పాపం పసివాడు.. | Sakshi
Sakshi News home page

పాపం పసివాడు..

Published Fri, Jun 16 2017 12:24 AM

పాపం పసివాడు..

ఈ రెండింటిలో ప్రపంచంలో మొదటి స్థానంలో భారత్‌
సేవ్‌ ద చిల్డ్రన్‌ అంతర్జాతీయ సంస్థ నివేదికలో వెల్లడి


బంగరు భవిష్యత్తుకు
బాటలు వేయాల్సిన బాల్యం..


అన్నమో రామచంద్రా
అంటూ అలమటిస్తోంది..


గనుల్లో, కార్ఖానాల్లో మగ్గిపోతోంది.. చితికిన కలలతో కొట్టుమిట్టాడుతోంది..

ఇది ‘ఎదగని’ భారతం వ్యథ..
ఆ భారతంలోని బాలల కథ...


ఆడుతూపాడుతూ గడపాల్సిన బాల్యం.. అస్తవ్యస్తంగా మారుతోంది. సరైన ఆహారంలేక అలమటిస్తోంది.. తల్లిదండ్రులు శ్రమించాల్సిన చోట చిన్నారులే కార్మికులుగా మారుతున్నారు. పేదరికం.. నిరక్షరాస్యత.. మొదలైన సమస్యలతో కుటుంబ భారాన్ని తామే మోస్తున్నారు. దీంతో వయసుకు తగ్గ ఎదుగుదల లేని చిన్నారుల సంఖ్యలో మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి చిన్నారుల సంఖ్య 4.82 కోట్లు. అలాగే 3.1 కోట్ల మంది చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారట. ఇది కూడా ప్రపంచంలోనే అతి ఎక్కువ సంఖ్య కావడం గమనార్హం. సేవ్‌ ద చిల్డ్రన్‌ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ తాజా సర్వేలో ఈ విస్తుగొలిపే గణాంకాలు వెల్లడయ్యాయి. 172 దేశాల్లో చేసిన సర్వేలో ఈ విషయాన్ని తేల్చారు. ఎండ్‌ ఆఫ్‌ చైల్డ్‌హుడ్‌ రిపోర్ట్‌ 2017 పేరిట సేవ్‌ ద చిల్డ్రన్‌ సంస్థ అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా జూన్‌ 1న దీనిని విడుదల చేసింది.

బాల్యాన్ని కోల్పోతున్న 70 కోట్ల మంది..
వివిధ దేశాల్లో పలు కీలక అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలు, పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే పోషకాహార లోపం, విద్య అందకపోవడం, బాల కార్మికులు, బాల్య వివాహాలు, నెలలు నిండకుండానే జననాలు, శిశు భ్రూణహత్యలు మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుని సర్వే నిర్వహించారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది చిన్నారులు వివిధ కారణాల వల్ల ముందుగానే తమ బాల్యాన్ని కోల్పోతున్నారని వెల్లడైంది. సరైన ఎదుగుదల లేని పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని, త్వరగా అనారోగ్యం, వ్యాధుల బారిన పడుతున్నారని, వీటి వల్ల త్వరగా మరణిస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.

‘విద్య’కు దూరం.. ‘పని’కి దగ్గర..
దేశంలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయి చిన్నారులు 18.6% మంది పాఠశాలకు వెళ్లడం లేదు. అప్పర్‌ సెకండరీ వయసు కలిగిన 4.7 కోట్ల మంది స్కూళ్లకు వెళ్లడం లేదు. దేశంలోని 4–14 ఏళ్ల వయసు పిల్లల్లో 11.8 శాతం మంది(3.1 కోట్లు) బాల కార్మికులుగా మారుతున్నారు. కుటుంబ పోషణ కోసం పనిలోకి వెళుతున్న వీరంతా చదువు, విశ్రాంతి, ఆటలు, వినోదాన్ని కోల్పోతున్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement