ఓఆర్‌ఆర్‌పై ‘స్మార్ట్‌’ జర్నీ..

21 Nov, 2018 12:35 IST|Sakshi

ప్రయోగాత్మకంగా అమలు  

త్వరలో అధికారికంగా సేవలు అందుబాటులోకి

వారంలో ఐదు టోల్‌ప్లాజాల వద్ద కార్డుల విక్రయం   

ట్రాఫిక్, కాలుష్యం తగ్గుతుందంటున్న అధికారులు

సాక్షి, సిటీబ్యూరో:  నగరానికే తలమానికమైన ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను వినియోగించే వాహనాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ మార్గం ద్వారా గతేడాది డిసెంబర్‌ వరకు 75వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా, అక్టోబర్‌లో వాటి సంఖ్య 1.30లక్షలకు చేరుకుంది. నగరానికి వచ్చే వాహనాలతో పాటు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఓఆర్‌ఆర్‌ను ఎంచుకోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్రయాణం సాఫీగా సాగేందుకు ‘స్మార్ట్‌ కార్డు’ సేవలు  అందుబాటులోకి తీసుకు రావాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు. కార్డు టచ్‌ చేయగానే టోల్‌గేట్‌లు వాటంతటవే తెరుచుకొని ముందుకెళ్లడం ప్రయాణించిన దూరాన్ని బట్టి డబ్బులు ఆటోమెటిక్‌గా బదిలీ అవుతాయని, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడీ)సేవలను సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొస్తామంటూ ఏళ్లుగా చెబుతూ వస్తున్న అధికారులు ఈసారి వాటిని కార్యరూపం దాల్చేలా అడుగులు వేస్తున్నారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మార్ట్‌ కార్డు సేవలపై తరచూ ఓఆర్‌ఆర్‌ విభాగం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తొలివిడతగా నానక్‌రామ్‌గూడ, శంషాబాద్, మేడ్చల్, ఘటేకేసర్, పటాన్‌చెరు టోల్‌ప్లాజాల వద్ద స్మార్డ్‌ కార్డుల విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, మరో వారం రోజుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ సహకారంతో విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఓఆర్‌ఆర్‌ సీజీఎం ఇమామ్‌ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్డుల వినియోగం వల్ల ట్రాఫిక్‌ తగ్గుముఖం పట్టడమేగాక, కాలుష్యం తగ్గడంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. 

ట్రాన్సిట్‌ కార్డు సేవలిలా...
ఓఆర్‌ఆర్‌పైకి ఎక్కేందుకు.. దిగేందుకు వీలుగా ఉన్న 19 ఇంటర్‌ ఛేంజ్‌ల్లో టోల్‌ ఛార్జీలను వసూలు చేసేందుకు 180 టోల్‌ లేన్లను ఏర్పాటు చేశారు. వాహనం ఔటర్‌పైకి ఎక్కే ముందు కంప్యూటర్‌లో వివరాలను నమోదు చేసి.. ఓ స్లిప్‌ను వాహనదారుడికి ఇవ్వాలి. ఎగ్జిట్‌ పాయింట్‌ వద్దనున్న కౌంటర్‌లో ఆ స్లిప్‌ను ఇస్తే సిబ్బంది ప్రయాణించిన దూరాన్ని లెక్కించి ఎంత చెల్లించాలో చెబుతారు. దీనివల్ల ముఖ్యంగా సెలవుదినాల్లో   టోల్‌ ఛార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ టోల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(టీఎంఎస్‌)ను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగానే ప్రయోగాత్మకంగా స్మార్ట్‌ కార్డు విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో వాహనదారుడు ఔటర్‌పైకి ఎక్కగానే టోల్‌ లేన్‌ దగ్గర క్షణం ఆలస్యం చేయకుండా ఓ స్మార్ట్‌ కార్డును సిబ్బంది అందజేస్తారు. ఆ కార్డు దిగే వద్ద అందజేస్తే స్కాన్‌ చేసి ఎంత చెల్లించాలో చెబుతారు. రోజువచ్చే వాహనదారులకు కాకుండా అప్పుడప్పుడూ వచ్చేవారి కోసం ఎక్కువగా ఈ ప్రీపెయిడ్‌ కార్డులు ఉపయోగపడతాయి. 

స్మార్ట్‌ కార్డుతో సాఫీ జర్నీ...
ఓఆర్‌ఆర్‌పై 19 టోల్‌ప్లాజాల వద్ద వాహనదారుల సమయాన్ని ఆదా చేసేందుకు ‘టచ్‌ అండ్‌ గో’(స్మార్ట్‌) కార్డులను పరిచయం చేస్తున్నారు. ‘ఈ కార్డును తీసుకున్న వాహనదారుడు  157 మ్యాన్యువుల్, టంచ్‌ అండ్‌ గో లేన్స్‌లో వెళ్లవచ్చు. తమ కార్డును టోల్‌ప్లాజా వద్ద ఉండే స్క్రీన్‌కు చూపించి ముందుకెళ్లాలి. అలా చూపడం వల్ల ఆ కార్డులో ఉండే నగదును ఆ సిస్టమ్‌ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటుంది.  

ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌తో ఆటోమేటిక్‌...
ఇది కూడా టచ్‌ అండ్‌ గో మాదిరిగానే ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌(ఈటీసీ) కార్డు పనిచేస్తుంది. జాతీయ రహదారుల్లో ఉపయోగించే ఆర్‌ఎఫ్‌ఐడీ ఈటీసీ కార్డులున్న వాహనాలను 23 లేన్లలో మాత్రమే అనుమతించనున్నారు. ఈ లేన్లోకి ఎంట్రీ అయ్యే ముందు వాహనాన్ని అక్కడ ఏర్పాటుచేసిన తొలి యాంటీనా కార్డు వ్యాలీడా కాదా అని స్క్రీన్‌ చేస్తుంది. కారు కోసమా, లారీ కోసమా, మరే ఏ ఇతర వాహనం కోసం రీచార్జ్‌ చేసిన కార్డునే వినియోగిస్తున్నారని పసిగడుతుంది. ఒకవేళ లారీ కోసం రీచార్జ్‌ చేసుకుని కారుకు వాడాలనుకుంటే ఇది సున్నితంగా తిరస్కరిస్తుంది. అయితే అంతా ఓకే అనుకున్నాక తొలి గేట్‌ దానంతట అదే తెరుచుకుంటుంది. ఆ తర్వాత కారు ఎక్కడ ఏ టైంలో ఓఆర్‌ఆర్‌ ఎక్కిందని రికార్డు చేసుకుంటుంది. అది ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ టోల్‌బూత్‌ నుంచి నిష్క్రమించగానే ఆ కార్డు నుంచి డబ్బులను ఆటోమేటిక్‌గా డిడెక్ట్‌ చేసుకుంటుంది. దీంతో వాహనదారుల ప్రయాణ సమయం ఆదా కానుంది.

వచ్చే వారం నుంచి విక్రయాలు...
నానక్‌రామ్‌ గూడ, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్, పటాన్‌చెరు  టోల్‌ ప్లాజాల వద్ద వచ్చే వారం నుంచి ఆర్‌ఎఫ్‌ఐడీ ఫాస్ట్‌టాగ్, టచ్‌ అండ్‌ గో కార్డులను విక్రయించనున్నారు. మొదటి విడతగా 2 లక్షల వాహనాలు, కార్లు/జీపులు తదితర చిన్నతరహా వాహనాల కేటగిరీలోని వాహనాలకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్‌ లేకుండానే ఫాస్ట్‌ ట్యాగ్‌లను జారీ చేయనున్నారు. రూ.500 వరకు రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫాస్ట్‌ ట్యాగ్‌ల్లోనూ తరుచూ ప్రయాణించే ప్రయాణీకులకు నెలసరి పాసులు అందుబాటులో ఉంటాయి. నెలలో 50 సార్లు ప్రయాణించే వారికి ఇది చెల్లుబాటు కానుంది. నెలవారీ పాసు కొనుగోలు చేసిన వారికి 24 గంటల్లో తిరుగు ప్రయాణంలో రాయితీ కూడా లభిస్తుంది. దాదాపు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.200 అందుబాటులోకి తీసుకురానున్న టచ్‌ అండ్‌ గో కార్డులో టోల్‌ప్లాజాలో వద్ద ఏర్పాటుచేసే పీవోసీలో రీచార్జ్‌ చేసుకునే అవకాశం ఉంది. లేదా ఆన్‌లైన్‌లోనూ రీచార్జ్‌ చేసుకునేసౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.  

మరిన్ని వార్తలు