సాగనంపారు! | Sakshi
Sakshi News home page

సాగనంపారు!

Published Fri, Jun 12 2015 2:13 AM

సాగనంపారు! - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్  స్థానికత (పుట్టిన ప్రాంతం) కలిగిన ‘స్టేట్ కేడర్’ విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్  చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుల నుంచి తక్షణమే రిలీవై ఏపీ ప్రభుత్వంలోని సంబంధిత విద్యుత్  సంస్థకు రిపోర్టు చేయాలని సూచిస్తూ ఆఘమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ట్రాన్స్‌కోలో 262 మంది, జెన్‌కోలో  522 మంది, ఎస్పీడీసీఎల్‌లో 393 మంది, ఎన్పీడీసీఎల్‌లో 168 మంది కలిపి మొత్తం 1,345 మంది ఏపీ ‘స్థానికత’గల స్టేట్ కేడర్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆయా సంస్థల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో శుక్రవారం నుంచి ఈ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు అనుమతించబోరని తెలుస్తోం ది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తుది కేటాయింపులపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో విభజన ప్రక్రియకు న్యాయపరమైన చిక్కులు అడ్డుకాక ముందే టీ.సర్కార్ యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు ఇచ్చింది. ఆలస్యం చేస్తే హైకోర్టు స్టే ఆర్డర్ వచ్చే అవకా శం ఉండటంతో ఈ ప్రక్రియను ముగించింది.
 
ఆర్డర్ టు సర్వ్‌కు మంగళం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల విభజన జరిగి ఏడాదైనా ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులందరూ ‘ఆర్డర్ టు సర్వ్’ ప్రాతిపదికనే పనిచేస్తున్నారు. టి.ట్రాన్స్‌కో, టి.జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లో రాష్ర్ట, జోనల్, జిల్లా కేడర్ స్థాయిల్లో వేల మంది ఏపీ స్థానికతగల ఉద్యోగులున్నారు. ప్రభుత్వోద్యోగుల విభజన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కమల్‌నాథన్ కమిటీ  ప్రభుత్వ సంస్థ (కార్పొరేషన్)ల ఉద్యోగుల విభజన తమ పరిధిలోకి రాదని గతంలోనే తేల్చేసింది.

పునర్విభజన చట్టంలోని సెక్షన్ 88 కేవలం ఏడాది వరకే ‘ఆర్డర్ టు సర్వ్’లో పనిచేసేందుకు అనుమతిస్తోంది. విభజన జరిగి ఏడాది పూర్తై నేపథ్యంలో ‘రాష్ట్ర స్థాయి’ విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయిం పులు జరపాలని ఈ నెల 6న తెలంగాణ ఇంధనశాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. తక్షణమే తుది కేటాయింపులు జరపాలని ఈ నెల 9న విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఏపీ స్థానికతగల ఉద్యోగుల తుది జాబితాలను అదే రోజు ఆన్‌లైన్‌లో ప్రదర్శించాయి. మార్గదర్శకాలపై ఏపీ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేయగా  కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసుపై బుధ, గురువారాలు విచారణ జరగగా తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలో ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులను ఈ నెల 10న జారీ చేసినట్లు గురువారం బయటపడింది. తప్పు డు స్థానికత సమాచారమిచ్చిన విద్యుత్ ఉద్యోగులపై క్రిమినల్‌చర్యలు తీసుకునేలా మార్గదర్శకాల్లో నియమాలను చేర్చాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత జె.రఘు ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు.
 
విద్యుత్ సౌధకు పోలీసు భద్రత!
విద్యుత్ ఉద్యోగుల విభజన నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని ‘విద్యుత్ సౌధ’ కార్యాలయానికి భద్రత కల్పించాలని టి.విద్యుత్ సంస్థలు పోలీసులను కోరాయి. ఏపీ  ఉద్యోగులను తక్షణమే రిలీవ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సదరు ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలుండటంతో ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement