పెట్రోల్‌ బంకుల్లో మోసాలు | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ బంకుల్లో మోసాలు

Published Mon, Jul 30 2018 2:08 PM

Scams In Petrol Bunks - Sakshi

తిప్పర్తి, నల్గోండ : పెట్రోల్‌ బంకుల్లో మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇచ్చిన డబ్బుల కంటే తక్కువగా పెట్రోల్, డీజిల్‌ను పోస్తున్నారు. మరోసారి కల్తీకి పాల్పడుతున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకులో ఇచ్చిన డబ్బుల కంటే తక్కువగా పెట్రోల్‌ పోశారంటూ వాహనదారులు వాదనకు దిగడంతో రెండురోజుల పాటు ఆ బంకును నిర్వహకులు బంద్‌ చేశారు. ఇదే బంకులో ఆదివారం నీళ్లు కలిసిన పెట్రోల్‌ను వాహనదారులు గుర్తించి వాదనకు దిగారు. ఇలా నెలరోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఆ బంక్‌లో అవకతవకలు జరిగినా అధికారులు పట్టించుకోలేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుర్తించింది ఇలా..

స్థానిక హెచ్‌పీ బంక్‌లో తిప్పర్తికి చెందిన నవీన్‌ తన బైక్‌లో రూ.100 పెట్రోల్‌ పోయించుకున్నాడు. సరిగ్గా రెండు కిలోమీటర్లు వెళ్లగానే బైక్‌ ఆగిపోయింది. అనుమానం వచ్చిన నవీన్‌ బైక్‌ను అలాగే నడిపించుకుంటూ బంక్‌ వద్దకు వచ్చి బైక్‌లో ఉన్న పెట్రోల్‌ను బాటిల్‌లోకి తీయగా ఆ పెట్రోల్‌లో నీళ్లు కలిసి ఉన్నాయి. అప్పటికే అదే బంక్‌లో పెట్రోల్‌ పోయించుకున్న కారు స్టార్ట్‌ కాకపోవడంతో బంక్‌ నిర్వాహకులను నిలదీశారు. దీంతో బంక్‌ను బంద్‌ చేసుకున్నారు. 

గతంలో కూడా..

గతంలో కూడా ఇదే బంక్‌లో పెట్రోల్‌లో నీళ్లు కలిశాయని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ బంక్‌ ఉన్న చోట నీరు నిల్వ ఉండడంతో అప్పుడప్పుడు నీళ్ల పైప్‌లైన్‌ పగిలి నీరు పెట్రోల్‌లో కలుస్తుంటుందని పలువురు పేర్కొంటున్నారు.

కొరవడిన అధికారుల నిఘా..

మండల కేంద్రం నుంచి నార్కట్‌పల్లి– అద్దంకి రహదారి ఉండడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. మండల పరిధిలో మొత్తం వివిధ కంపెనీలకు చెందిన ఆరు బంక్‌లు ఉన్నాయి. ఇందులో అనిశెట్టిదుప్పలపల్లిలో 2, మల్లెపల్లివారిగూడెంలో 1, తిప్పర్తిలో 2, ఇండ్లూరులో 1 ఉన్నాయి. ఆయా పెట్రోల్‌ బంకుల్లో అప్పుడప్పుడు వివిధ కారాణాలతో గోడవలు జరుగుతుంటాయి. అయినా అధికారులు పర్యవేక్షించడంలో విఫలం చెందుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement