సోషల్‌మీడియాలో హైదరాబాదీల అభ్యర్థన | Sakshi
Sakshi News home page

సోషల్‌మీడియాలో హైదరాబాదీల అభ్యర్థన

Published Sun, Nov 26 2017 10:49 AM

Social media abuzz with Ivanka Trump’s Hyderabad trip - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటనపై సోషల్‌మీడియాలో నెటిజన్లు విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు. కొంచెం వీలు చేసుకుని తమ వీధుల గుండా ప్రయాణించాలని ఇవాంకాను అభ్యర్థిస్తున్నారు. అప్పుడైనా జీహెచ్‌ఎంసీ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుతుందని, రోడ్లు బాగు అవుతాయని అంటున్నారు. మరో మూడు నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేస్తామని అన్నారు.

నగరంలో ఇవాంకా పర్యటన సందర్భంగా వాట్సాప్‌లో తిరుగుతున్న మెసేజ్‌ సారాంశం ఇలా వుంది..
హైదరాబాదీ : ఇవాంకా గారు నేను మణికొండలో నివాసం ఉంటున్నాను. మీరు మా రోడ్ల మీద ప్రయాణిస్తే బావుంటుంది. అప్పుడైనా మాకు కొత్త రోడ్లు వేస్తారు.
ఇవాంకా : రోడ్ల నిర్మాణంపై నేను ప్రధానమంత్రితో మాట్లాడతాను.
హైదరాబాదీ : అప్పుడు కేంద్ర ప్రభుత్వం మాపై రోడ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ వేస్తుంది.

ఈ ఒక్క మెసేజే కాదు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు వేదికగా ఇవాంకా ట్రంప్‌ పర్యటనపై నెటిజన్లు పెడుతున్న పోస్టులకు లెక్కలేదు. హఫీజ్‌పేట్‌లోని రోడ్ల మీదుగా పర్యటించాలని ఒకరు, మా ప్రాంతం గుండా ప్రయాణించాలని మరొకరు ఇవాంకాను అభ్యర్థిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా కొత్త ఫుట్‌పాత్‌లు కనిపించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు.

దీనిపై జీహెచ్‌ఎంపీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డికి ఓ గుర్తు తెలియని వ్యక్తి మెయిల్‌ పెట్టారు. హైదరాబాద్‌లో రోడ్లకు ఇరువైపులా కొత్త ఫుట్‌పాత్‌లు చాలా అందంగా ఉన్నాయని మెయిల్‌లో పేర్కొన్నారు. అయితే, ముందుముందు వాటిని ఎలా నిర్వహిస్తారో తలుచుకుంటే భయంగా ఉందన్నారు. ఫుడ్‌ ట్రక్స్‌ త్వరలోనే ఫుట్‌పాత్‌లను కళ తప్పిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement