‘సోలార్’కు ఆదిలోనే చుక్కెదురు! | Sakshi
Sakshi News home page

‘సోలార్’కు ఆదిలోనే చుక్కెదురు!

Published Mon, Nov 24 2014 1:06 AM

‘సోలార్’కు ఆదిలోనే చుక్కెదురు! - Sakshi

  • ఎక్కువ ధరలు కోట్ చేయడంతో టెండర్ల రద్దుకు సీఎం ఆదేశం
  •  వ్యవసాయశాఖ అభ్యంతరంతో నిలిచిపోయిన ప్రక్రియ
  •  బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం
  • సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రయోగాత్మకంగా మంజూరు చేసిన సోలార్ పంప్‌సెట్ల కొనుగోలుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. మార్కెట్లో దొరికే ధర కంటే కంపెనీలు ఎక్కువ రేట్ కోట్ చేసిన అభియోగాలపై టెండర్లను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే టెండర్లను నిలిపివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

    అవకతవకలకు  పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో టెండర్లకు బ్రేక్ పడింది. కేంద్రప్రభుత్వం జవహర్‌లాల్ నెరహూ నేషనల్ సోలార్ మిషన్ (జేఎన్‌ఎన్‌ఎస్‌ఎం) పథకంలో భాగంగా రాష్ట్రానికి 2000 పంప్‌సెట్లు మంజూరీ చేసింది. ఇందులో వెయ్యి 5 హెచ్‌పీ, మరో వెయ్యి 3 హెచ్‌పీ పంప్ సెట్లున్నాయి. వీటికి 30 శాతం వ్యయాన్ని కేంద్రం సబ్సిడీగా అందిస్తుంది. ఇటీవలే కేంద్రం తమ వాటాగా రూ. 2.76 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు పిలిచి వీటిని కొనుగోలు చేసే బాధ్యతను తెలంగాణ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(టీ.ఎన్‌ఆర్‌ఈడీసీఎల్) చేపట్టింది.

    గత నెలలో ఓపెన్ టెండర్లు పిలవడంతో 69 కంపెనీలు బిడ్లు దాఖలు చేశా యి. 14 కంపెనీలను అర్హతలేనివిగా అధికారులు పక్కనబెట్టారు. 55 కంపెనీలు కోట్‌చేసిన రేట్లలో కనిష్ఠ ధరలను పరిగణనలోకి తీసుకున్న నెడ్‌క్యాప్ అధికారులు, 3 హెచ్‌పీ పంప్‌సెట్‌కు రూ. 3.20 లక్షలు, 5 హెచ్‌పీ పంప్‌సెట్‌కు రూ.4.90 లక్షల ధరలను నిర్ణయించారు.

    ఆ రేట్లకే పంప్‌సెట్లు సరఫరా చేసేందుకు సిద్ధపడే కంపెనీలను ఒప్పందానికి ఆహ్వానించింది. అయితే, మార్కెట్లో 5 హెచ్‌పీ పంప్‌సెట్ రేటు రూ.3.20 లక్షలకే లభ్యమవుతోందని వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు టెండర్లను  ఆపాలని ఆదేశించింది.

    ఏపీలోనూ ప్రతిష్టంభన

    ఏపీలోనూ సోలార్ పంపుసెట్ల పంపిణీలో ప్రతిష్టంభన ఏర్పడింది. టెండర్ల ప్రక్రియ పూర్తికాకుండానే ఆరోపణలు వెల్తువెత్తడంతో ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్.. పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. టెండరుదారులు కోట్ చేసిన దానికన్నా మార్కెట్లో తక్కువ ధరకే సోలార్ పంపుసెట్లు లభిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వ వర్గాలకు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జరిగిన టెండర్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ(నెడ్‌క్యాప్) ఆధ్వర్యంలో ఇంధన పొదుపులో భాగంగా 2 వేల సోలార్ పంపుసెట్లను మంజూరు చేశారు. దీనికి ఇటీవల టెండర్లు పిలిచారు. దాదాపు 55 కంపెనీలు ఈ ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ ఎల్-1 హోదా పొందిన సంస్థను ఖరారు చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే, ఆ సంస్థ రూ. 4.95 లక్షలు కోట్ చేసినట్టు సమాచారం.


     

Advertisement

తప్పక చదవండి

Advertisement