గణనాథ... ఇక సెలవు | Sakshi
Sakshi News home page

గణనాథ... ఇక సెలవు

Published Mon, Sep 8 2014 2:16 AM

గణనాథ... ఇక సెలవు - Sakshi

నీలగిరి : భక్తిశ్రద్ధలతో నవరాత్రి పూజలందుకున్న గణనాథులను ఆదివారం నిమజ్జనం చేశారు. నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం ముగిసింది. ఆదివారం ఉదయం 9 గంటలకు నల్లగొండలోని మాధవనగర్ మొదటి విగ్రహం వద్ద నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, బండా నరేందర్ రెడ్డి, కలీం, కాంగ్రెస్‌నేత హఫీజ్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. సూర్యాపేటలో పూల సెంటర్ విగ్రహం వద్ద జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. నల్లగొండ పట్టణంలోని పాతబస్తీలో ముస్లిం మత పెద్దలు భక్తుల సౌకార్యార్థం తాగునీటి వసతి కల్పించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఊరేగింపులు రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా 13 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారు.
 
 అత్యధికంగా నల్లగొండ పట్టణంలో సుమారు ఐదు వందల విగ్రహాలను నాగార్జునసాగర్ ఎడమకాల్వ 14వ మైలురాయి వద్ద ఏఎమ్మార్పీ కాల్వలో నిమజ్జనం చేశారు. సాగర్‌లో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సూర్యాపేట, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి ప్రాంతాల్లో చెరువులు, మూసీ నదిలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. సూర్యాపేటలో సద్దల చెరువులో గణనాథులను నిమజ్జనం చేశారు. మిర్యాలగూడ, నకిరేకల్ ప్రాంతాల్లో మూసీ నది, సాగర్ ఎడమ కాల్వలో నిమజ్జనం చేశారు. అనుముల మండలం అలీనగర్ (14వ మైలురాయి ) వద్ద నిమజ్జన కార్యక్రమాన్ని మిర్యాలగూడ డీఎస్పీ మోహన్, ఆర్డీఓ కిషన్‌రావు పర్యవేక్షించారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు నాగార్జునసాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
 
 పెద్ద ఎత్తున ఊరేగింపు ఉత్సవాలు
 గణేశ్ శోభాయాత్రలో విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్లగొండలో ఉదయం చిరుజల్లుల కురుస్తున్నా శోభాయాత్రను ముందుకు నడిపించారు. పట్టణాల్లో అపార్ట్‌మెంట్ వాసులు సామూహికంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ, భజనలు, మహిళ నృత్యాలు, కోలాటాలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి పట్టణాల్లో అశేషజనవాహని మధ్య శోభాయాత్ర ప్రజలను కనువిందు చేసింది. ఇదిలావుంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. 2600 మందితో బందోబస్తు నిర్వహించారు. పోలీస్ శాఖతోపాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, రోడ్‌పార్టీ, స్పెషల్ పోలీసుల సహకారంతో గణనాథుడి శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా తగు జాగ్రత్తలు పాటించారు.
 
 తగ్గిన లడ్డూ వేలం పాటలు..
 ప్రతి ఏడాది గణేశ్ నిమజ్జనం రోజున లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా జరిగేవి. కానీ ఈ ఏడాది మిర్యాలగూడలో వేలం పాటలకు స్వస్తి చెప్పారు. గణేశ్ విగ్రహం వద్ద ఉన్న లడ్డూలను భక్తులు ప్రసాదంగా పంచిపెట్టారు. పట్టణంలోని ముత్తిరెడ్డి కుంటలో గణేశ్ విగ్రహం వద్ద ఉంచిన అతిపెద్ద 66 కిలోల లడ్డూను కూడా భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు.
 
 నల్లగొండ, సూర్యాపేటలలో కూడా లడ్డూ వేలం పాటలు తగ్గాయి. నల్లగొండలో మాధవనగర్ గణేశ్ విగ్రహం వద్ద నిర్వహించిన వేలం పాటలో లడ్డూ రూ.26 వేలు పలికింది. దేవరకొండలో ఎంకేఆర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద లడ్డూను రూ.87 వేలకు వేలంపాటలో కిషన్‌నాయక్ దక్కించుకున్నారు. హుజూర్‌నగర్‌లో రెండవ వార్డులో ఏర్పాటు చేసిన వి గ్రహం వద్ద లడ్డూను వేలంలో రూ.66,116లకు దొంతిరెడ్డి గౌతమ్‌రెడ్డి దక్కించుకున్నారు. మఠంపల్లిలో లడ్డూ ను రూ. 65,000లకు గాయం శ్రీనివాసరెడ్డి సొంతం చేసుకున్నారు. కట్టంగూర్‌లోని రాంనగర్ విగ్రహం వద్ద లడ్డూను రూ.66 వేలకు అంతటి చంద్రశేఖర్ దక్కించుకున్నారు. కోదాడలో క్వాన్సింగ్ ఏజెంట్స్ ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద 150 కేజీల లడ్డూను వేలం పాటలో రూ.50,116లకు గుడుగుండ్ల రఘు దక్కించుకున్నారు.

Advertisement
Advertisement