నర్సింగ విద్య మిథ్య ! | Sakshi
Sakshi News home page

నర్సింగ విద్య మిథ్య !

Published Mon, Feb 23 2015 1:52 AM

నర్సింగ  విద్య మిథ్య ! - Sakshi

పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం  మొక్కుబడిగా కాలేజీలను నడుపుతున్న వైనం
 బోధకులు లేక ప్రమాణాలు గాలికి  ప్రైవేటు కళాశాలల్లో పరిస్థితి ఘోరం
 ప్రత్యేక డెరైక్టరేట్‌తోనే గాడినపడనున్న వ్యవస్థ
 
 రోగికి వైద్యం అందించేది డాక్టరైతే... రేయింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుతూ సేవలు చేసేది నర్సే. ప్రధాన వైద్యానికి ముందు డాక్టర్ సలహా మేరకు ప్రాథమిక చికిత్స చేసేదీ నర్సే. ఇంతటి కీలకమైన నర్సింగ్ విద్యా విధానం రాష్ట్రంలో మిథ్యగా మారుతోంది. బోధకులు, ప్రమాణాలు లేక కునారిల్లుతోంది. వైద్య విద్యపై దృష్టిపెడుతున్న ప్రభుత్వం నర్సింగ్ కోర్సును మొక్కుబడిగా నడిపించేస్తుండటంతో వేలాది మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు పూర్తి చేస్తున్నా వారిని నైపుణ్యలేమి వెక్కిరిస్తోంది. ఫలితంగా కార్పొరేట్ ఆస్పత్రులు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోయింది. దీంతో అనేక మంది ఇళ్లలో రోగులకు సేవలు చేసే దినసరి వేతన జీవులుగా మిగిలిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రోగులకు నైపుణ్యంగల నర్సులు దొరకడం కష్టంగా మారే ప్రమాదం ఉంది.
 - సాక్షి, హైదరాబాద్
 
 ఎందుకీ దుస్థితి...?
 రాష్ట్రంలో దాదాపు 15 కార్పొరేట్ నర్సింగ్ కాలేజీలను మినహాయిస్తే మిగిలిన చోట్ల నర్సింగ్ విద్య కుప్పకూలింది. ప్రధానంగా అర్హులైన అధ్యాపకులు లేకపోవడ ంతో ప్రమాణాలు పడిపోతున్నాయి. భారత నర్సింగ్ మండలి (ఐఎన్‌సీ) నిబంధనల ప్రకారం 40 నుంచి 60 సీట్లు ఉండే కాలేజీలో ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, మరో ఇద్దరు అసిస్టెంటు ప్రొఫెసర్లు ఉండాలి. అలాగే 13 నుంచి 18 మంది ట్యూటర్లు ఉండాలి. కానీ జగిత్యాల, ఆదిలాబాద్‌లలోని బీఎస్సీ నర్సింగ్ కాలేజీలలో ఒక్క అధ్యాపక పోస్టును కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఆదిలాబాద్ నర్సింగ్ కాలేజీకి ఎంఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన ఒకరిని ప్రిన్సిపాల్‌గా డిప్యూటేషన్‌పై పంపారు. ఈ రెండు కాలేజీలకు చెరో నలుగురు అర్హతలేని సిబ్బందిని డిప్యూటేషన్‌పై బోధనకు పెట్టారు.
 
