శ్రీవిద్యది.. హత్యే | Sakshi
Sakshi News home page

శ్రీవిద్యది.. హత్యే

Published Sun, Mar 23 2014 5:45 AM

Srividyadi .. Initially

  •      చంపి కాల్వలో పడేశారు
  •      యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఘటన
  •      మృతురాలి బంధువుల ఆరోపణ
  •  హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : హన్మకొండ భీమారం సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వలో శుక్రవారం మృతదేహమై తేలిన బీటెక్ విద్యార్థిని శ్రీవిద్యది ముమ్మాటికీ హత్యేనని కుటుంబ సభ్యు లు, బంధువులు ఆరోపించారు. ర్యాగింగ్ భూతమే ఆమెను పొట్టనపెట్టుకుందని వారు వాపోయూరు. మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు శనివారం కేయూ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సైతో వాగ్వాదానికి దిగారు.

    కళాశాల యా జమాన్యాన్ని ఇక్కడికి పిలిపించాలని డిమాండ్ చేశారు. వారి ని ప్రశ్నిస్తేనే శ్రీవిద్య ఎలా మృతిచెందిందో తెలుస్తుందన్నా రు. ఆ సమయంలో ఎస్పీ కార్యాలయంలో ఉన్న సీఐ దేవేం దర్‌రెడ్డి హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఐ,ఆందోళనకారుల మధ్య మళ్లీ వాగ్వా దం జరిగింది. ఫిర్యాదు ఇస్తే విచారణ చేపడతామని సీఐ వారికి నచ్చజెప్పినా ఆందోళనకారులు శాంతించలేదు.

    శవం ఎందుకు తీశారు ?
     
    కాల్వలో ఉన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు ఎందుకు ఉంచలేదని ఆందోళనకారులు పోలీసులను ప్రశ్నించారు. గుర్తుతెలియని మృతదేహంగా భావిం చి శవాన్ని ఎంజీఎంకు తరలిస్తున్న క్రమంలో మృతురాలి వివరాలు తెలిశాయని సీఐ వివరణ ఇచ్చిన వారు శాంతించలేదు. ఆత్మహత్య చేసుకుంటే 24 గంటల తర్వాత శవం నీటిలో  తేలుతుందని.. కానీ కాల్వలో పడిన శ్రీవిద్య మృతదేహం నీటిలో మునగకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమె బ్యాగ్, చెప్పులు ఏమయ్యాయన్నా రు. కళాశాలలో మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉన్న శ్రీవిద్య ఐదు గంటలకు కాల్వలో ఎలా పడుతుందని ప్రశ్నించారు.   
     
    ర్యాగింగే బలిగొంది
     
    ర్యాగింగ్ విషయూన్ని ఇంట్లోగానీ, ప్రిన్సిపాల్‌కుగానీ చెప్పితే చంపేస్తామని సీనియర్లు బెదిరించినట్లు తనకు శ్రీవిద్య చెప్పిందని ఆమె తండ్రి గాదె పాణి తెలిపారు. ఫోన్‌లోనైనా ప్రిన్సిపాల్ దృష్టికి ర్యాగింగ్ విషయాన్ని తీసుకెళ్తానని కూతురితో చెప్పగా ఆమె వద్దని అభ్యంత రం చెప్పినట్లు గుర్తు చేశారు. ఇటీవల కల్చరల్ ఫెస్ట్‌లో కూడా కొందరు సహ విద్యార్థులు ర్యాంగింగ్ చేశారని, ఈ విషయాన్ని తన కూతురు తల్లి వద్ద ప్రస్తావించి కన్నీళ్లు పెట్టుకుందని పాణి వాపోయారు. తన కూతురి మరణానికి కారకులైన వారిని గుర్తించి శిక్షించాలని ఆయన సీఐకి ఫిర్యాదు చేశారు. శ్రీవిద్య మృతిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని సీఐ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement