మా పంచాయతీలకు వెంటనే ఎన్నికలు పెట్టాలి | Sakshi
Sakshi News home page

మా పంచాయతీలకు వెంటనే ఎన్నికలు పెట్టాలి

Published Thu, Sep 11 2014 1:03 AM

should be conduct elections to my panchayat

సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా దుబ్బాక మండల పరిధిలోని దుబ్బాక, ధర్మాజీపేట, లచ్చపేట, చర్వాపూర్, దుంపలపల్లి, చెల్లాపూర్, మల్లాయ్‌పల్లి గ్రామ పంచాయతీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని దుబ్బాక గ్రామానికి చెందిన కె. బంగారయ్య, జి. ఆంజనేయులు దాఖలు చేశారు.

 ఇందులో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. దుబ్బాక నగర పంచాయతీ ఏర్పాటును రద్దు చేస్తూ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తీర్పునిచ్చిందని, ఈ తీర్పు ప్రకారం నగర పంచాయతీలో భాగమైన పంచాయతీలను డీ నోటిఫై చేయాల్సిన అధికారులు, ఆ పని చేయలేదని పిటిషనర్లు తెలిపారు.

దీనిపై తాము అధికారులను కలిసినప్పుడు, గ్రామ పంచాయతీలను పునరుద్ధరించాలని హైకోర్టు ఎప్పుడూ చెప్పలేదంటూ సమాధానమిచ్చారని వివరించారు. హైకోర్టు తీర్పును సైతం అధికారులు పట్టించుకోకపోవడం వల్ల తమ గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఈ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గుర్తించినా కూడా అధికారుల తీరు వల్ల ఆ కార్యక్రమంలో పాలుపంచుకోలేకపోయాయని వివరించారు. అందువల్ల ఈ వ్యవహారంలో వెంటనే జోక్యం చేసుకుని, దుబ్బాక, ధర్మాజీపేట, లచ్చపేట, చర్వాపూర్, దుంపలపల్లి, చెల్లాపూర్, మల్లాయ్‌పల్లి గ్రామ పంచాయతీలను డీ నోటిఫై చేసి, వాటికి వెంటనే ఎన్నికలు నిర్వహించేలా అధికారులను ఆదేశించాలని వారు కోర్టును కోరారు.

Advertisement
Advertisement