 ప్రత్యేక డెరైక్టరేటే పరిష్కారం...
 గాడితప్పిన నర్సింగ్ విద్యావిధానాన్ని పర్యవేక్షించాల్సిన వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) వైద్య విద్యపై తప్ప నర్సింగ్ విద్యపై దృష్టిపెట్టట్లేదనే విమర్శలున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నర్సింగ్ డెరైక్టరేట్ ప్రత్యేకంగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లోనైతే సెక్రటేరియట్‌లో ప్రత్యేకంగా ఒక నర్సింగ్ సెక్రటరీని ఏర్పాటు చేశారు. డీఎంఈ కింద ఉమ్మడి రాష్ట్రంలో నర్సింగ్‌కు ఒక డిప్యూటీ డెరైక్టర్ ఉండగా రాష్ట్ర విభజనతో ఆ పోస్టు ఏపీకి వెళ్లింది. దీంతో నర్సింగ్ ఆడిటింగ్ చేసే దిక్కే లేకుండాపోయిందని పారామెడికల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనునాయక్, ప్రధాన కార్యదర్శి గోవర్దన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ప్రత్యేక డెరైక్టరేట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
 
 ఉస్మానియాలోనూ అదే తీరు...
 ఉస్మానియాలో 60 బీఎస్సీ, 30 ఎమ్మెస్సీ, పది పోస్ట్ బేసిక్ నర్సింగ్ సీట్లు ఉండగా నాలుగేళ్ల బీఎస్సీలో 240 మంది విద్యార్థులు, రెండేళ్ల ఎంఎస్సీలో 60 మంది, రెండేళ్ల పోస్ట్ బేసిక్‌లో 20 మంది మొత్తం 320 మంది విద్యార్థులున్నారు. ఆ ప్రకారం ఎమ్మెస్సీకి ఐదుగురు ప్రొఫెసర్లు, బీఎస్సీకి నలుగురు ప్రొఫెసర్లు ఉండాలి. కానీ బీఎస్సీ, ఎమ్మెస్సీకి కలిపి ఒక్కరే ప్రొఫెసర్ ఉన్నారు. మొత్తం 42 మంది అధ్యాపక సిబ్బందికిగాను 25 మందే ఉన్నారు. గాంధీ నర్సింగ్ కాలేజీలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, ఒక వైస్ ప్రిన్సిపాల్ ఉండగా అధ్యాపకులెవరూ లేకపోవడం గమనార్హం.
 
 భ్రష్టుపట్టిన ప్రైవేటు నర్సింగ్ కాలేజీలు
 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో సీట్లు వందల్లో ఉంటే ప్రైవేటు కాలేజీల్లో ఇబ్బడిముబ్బడిగా వేలాది సీట్లు ఉన్నాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఐఎన్‌సీ ఇష్టారాజ్యంగా నర్సింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చిందన్న విమర్శలున్నాయి. దాదాపు 90 శాతం నర్సింగ్ కాలేజీలకు అధ్యాపకుతోపాటు సొంత భవనాలు లేవు. దీనికితోడు చాలా కాలేజీలు పరీక్షలప్పుడు డబ్బులు తీసుకొని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా తనిఖీల సమయంలో బయటి వ్యక్తులను అధ్యాపకులుగా చూపుతున్నాయి.
 
 కాలేజీలు ఎన్ని...
 రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు బీఎస్సీ నర్సింగ్ కాలేజీలున్నాయి. అవి హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, వరంగల్, జగిత్యాల, ఆదిలాబాద్‌లలో నడుస్తున్నాయి. అలాగే ఉస్మానియాలోనే ఒక ఎంఎస్సీ నర్సింగ్ కాలేజీ ఉంది. ప్రైవేటు రంగంలో 64 బీఎసీ నర్సింగ్ కాలేజీలు, 131 నర్సింగ్ స్కూళ్లు, 8 ఎంఎస్సీ కాలేజీలున్నాయి. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కలిపి 209 నర్సింగ్ కాలేజీలున్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ నర్సింగ్ సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో 280 నర్సింగ్ సీట్లు ఉండగా... ప్రైవేటులో 5,407 సీట్లు ఉన్నాయి. ఇవిగాక నర్సింగ్ స్కూళ్లల్లో దాదాపు 2 వేల సీట్లు ఉన్నట్లు అంచనా. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐదు నర్సింగ్ కాలేజీలకూ సొంత భ వనాలుకానీ, హాస్టల్ భవనాలుకానీ లేకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement