తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు వాయిదా

6 Jun, 2020 20:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అధికారులతో అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి తీర్పుపై చర్చించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల మినహా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు శనివారం సాయం‍త్రం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల వాయిదాకే మొగ్గు చూపింది. రాష్ట్రంలో రెండుసార్లు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం భావించింది. అనేక కోణాల్లో సమాలోచనల అనంతరం మొత్తం పరీక్షలను వాయిదా వేసి పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఒక్కసారే నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. (టెన్త్‌ పరీక్షలపై హైకోర్టు తీర్పు)

ప్రభుత్వ తాజా నిర్ణయంపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కాగా రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరతూ..  బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపి తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలు నిర్వహణకు అనుమతినిస్తూ.. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా