‘గుట్ట’కు ప్రత్యేక పోలీస్‌స్టేషన్ | Sakshi
Sakshi News home page

‘గుట్ట’కు ప్రత్యేక పోలీస్‌స్టేషన్

Published Tue, Dec 9 2014 4:09 AM

Special Police Station in Yadagirigutta

ఆలేరు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధికారులు స్థలం కేటాయిస్తే ప్రత్యేక పోలీస్టేషన్‌ను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. సోమవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినర్సింహస్వామిని దర్శించుకున్న ఆయన అనంతరం దేవస్థానం అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ఆలయ భద్రత కోసం డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడుతానని పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో ఆధునిక టెక్నాలజీతో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సిబ్బందికి అధునాతన ఆయుధాలను సమకూరుస్తామన్నారు. దేవస్థానాన్ని తిరుపతిలాగానే తీర్చిదిద్దేందుకు ప్రత్యేక అధికారిని నియమించినట్లు చెప్పారు.
 
 ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రూ.వంద కోట్లు కేటాయించారన్నారు. మాస్టర్‌ప్లాన్ అమలు జరిగాక ఇక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. దేవస్థానానికి రానున్న రోజుల్లో మరింత భద్రత అవసరమని, ఇందుకోసం సిబ్బంది కూడా పెంచుతామన్నారు. వచ్చే ఏడాదిలో కొత్త బడ్జెట్ నుంచి హోంగార్డులకు రూ.12000 వేతనం, బస్‌పాస్‌లు, డ్రెస్‌లు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. గుట్టపైకి ఎవరైనా తాగి వస్తే కఠినచర్యలు తప్పవన్నారు. రెండు రోజుల క్రితం ఘాట్‌రోడ్డులో చనిపోయిన వారికి లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, దేవస్థానం చైర్మన్ బి.నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి , ఆర్డీఓ మధుసూదన్‌రెడ్డి, డీఎస్పీ  మోహన్‌రెడ్డి ఉన్నారు.
 
 నారసింహుడి సేవలో హోంమంత్రి
 యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సోమవారం రాష్ట్ర హోంశాఖమంత్రి నాయిని నర్సింహారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆయనకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద  మంత్రాలతో  ఆశీర్వచనాలు చేశారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement