సేవ్‌ ఎన్విరాన్‌మెంట్‌ కోసం ఎమ్మెస్సీ విద్యార్థి పాదయాత్ర | Sakshi
Sakshi News home page

పర్యావరణ ప్రేమికుడు

Published Wed, Jun 27 2018 11:30 AM

Save Environment In Medak - Sakshi

మిరుదొడ్డి(దుబ్బాక) : భుజంపై జాతీయ జెండాతో ‘మొక్కలు నాటండి. ప్లాస్టిక్‌ను నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించండి’ అని ప్లకార్డు చేతబట్టి, కనీసం పాదాలకు పాదరక్షలు లేకుండా పాదయాత్ర చేస్తున్న యువకుడి ఉత్సాహానికి ప్రతి ఒక్కరు జేజేలు పలుకుతున్నారు.

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి తన వంతు బాధ్యత గుర్తించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా నాగిల్‌ గిద్ద మండలం ముక్తాపూర్‌ గ్రామానికి చెందిన పాలడుగు సంగమ్మ, నర్సుగొండి దంపతుల కుమారుడు జ్ఞానేశ్వర్‌ అనే యువకుడు ప్రపంచ పర్యవరణ దినోత్సవం సందర్భంగా మొదలు పెట్టిన పాదయాత్ర సోమవారం మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చేరుకుంది.

తాను వెళ్లే దారిలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని బోధిస్తున్నాడు. దారిలో ఏ పది మంది కనిపించినా ప్లాస్టిక్, పాలిథిన్‌ కవర్ల వల్ల వాతావరణం కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందని అవగాహన కలిగిస్తున్నాడు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలను నాటాలని కనిపించిన వారితో కోరుతున్నాడు. కాగా పర్యావరణాన్ని కాపాడాలన్న సంకల్పంతో జ్ఞానేశ్వర్‌ చేస్తున్న పాదయాత్ర ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి.

అప్పుడే చెప్పులు తొడుగుతా..

నేను సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పర్యావరణ పరిరక్షణకోసం తన వంతు సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి పూనుకున్నాను.

ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి, మొక్కలను విధిగా నాటాలని కోరుతూ కళాశాలకు సెలవులు దొరికినప్పుడల్లా పాదయాత్రలు చేపట్టి అవేర్‌నెస్‌ తీసుకువచ్చేలా కృషి చేస్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5న పాదయాత్ర ప్రారంభించాను.

ప్రస్తుతం 450 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థులకు ‘సేవ్‌ ఎన్విరాన్‌మెంట్‌ బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌’పై అవగాహన కలిగిస్తూ చైతన్యం తీసుకువస్తున్నాను. తెలంగాణ వ్యాప్తంగా 1500 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తయిన తర్వాతనే కాళ్లకు చెప్పులు తొడుగుతానని దీక్షను తీసుకున్నాను. పాదయాత్ర వల్ల సమాజంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. 

– జ్ఞానేశ్వర్, పర్యావరణ పాదయాత్రికుడు

Advertisement

తప్పక చదవండి

Advertisement