ఈ గుర్రమెందుకు‘రొయ్యో’..

12 Oct, 2018 05:25 IST|Sakshi

చేపలు పట్టాలంటే ఏం కావాలి? ముందుగా ఓ వల.. ఆ తర్వాత పడవ.. కదా.. ఇదే ప్రశ్న.. బెల్జియంలోని ఓస్ట్‌డూన్‌కెర్క్‌కు వెళ్లి అడగండి.. ముందుగా ఓ వల.. ఆ తర్వాత గుర్రం అని సమాధానమిస్తారు.. గుర్రానికి చేపల వేటకు ఏం సంబంధం? ఉంది.. ఎందుకంటే.. ఇక్కడ గుర్రమెక్కే ష్రింప్స్‌(రొయ్యల్లాంటివి), చేపలను వేటాడతారు. గుర్రాలు దాదాపుగా నడుంలోతు మునిగేస్థాయి వరకూ సముద్రంలోకి వెళ్లి.. తిరిగి తీరం వైపు వస్తారు. వెనుక వైపు వల కట్టి ఉంటుంది. తీరానికి వచ్చాక.. అందులో చిక్కే ష్రింప్స్, ఇతర చేపలను అమ్ముకుంటారు.

ష్రింప్స్‌తో చేసిన వంటకాలకు అక్కడ తెగ డిమాండ్‌ ఉంది.. 500 ఏళ్ల క్రితమైతే బెల్జియంతోపాటు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, దక్షిణ ఇంగ్లండులలో ఇలా గుర్రమెక్కే ష్రింప్స్‌ని వేటాడేవారు. అప్పట్లో అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే.. గుర్రమెక్కి చేపలు వేటాడుతున్న మత్స్యకారుల విగ్రహాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత తర్వాత ఆధునిక పద్ధతుల రాకతో ఈ తరహా విధానం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఓస్ట్‌డూన్‌కెర్క్‌లో మాత్రమే గుర్రమెక్కి చేపలను పట్టే మత్స్యకారులు ఉన్నారు. అదీ ఓ డజను కుటుంబాలు మాత్రమే. వారు కూడా పర్యాటకుల కోసం.. తమ సంప్రదాయాన్ని బతికించుకోవడం కోసం దీన్ని కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు