Sakshi News home page

పొదుపు బాటలో ఆర్టీసీ

Published Tue, Jun 23 2015 1:16 AM

పొదుపు బాటలో ఆర్టీసీ - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎట్టకేలకు పొదుపుబాట పట్టింది. రోజురోజుకు పెరుగుతున్న నష్టాలను అధిగమించేందుకు ఖర్చులను నియంత్రించుకోవటంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు అంతర్గత సామర్థ్యానికి పదును పెట్టాలన్న సీఎం ఆదేశంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించే సమయంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు. దీంతో తొలుత ఇంధన రూపంలో అవుతున్న ఖర్చును ఆదా చేయటంతో ఆయ న మాటలను అమలు చేయబోతోంది.

ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి బయో డీజిల్ వాడకాన్ని ప్రారంభించబోతోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇంధనంలో 10 శాతం మేర బయోడీజిల్‌ను వాడబోతోంది. సాధారణ డీజిల్‌తో పోలిస్తే బయో డీజిల్ ధర లీటరుకు రూ.8 మేర తక్కువగా ఉన్నందు న నిత్యం రూ.అరకోటి వరకు ఆదా అవుతుందని అధికారులు లెక్కలేస్తున్నా రు. వెరసి ప్రతినెలా రూ.15 కోట్ల మేర ఇంధన రూపంలో ఖర్చు తగ్గనుంది.
 
గతంలోనే నిపుణుల సూచన

ధర పరంగా డీజిల్ కంటే బయో డీజిల్ చవకైంది కావటంతోపాటు వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే ఉద్గారాలనూ నియంత్రిస్తుంది. ఆర్టీసీ కూడా దీన్ని వినియోగిస్తే ఖర్చు తగ్గుతుందని చాలాకాలం క్రితమే నిపుణులు సూచించారు. దీంతో ఆ దిశగా ఆర్టీసీ కూడా అప్పట్లో చర్యలు చేపట్టింది. కానీ రాష్ట్ర విభజన ఉద్యమాల నేపథ్యంలో అంతర్గతంగా సరైన పరిస్థితులు లేకపోవటంతో అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మధ్యలో కొన్నిసారి టెండర్లు పిలిచినా దాన్ని అమలులోకి తేలేకపోయారు.

ఓసారి గట్టిగానే ప్రయత్నించినా... దాని ధర ఎక్కువే ఉందన్న కారణాన్ని పేర్కొంటూ ప్రతిపాదనను అటకెక్కించారు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో లీటరు డీజిల్‌తో పోలిస్తే రూ.8 వరకు బయోడీజిల్ ధర తక్కువగా ఉంది. ఆ ఇంధనాన్ని సరఫరా చేసే సంస్థలు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ నిత్యం 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ఈ రూపంలో రోజూ అవుతున్న ఖర్చు రూ.3.5 కోట్లు. ఇందులో 10 శాతం వరకు బయోడీజిల్‌ను ఇంధనంగా వాడాలనేది తాజా ప్రతిపాదన.

ప్రస్తుతం మార్కెట్‌లో బయో డీజిల్ ధర లీటర్‌కు రూ.51 వరకు ఉంది. ఇది డీజిల్ కంటే రూ.8 వరకు తక్కువ. ఈలెక్కన ప్రతి లీటరు ఇంధనం వ్యయంలో అంతమేర ఆదా చేస్తే నిత్యం రూ.అరకోటి వరకు ఖర్చు తగ్గుతుంది. రాష్ట్రంలో తొలుత వెయ్యి బస్సులతో ప్రారంభించే యోచనలో అధికారులున్నారు. దాని ఫలి తాల ఆధారంగా ఆ ఇంధనాన్ని మిగతా బస్సులకు కూ డా విస్తరించనున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement