బడులు మూసివేయం | Sakshi
Sakshi News home page

బడులు మూసివేయం

Published Wed, Oct 1 2014 2:06 AM

schools will not be closed in telangana

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణలో భాగంగా పాఠశాలలు మూసివేసే ప్రసక్తేలేదని, ఈ నిబంధన తొలగిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రేషనలైజేషన్‌కు సవరణ చేస్తామన్నారు. మంగళవారం  సచివాలయంలో  రేషనలైజేషన్ ఉత్తర్వులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. 19 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 75 మంది లోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు, ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లను పక్కస్కూళ్లలో విలీనం చేసేలా విద్యాశాఖ జారీ చేసిన రేషనలైజేషన్ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘా లు వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను ఉపసంహరించాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ (టీటీజేఏసీ), ఇతర సంఘాల నేతలు మంగళవారం జగదీశ్‌రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్షించి, స్కూళ్ల మూసివేత నిబంధనను తొల గించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలి సింది. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. నిబంధనలు సవరించి టీచర్ల రేషనలైజేషన్ వేసవి సెలవుల్లో చేపడతామన్నారు. స్కూళ్ల మూసివేత ప్రభుత్వ విధానం కాదన్నారు. గత ఏడాది బదిలీ అయినా, పాతస్థానాల్లోనే కొనసాగుతున్న టీచర్లను రిలీవ్ చేస్తే స్కూళ్లు మూతపడతాయనే ఉద్దేశంతోనే వారిని రిలీవ్ చేయలేదన్నారు. అలాంటిది ఇపుడు రేషనలైజేషన్ పేరు తో స్కూళ్లను ఎందుకు మూసివేస్తామన్నారు. ఉత్తర్వుల జారీ విషయంలో ఏదో జరిగిందని, దానిని వెంటనే సవరిస్తామన్నారు. గిరిజనతండాల్లో 10 మందే విద్యార్థులుంటారని, అక్కడ స్కూల్ మూసివేస్తే విద్యార్థులు విద్యకు దూరం అవుతారని చెప్పారు. హేతుబద్ధీకరణ ఎప్పుడనేది విద్యాశాఖ నిర్ణయిస్తుందన్నారు. దీంతో సంఘాలకు సంబంధం లేదన్నారు. రేషనలైజేషన్ తర్వాతే ఎంతమంది కొత్తటీచర్లు అవసరమనేది తేలుతుందన్నారు. మంగళవారం సాయంత్రం విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్‌తో మంత్రి మరోసారి సమీక్ష నిర్వహించారు. సవరణ ఉత్తర్వులు జారీ చేసి, ఇప్పుడే రేషనలైజేషన్ చేయాలనే ఆలోచన చేసినట్టు  తెలిసింది. బుధవారం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
 
 జీవోనే ఇవ్వలేదన్నారు
 
 ప్రభుత్వం హేతుబద్ధీకరణ ఉత్తర్వులు ఇవ్వలేదని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. మంగళవారం సచివాలయంలో మంత్రిని కలసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27నే జీవో వచ్చిందని తాము పేర్కొనగా, స్కూళ్ల మూసివేత నిబంధనను తొలగిద్దామని మంత్రి చె ప్పినట్టు నేతలు వెల్లడించారు.
 

Advertisement
Advertisement