యాజమాన్య సీట్లకు ప్రత్యేక ఎంట్రన్స్ | Sakshi
Sakshi News home page

యాజమాన్య సీట్లకు ప్రత్యేక ఎంట్రన్స్

Published Fri, Apr 17 2015 5:55 AM

యాజమాన్య సీట్లకు ప్రత్యేక ఎంట్రన్స్ - Sakshi

  • ప్రైవేటు మెడికల్ కళాశాలల డిమాండ్‌కు
  • తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
  • ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పరీక్ష నిర్వహించాలని సూత్రప్రాయ నిర్ణయం
  • యాజమాన్యాలతో నేడు సమావేశం కానున్న మంత్రి లక్ష్మారెడ్డి
  • ఇక 840 యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేక పరీక్ష
  • ఈ ఏడాదికి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ద్వారా నిర్వహించే యోచన
  • సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య సీట్లకు ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహించాలని చేస్తున్న డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే ప్రైవేటు మెడికల్ కాలేజీల ఇష్టానికి వదిలివేయకుండా ప్రత్యేక ఎంట్రన్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని సర్కారు తాజాగా నిర్ణయించిం ది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ విషయంపై ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి శుక్రవారం ఉదయం 9 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తుది నిర్ణయం తీసుకుంటే ఈ ఏడాదే ప్రత్యేక ఎంట్రన్స్ నిర్వహించే అవకాశాలున్నాయి.  
     
     840 సీట్లకు ప్రత్యేక ఎంట్రన్స్
     తెలంగాణలో మొత్తం 2,950 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 850 సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో, 2,100 సీట్లు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉన్నాయి. ఆ ప్రైవేటు మెడికల్ కాలేజీ సీట్లలో ‘ఎ’ కేటగిరీలోని 50 శాతం సీట్లు (ఫీజు రూ. 60 వేలు), ‘బి’ కేటగిరీ 10 శాతం (ఫీజు రూ. 2.40 లక్షలు) సీట్లను ఎంసెట్ ద్వారా కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. మిగిలిన ‘సి’ కేటగిరీ 40 శాతం (840 సీట్లను) యాజమాన్య కోటా కింద ప్రైవేటు కళాశాలలు ప్రస్తుతం ఎంసెట్ ఆధారంగానే భర్తీ చేసుకుంటున్నాయి. వీటికే ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రైవేటు కళాశాలలు ప్రభుత్వానికి ఎప్పటినుంచో విన్నవిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఈ సీట్లకు ప్రత్యేకంగా ఎంట్రన్స్ నిర్వహిస్తారు.
     
    ఈసారికి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ద్వారానే...
    యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఈ ఏడాదికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ద్వారానే నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు యోచిస్తున్నారు. తెలంగాణకు వరంగల్‌లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినప్పటికీ అది పూర్తికాకపోవడంతో ఈసారి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంపైనే ఆధారపడాలని యోచిస్తున్నారు. ఇప్పటికే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం దాదాపు 91,133 దరఖాస్తులు వచ్చాయి. అందులో తెలంగాణకు చెందినదరఖాస్తులు సుమారు 60,427 ఉన్నాయి. ఇందులో చాలామంది యాజమాన్య కోటా సీట్లకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. ప్రత్యేక ఎంట్రన్స్‌పై రాష్ర్ట ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయనుంది.
     
    అంతా ప్రభుత్వ నియంత్రణలోనే..
    ‘సి’ కేటగిరీల్లోని 25 శాతం యాజమాన్య కోటా, 15 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాలోని 840 సీట్లను తమ ఇష్టానికి తగ్గట్లుగా ఫీజులు వసూలు చేసుకోవాలనేది ప్రైవేటు మెడికల్ కాలేజీల ఆలోచన. ప్రస్తుతం వాటికి ప్రభుత్వ నిర్ణయం మేరకు రూ. 11.50 లక్షలు ఫీజుగా ఉంది. ప్రత్యేక ఎంట్రన్స్ తామే నిర్వహించుకోవడం ద్వారా రూ. 45 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు వసూలు చేసుకోవచ్చని ప్రైవేటు కాలేజీల యోచన. అయితే వారు సొంతంగా ఎంట్రన్స్ నిర్వహించుకోకుండా అడ్డుక ట్ట వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. సొంతంగా ఎంట్రన్స్ నిర్వహించుకునే అవకాశమే ఇస్తే పారదర్శకత లోపించి ఎంట్రన్స్‌కు ముందు రాత్రికి రాత్రే ఎక్కువ డబ్బులు ఇచ్చినవారికి పేపర్ లీకేజీ కూడా జరిగే ప్రమాదం కూడా ఉందనేది ప్రభుత్వ వర్గాల భయం. అందువల్ల అధిక ఫీజుల వసూలుకు చెక్ పెట్టడం, ఇతరత్రా అవకతవకలు జరగకుండా అడ్డుకోవడం కోసం ప్రభుత్వమే యాజమాన్య కోటా సీట్లకు కూడా ప్రవేశ పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో జరిగే సమావేశంలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement