గోనె హన్మంతరావుకు కన్నీటి నివాళి | Sakshi
Sakshi News home page

గోనె హన్మంతరావుకు కన్నీటి నివాళి

Published Sun, Jun 15 2014 2:51 AM

గోనె హన్మంతరావుకు కన్నీటి నివాళి - Sakshi

మంచిర్యాల అర్బన్ : టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు, లక్సెట్టిపేట మాజీ ఎమ్మెల్యే గోనె హన్మంతరావు (75)కు అశ్రు నివాళుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యు లు, బంధువులు, మిత్రులు, ఆత్మీయులు, రాజ కీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు పలికారు. కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న హన్మంతరావు శనివారం తెల్లవారు జామున మరణించారు.
 
వ్యాధి నివారణకు చికి త్స పొందుతుండగా శుక్రవారం పరిస్థితి విషమించడంతో చేసేదిలేక మంచిర్యాలకు తీసుకువచ్చారు. రెడ్డికాలనీలోని నివాసంలో శనివారం తెల్లవారు జామున 3:10 నిమిషాలకు హన్మంతరావు తుది శ్వాస విడిచారు. భూస్వామ్య కుటుంబానికి చెందిన ముత్యం రావు, ఆండాల్‌దేవిలకు నలుగురు సంతానం. హన్మంతరావు, శ్యాంసుందర్‌రావు, రమేందర్‌రావు, అశోక్‌రావు ఉన్నారు. అందులో హన్మంతరావు టీడీపీలో, శ్యాంసుందర్‌రావు బీజేపీలో రాజకీయంగా  స్థిర పడగా మరో ఇద్దరు సోదరులు వ్యాపారం నిర్వహిస్తున్నారు. హన్మంత రావుకు విజయ్, వినయ్, వినిత ముగ్గురు సంతానం.
 
వైద్యవృత్తి విడిచి రాజకీయాల్లోకి..
భూస్వామ్య కుటుంబంలో పుట్టిన హన్మంతరావు ఉన్నత విద్యను అభ్యసించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వైద్య వృత్తిలో చేరారు. రెండేళ్లు విద్యను అభ్యసిస్తున్న సమయంలో మంచిర్యాల పురపాలక సంఘం ఎన్నికలు వచ్చాయి. రాజకీయాలపై అమితమైన మక్కువ కలిగిన హన్మంతరావు వైద్య వృత్తికి మంగళం పలికి 1962లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు. కౌన్సిలర్‌గా రాజకీయ తెరంగెట్రం చే శారు. అప్పటి నుంచి అనేక పదవులు అలంకరించారు.
 
1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1987లో కాసిపేట మండలంలోని ముత్యంపల్లి నుంచి సింగిల్‌విండో చైర్మన్‌గా గెలిచి జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పదవి చేపట్టారు. అదే సమయంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. మరో రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేశారు. 1994లో తొలిసారి అసెం బ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999,2004, 2010లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. చంద్రబాబు నీటిపారుదల శాఖ డెరైక్టర్ పదవి ప్రకటించినా సున్నితంగా తిరస్కరిం చారు. ఆ పార్టీ విధానంపై రాజీనామా చేశారు.
 
కన్నీటి  పర్యంతమైన ఎమ్మెల్యే
వరుసకు బావబామ్మర్ధులైన హన్మంతరావు, ఎమ్మెల్యే దివాకర్‌రావులు రాజకీయ ప్రత్యుర్థులు. ఎప్పుడు ఎన్నికల్లో నువ్వా..నేనా అన్న ట్లు తలపడ్డారు. అయితే హన్మంతరావు విగతజీవిగా ఉండడాన్ని చూసిన దివాకర్‌రావు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు.  శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి కూడా ఫోన్‌లో హన్మంతరావు సతీమణి ఇందిర, విజయ్‌లను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
 
అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు
హన్మంతరావును కడసారి చూసేందుకు వివిధ జిల్లాల నుంచి రాజకీయ నాయకులు, సన్నిహితులు తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం పురవీధుల గుండా అంతిమయాత్ర సాగింది.  గోదావరి నది తీరాన హన్మంతరావు తనయులు విజయ్, వినయ్ అంత్యక్రియలు నిర్వహించారు.

మాజీ మంత్రి తక్కల్లపల్లి పురుషోత్తంరావు, సమాచార మాజీ కమీషనర్ కలకుంట్ల సుధాకర్‌రావు, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు, టీడీపీ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మంచిర్యాల డీఎస్పీ రమణకుమార్, మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్, గడ్డం అరవింద్‌రెడ్డి, నాయకులు కేవీ కిషన్‌రావు, గోవింద్‌నాయక్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, మాజీ చైర్మన్ రాయయ్య పాల్గొన్నారు.

Advertisement
Advertisement