో వేలం నిర్వహించింది. దీనిని, ఆ కమిటీ తాజాగా రద్దు చేసింది.  సారా విక్రయిస్తే రూ.10వేల జరిమానా విధించాలని తిమ్మాపూర్, చౌట్‌పల్లి, రామన్నపేట్, దోన్‌పాల్, గట్ల కోనాపూర్‌లోని గ్రామాభివృద్ధి కమిటీలు తీర్మానించాయి. సారా విక్రయాలను నిలిపివేస్తే తాగేవారు మానుకుంటారని ఈ కమిటీలు భావిస్తున్నాయి.
 
పూర్తిగా అడ్డుకుంటాం
సారా విక్రయాలను పూర్తిగా అడ్డుకుంటాం. సారాతో కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నాం. సారాతో ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆర్థిక ఇబ్బం దులతో కుటుంబాలు వీధిన పడతాయని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలి.
- అరుణ్ రావు, డిప్యూటి కమిషనర్, ఎక్సైజ్ శాఖ
 
లొల్లి పోయింది
సారా టెండర్లను రద్దు చేస్తున్నట్టుగా గ్రా మాభివృద్ధి కమిటీలు ప్రకటించడంతో సారా లొల్లి పోయింది. గ్రామాభివృద్ధి కమిటీ టెండర్లు నిర్వహించడంతో ఇన్నాళ్లూ మేము అడ్డు చెప్పలేకపోయాం.     
- తస్లీమ్, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, గుమ్మిర్యాల్
 
కమిటీలు గుర్తించాయి
సారాతో కలిగే నష్టాలను గ్రామాభివృద్ధి కమిటీలు గుర్తించాయి. సారా నిషేధానికి అవి నడుం బిగించడంతో సత్ఫలితాలు వస్తాయి. సారా వ్యాపారులు, తాగేవారిలోనూ కూడా మార్పు వస్తుంది.     
- ఉగ్గెర భూమేశ్వర్, సర్పంచ్, తిమ్మాపూర్

Advertisement
Advertisement