నాకు సిగరెట్‌ అలవాటే లేదు! | Sakshi
Sakshi News home page

నాకు సిగరెట్‌ అలవాటే లేదు!

Published Fri, Jul 21 2017 4:20 AM

నాకు సిగరెట్‌ అలవాటే లేదు! - Sakshi

అలాంటిది డ్రగ్స్‌ఎలా తీసుకుంటా?: సిట్‌ అధికారులతో కెమెరామన్‌ శ్యామ్‌ కె.నాయుడు
కెల్విన్‌తో సంబంధాలు, పార్శిళ్లపై ప్రశ్నల వర్షం
♦  నేడు సిట్‌ ముందుకు    నటుడు సుబ్బరాజు


సాక్షి, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసు విచారణలో భాగంగా గురువారం సిట్‌ బృందాలు కెమెరామన్‌ శ్యామ్‌ కె.నాయుడును ప్రశ్నించాయి. కెల్విన్‌తో సంబంధాలు, కొరియర్‌ సంస్థ నుంచి వచ్చిన పార్శిళ్లపై ఆరు గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించాయి. ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకున్న శ్యామ్‌ కె.నాయు డును శ్రీనివాస్‌ రావు బృందం విచారించింది. డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఎప్పుడు మొదలైం దని ప్రశ్నించగా.. ఆ అవసరం తనకు రాలేదని ఆయన సమాధానమిచ్చినట్టు తెలిసింది. కెల్విన్‌తో ఎలాంటి పరిచయం ఉంది? ఎందుకు అతడితో ఫోన్‌లో మాట్లాడారని అధికారులు ప్రశ్నించగా.. సినిమా ఫంక్షన్లకు ఈవెంట్‌ మేనేజర్‌గా చేసే సందర్భంలో పరిచయం అయ్యాడని, అంతకు మించి అతడితో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పినట్టు సిట్‌ వర్గాలు తెలిపాయి.

 డ్రగ్స్‌ వాడితే అది ఎవరి నుంచి కొనుగోలు చేశారు? మీకు డ్రగ్స్‌ అలవాటు చేసిందెవరని సిట్‌ వర్గాలు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. అయితే తనకు సిగరెట్‌ అలవాటు కూడా లేదని, డ్రగ్స్‌ తీసుకోవడం తెలియదని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. పదేపదే ఓ ప్రముఖ కొరియర్‌ కంపెనీ నుంచి పార్శిల్స్‌ వచ్చాయని, వాటిల్లో డ్రగ్స్‌ తెప్పించుకున్నట్టు కెల్విన్‌ తమ విచారణలో చెప్పాడని శ్యామ్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నించారు. పార్శిల్‌లో వచ్చినవన్ని డ్రగ్స్‌ అనుకుంటే దానికి తానేం చేయలేనని శ్యామ్‌ అన్నట్టు సమాచారం.

 విచారణలో ఆయన పెద్దగా ఎలాంటి సమాధానాలు చెప్పలేదని తెలిసింది. సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండటం వల్ల తనకు పెద్దగా సమయం ఉందని, ప్రైవేట్‌ వ్యక్తులతో కలసి పబ్బులు, క్లబ్బులకు తిరిగే అలవాటు కూడా లేదని శ్యామ్‌ స్పష్టం చేసినట్టు సమాచారం. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో పరిచయం, డ్రగ్స్‌ వ్యవహారాల్లో ఆయనతో లింకులున్నాయా అని ప్రశ్నించగా.. పూరి సినిమాలకు తాను పని చేశానని, అయితే ఆయన డ్రగ్స్‌ తీసుకున్నట్టు తెలియదని శ్యామ్‌ అన్నట్టు తెలిసింది. ఉదయం 10.15 గంటలకు ప్రారంభమైన విచారణలో 11.45కు టీ బ్రేక్, 1.35 గంటలకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చారు. ఆ తర్వాత 2.15 గంటల నుంచి 3.50 గంటల వరకు మళ్లీ విచారించింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన తన వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు.

ఆ కొరియర్లపై నిఘా పెంచండి: సిట్‌
డ్రగ్స్‌ సరఫరాకు పెడ్లర్లు వాడుకుంటున్న కొరియర్‌ మార్గాన్ని నియంత్రించడంపై సిట్‌ అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రముఖ కొరియర్‌ కంపెనీలైన బ్లూడార్ట్, ఫెడెక్స్, డీహెచ్‌ఎల్‌ ప్రతినిధులతో అధికారులు భేటీ అయ్యారు. డ్రగ్స్‌ సరఫరాపై నిఘా పెంచాలని, ఈ మేరకు డ్రగ్స్‌ కొరి యర్లను గుర్తించేందుకు సిట్‌ రూపొందించిన సూచనల కాపీలను ఆ కంపెనీల ప్రతినిధులకు అందజేశారు.

నేడు విచారణకు సుబ్బరాజు
సిట్‌ అధికారులు శుక్రవారం సినీ నటుడు సుబ్బరాజును ప్రశ్నించనున్నారు. విచారణలో కెల్విన్‌ వెల్లడించిన వివరాల ఆధారంగా సుబ్బరాజును విచారించనున్నట్టు అధికారులు తెలిపారు.

లోతుగా విచారిస్తున్నాం: ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌
డ్రగ్స్‌ వ్యవహారంపై విచారణ లోతుగా సాగుతోందని రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌ ఆర్‌వీ చంద్రవదన్‌ చెప్పారు. గురువారం అబ్కారీ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసును ఆషామాషీగా కాకుండా అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో సంబంధం ఉన్న కొందరికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, మరికొందరికి త్వరలో అందిస్తామని వివరించారు. శ్యామ్‌ కె.నాయుడు విచారణకు పూర్తిగా సహకరించారన్నారు. నోటీసులు అందుకున్న వారు దర్యాప్తు అధికారులకు సహరించాలని సూచించారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో బెంగళూరులో జరిగే డ్రగ్స్‌ నియంత్రణ శిక్షణకు డిప్యూటీ కమిషనర్‌ వివేకానందరెడ్డి నేతృత్వంలో ఆరుగురు అధికారుల బృందం వెళ్లనున్నట్టు చంద్రవదన్‌ తెలిపారు.

Advertisement
Advertisement