లాకప్‌ హింస లైవ్‌ | Sakshi
Sakshi News home page

లాకప్‌ హింస లైవ్‌

Published Wed, Apr 12 2017 3:23 AM

లాకప్‌ హింస లైవ్‌ - Sakshi

  • అప్పు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తికి వంతపాడుతూ ఎస్సై దాష్టీకం
  • అప్పు ఇచ్చిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి దాడి
  • ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ కేకలను ఫోన్‌లో ప్రత్యర్థికి వినిపిస్తూ ‘లైవ్‌’
  • ‘చాలా.. హ్యాపీయా’ అంటూ రెచ్చిపోయిన వైనం
  • పేట్‌బషీరాబాద్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కోటేశ్వరరావు దుర్మార్గం
  • సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు బాధితుడి ఫిర్యాదు
  • సీపీ ఆదేశాల మేరకు అదే పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
  • పరారీలో కోటేశ్వరరావు.. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆడియో

  • కుత్బుల్లాపూర్‌: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే.. ప్రజలకు, బాధితులకు కాదు.. డబ్బులు తీసు కుని ఎగ్గొట్టినవారికి ఫ్రెండ్లీ అనేలా ప్రవర్తిం చాడో ఎస్సై. అప్పు ఇచ్చినవారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్టుగా కొట్టాడు. నోటికొచ్చిన బూతులు తిడుతూ ‘థర్డ్‌’డిగ్రీ ఇంటరాగేషన్‌ చేశాడు. అసలు అప్పు ఇవ్వ డానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటూ చావబాదాడు..అంతేకాదు వారి అరుపులు, ఆర్తనాదాలను ఫోన్‌లో అవతలి పార్టీకి లైవ్‌లో వినిపించాడు. ‘చాలా.. హ్యాపీయా’అంటూ సిబ్బందితోనూ కొట్టించాడు.. మొత్తంగా పోలీసులు తలదించుకునేలా ప్రవర్తించాడు. హైదరాబాద్‌లోని పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై కోటేశ్వరరావు నిర్వాకమిది..

    ఏం జరిగింది?
    కేపీహెచ్‌బీ కాలనీ శాతవాహననగర్‌కు చెందిన శివప్రదీప్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటారు. శివప్రదీప్‌కు 2015లో తన స్నేహితుడు బాబు ద్వారా రవీంద్ర ప్రసాద్‌ పరిచయమయ్యాడు. తాను మెడికల్‌ ఫీల్డ్‌లో ఉన్నానని, రియల్‌ ఎస్టేట్, రంగురాళ్ల వ్యాపారాలు కూడా చేస్తున్నానని రవీంద్ర ప్రసాద్‌ చెప్పాడు. తనకు వ్యాపారం కోసం డబ్బులు కావాలని అతను కోరగా.. శివప్రదీప్‌ 2015 నుంచి 2016 మధ్య రూ.25 లక్షలు, రూ.45 లక్షలు, ఐదు లక్షలు.. మొత్తం రూ.75 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత డబ్బులు తిరిగివ్వాలని శివప్రదీప్‌ కోరితే.. రవీంద్ర ప్రసాద్‌ ఏవో కారణాలు చెబుతూ వాయిదావేస్తూ వచ్చాడు. దీంతో శివప్రదీప్‌ బాలానగర్‌ డీసీపీని సంప్రదించగా.. పేట్‌ బషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వద్దకు వెళ్లమన్నారు. అక్కడికి వెళితే ఇది సివిల్‌ అంశం, కోర్టులో ఫిర్యాదు చేయాలని సూచించారు.

    తర్వాత శివప్రదీప్‌ తన అప్పు తీర్చాల్సిందిగా రవీంద్ర ప్రసాద్‌పై మళ్లీ ఒత్తిడి తెచ్చాడు. దాంతో రుణానికి ష్యూరిటీగా సిద్దిపేటలోని 1.17 గుంటల భూమి, 1.18 గుంటల మరో స్థలం, ఓల్డ్‌ సఫాయిగూడలోని రెండు స్థలాల ఒరిజినల్‌ సేల్‌ డీడ్‌ డాక్యుమెంట్లను ఇచ్చాడు. అయితే రవీంద్రప్రసాద్‌ మార్చి 31న శివప్రదీప్‌కు ఫోన్‌ చేసి.. రూ.పది లక్షలు ఇస్తానని, పేట్‌ బషీరాబాద్‌లోని బాలాజీ ఆస్పత్రికి రమ్మని పిలిచాడు. అది నమ్మి శివప్రదీప్‌ అక్కడికి వెళ్లాడు. అప్పటికే అక్కడ సివిల్‌ డ్రెస్‌లో ఉన్న ఎస్సై కోటేశ్వరరావు శివప్రదీప్‌ను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాడు.

    లాకప్‌లో బంధించి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడు. ఠాణాలోని సిబ్బందితో కొట్టించాడు. ఈ సమయంలో బాధితుడి కేకలు, అరుపులు, కొడుతున్న చప్పుళ్లను.. ఫోన్‌లో ప్రత్యర్థి రవీంద్ర ప్రసాద్‌ స్నేహితుడు అనిల్‌కు వినిపించాడు. ‘ఇక చాలా.. హ్యాపీయా..’అంటూ మరింతగా రెచ్చిపోయాడు. ఇలా ఎస్సై కోటేశ్వరరావు కొందరిని చిత్ర హింసలకు గురి చేస్తూ ప్రత్యర్థులకు ఫోన్‌ చేసి మరీ వినిపించిన ఆడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    సైబరాబాద్‌ కమిషనర్‌కు ఫిర్యాదుతో..
    బాధితుడు శివప్రదీప్‌ తనను పోలీసులు ఇబ్బందులకు గురిచేసిన ఘటనపై సైబరా బాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ శాండిల్యకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం బయటకు వచ్చింది. కోటేశ్వరరావు వ్యవహా రాలపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై గతంలో పత్రికల్లో కథనాలు కూడా వచ్చినా.. కోటేశ్వరరావుకు డీసీపీ స్థాయిలోని అధికారి వెన్నుదన్నుగా ఉండటంతో విచారణ జరప కుండానే వదిలేశారు. తాజాగా సొంత పీఎస్‌లోనే ఎస్సైపై కేసు నమోదైంది. దీంతో కోటేశ్వరరావు తన సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి పరారయ్యాడు. ఆయనపై ఐపీసీ 385, 342, 323, 506 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యా యి. ఈ ఘటనలో ఎస్సైతో పాటు నలుగురు సిబ్బందికి ప్రమేయమున్నట్లు తెలిసింది. కమి షనర్‌ ఆదేశాల మేరకు  పేట్‌ బషీరాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌రావు ఈకేసును దర్యాప్తు చేస్తున్నారు.

    చాలా.. హ్యాపీయా..?
    అప్పు ఇచ్చానని చెబుతున్న శివప్రదీప్‌.. ఆ అప్పు వసూలు చేసుకోవడానికి అంతకుముందు కొందరి ద్వారా ప్రయత్నించాడు. దీంతో అప్పు తీసుకున్న రవీంద్ర ప్రసాద్, అతడి స్నేహితుడు అనిల్‌లు ఎస్సై కోటేశ్వరరావును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శివప్రదీప్‌ను, మరికొందరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి చితకబాదారు. వారిని కొడుతున్న తీరును ఫోన్‌ చేసి మరీ ప్రత్యర్థికి వినిపించడం, ఆడియో రికార్డు చేసుకొమ్మని చెప్పడం ఎస్సై దాష్టీకాన్ని స్పష్టంగా చూపుతోంది.

    అనిల్‌ చేసిన ఫోన్‌కాల్‌ రికార్డు మెల్లగా ఇతర స్నేహితుల ద్వారా సోషల్‌ మీడియాలోకి చేరి చక్కర్లు కొడుతోంది. ‘అప్పు ఇచ్చేందుకు నీకు అన్ని డబ్బులు ఎక్కడివి’అని శివప్రదీప్‌ను కొడుతూ మొదలైన సంభాషణ.. బాధితుడిని కొడుతున్న చప్పుళ్లు.. అరుపులు.. ఎస్సై బూతులు.. ‘నువ్వు శాటిస్‌ఫై అయ్యావు కదా..’అని ప్రత్యర్థి అనిల్‌ను అడగడం.. అతను నవ్వుతూ ‘వారిని వదలొద్దంటూ’సలహాలివ్వడం దాకా ఆ ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement