మీ ఫీజులు కట్టం!

15 May, 2015 00:18 IST|Sakshi

స్థానికేతర విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను సదరు విద్యార్థులకు నిలిపేసింది.ఫలితంగా తోటి విద్యార్థులంతా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందగా.. స్థానికేతర విద్యార్థులు మాత్రం నిరాశ చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14,774 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా.. ఏకంగా ఈ పాస్ వెబ్‌సైట్‌లో వారి వివరాలను బ్లాక్ చేసింది. దీంతో ఆయా విద్యార్థులు ప్రస్తుత కోర్సు ఫీజు చెల్లించే అంశంపై ఆందోళన చెందుతున్నారు.  
- ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులకు బ్రేకు
- వెబ్‌సైట్‌లో నిధుల బదలాయింపు ఆప్షన్ తొలగింపు
- నిలిచిన చెల్లింపులు రూ.50.76 కోట్లు
- ఫలితంగా 14,774 మంది విద్యార్థుల్లో ఆందోళన
- అయోమయంలో కళాశాలల యాజమాన్యాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా:
హైదరాబాద్‌కు చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడంతో జిల్లాలో రికార్డుస్థాయిలో వృత్తివిద్యా కళాశాలలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యధికంగా జిల్లాలో పోస్టుమెట్రిక్ కాలేజీలుండడం.. అందులోనూ పేరున్న కాలేజీలున్నందున ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు.

తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం కొర్రీలు విధించింది. దీంతో కోర్సు మధ్యలో వదిలి వెళ్లలేని పరిస్థితి ఉండడంతో ఆ ప్రాంత విద్యార్థులు ఇక్కడే చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు, ఉపకారవేతనాల నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన విద్యార్థులందరికీ ఫీజులు, ఉపకారవేతనాలు విడుదల చేసిన అధికారులు.. స్థానికేతర విద్యార్థులకు మాత్రం చెల్లింపులు నిలిపివేశారు.

రూ.50.76 కోట్లకు బ్రేక్
జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.2లక్షల మంది పోస్టుమెట్రిక్ విద్యార్థులున్నారు. వీరికి ఆయా సంక్షేమశాఖల ద్వారా ప్రభుత్వం ఉపకారవేతనాలు, ఫీజు రాయితీ నిధులను అందిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఫీజు బకాయిల పంపిణీకి ఉపక్రమించిన ప్రభుత్వం.. స్థానికేతర విద్యార్థులకు సంబంధించి నిధుల పంపిణీకి బ్రేకువేసింది. జిల్లావ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీసీ విద్యార్థులు 11,254 మంది, ఈబీసీ విద్యార్థులు 3,250 మంది ఉన్నారు. వీరికి సంబంధించి రూ.50.76 కోట్ల బకాయిలను అధికారులు నిలిపివేశారు.

వెబ్‌సైట్లో బ్లాక్ చేసి..
ప్రభుత్వం పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రక్రియకు సంబంధించి వ్యవహారమంతా ఈ- పాస్ వెబ్‌సైట్ ద్వారా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడంతో విద్యార్థులు తమ ఫీజు రాయితీ, ఉపకారవేతనాల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అయితే, స్థానికేతర విద్యార్థుల వివరాలను ప్రభుత్వం బ్లాక్ చేసింది. దీంతో ఆయా విద్యార్థులకు ఫీజు రాయితీ, ఉపకారవేతనాల చెల్లింపులు చేసే వీలు లేదు. దీంతో విద్యార్థుల ఈపాస్ స్టేటస్ సైతం కనిపించడం లేదని ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో ఇంజినీరింగ్ ఫైనల్  ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు