టీ హైకోర్టు ఏర్పాటు చేయాలి | Sakshi
Sakshi News home page

టీ హైకోర్టు ఏర్పాటు చేయాలి

Published Thu, Feb 19 2015 4:08 AM

టీ హైకోర్టు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్ క్రైం: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేశాకే జడ్జీల నియూమకాలు చేపట్టాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌ఎస్ శాస్త్రి డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం జిల్లా కోర్టు భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హైకోర్టు కోసం తాము ఉద్యమం చేస్తోంది ప్రజల కోసమేనన్నారు. ఉమ్మడి హైకోర్టులో ఉద్యోగ నియూమకాలు జరిగితే తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.

ఇక్కడి జడ్జీలు ఎంతో నష్టపోతారన్నారు. హైకోర్టులో సీమాంధ్ర జడ్జీలు ఉండటంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేసులను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. సీమాంధ్ర కేసులను వారం రోజుల్లోపే ముగుయిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టులో ఆంధ్ర జడ్జీల పెత్తనం పోవాలంటే ప్రభుత్వం తక్షణమే తెలంగాణలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేరస్తులకు స్టేషన్ బెయిల్ ఇవ్వటం వల్ల కోర్టుకు లేని అధికారం పోలీస్‌స్టేషన్లకు కలిగిందన్నారు. దీనివల్ల కొన్ని కేసులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందన్నారు. దీనిని రద్దు చేయాలని చేస్తున్న నిరసనలు, సమ్మెలు, రిలే నిరహార దీక్షలతో ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. అందుకే నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నామన్నారు. గురువారం నుంచి నిరశన మొదలవుతుందని పేర్కొన్నారు.
 
21న నగరం బంద్
తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కోసం చేస్తున్న ఆందోళనల్లో భాగంగా ఈనెల 21వ తేదీన నిజామాబాద్ నగరం బంద్‌కు పిలుపునిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  నారాయణరెడ్డి తెలిపారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతును తెలుపాలని కోరారు. గురువారంనుంచి చేపట్టే నిరవధిక నిరాహార దీక్షలో తనతోపాటు బార్ అసోసియేషన్ సాంస్కృతిక కార్యదర్శి శ్రీనివాస్, ప్రతినిధులు ఎర్రం విఘ్నేశ్, వసంత్‌రావు, మహమ్మద్ అయూబ్‌లు కూర్చుంటారని తెలిపారు. సమావేశంలో న్యాయవాదులు రాజేందర్‌రెడ్డి, సుదర్శన్‌రావు, గంగారత్నం, రెంజర్ల సురేశ్, వసంత్‌రావు, రవీందర్, అమరేందర్ పాల్గొన్నారు.
 
పదో రోజుకు చేరిన దీక్షలు
నిజామాబాద్ క్రైం : ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం పదో రోజుకు చేరారుు. పదో రోజు దీక్షలో న్యాయవాదులు మహేందర్‌రెడ్డి, రాజేశ్వర్, మధుసూదన్‌గౌడ్, ఉదయ్‌కృష్ణ, దీపక్, ఎండీ అయూబ్ కూర్చున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, తెలంగాణ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(టీడీఓ) నాయకులు దీక్షలకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ మాయవార్ సాయిరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తొమ్మిది నెలలు కావస్తున్నా ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. హైకోర్టు ఏర్పటుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారిలో డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, కార్పొరేటర్లు దారం సాయిలు, కేశ మహేశ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, తేజస్వినీ శ్రీనివాస్, లక్ష్మణ్, జగత్‌రెడ్డి, పంచరెడ్డి సూరి, టీడీఓ రాష్ట్ర అధ్యక్షుడు కొండ ఆశన్న, టీఆర్‌ఎస్ నగర నాయకుడు ఈర్ల శేఖర్ తదితరులున్నారు.

Advertisement
Advertisement