లెక్కల్లో చిక్కులు! | Sakshi
Sakshi News home page

లెక్కల్లో చిక్కులు!

Published Fri, Mar 16 2018 3:27 AM

State revenue for the month of January is Rs 66,000 crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా ఐదోసారి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం... ఎన్నికల ముంగిట్లో రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసమంటూ ప్రగతి పద్దును భారీగా పెంచింది. కానీ ఇందులో వాస్తవ ఆదాయ, వ్యయాలను ఎప్పటిలాగే భారీగా పెంచి చూపించింది. ద్రవ్యలోటు ఎక్కువగానే ఉన్నా.. మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. దీనికితోడు బడ్జెట్‌తో సంబంధం లేకుండా అప్పుల ద్వారా నిధుల సమీకరణ కొనసాగుతుందనీ తేల్చి చెప్పింది.

అంచనాలు కుదింపు
రాష్ట్ర ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.5,520 కోట్ల రెవెన్యూ మిగులుతో రూ.1,74,453 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అందులో ప్రగతి పద్దు రూ.1,04,757 కోట్లు, నిర్వహణ పద్దు రూ.69,695 కోట్లుగా చూపింది. గతేడాది ప్రగతి పద్దు కింద చూపిన మొత్తం రూ.88,038 కోట్లే. అంటే ఈసారి అమాంతం మరో రూ.16 వేల కోట్లు పెంచేసింది. వాస్తవానికి జీఎస్టీ ప్రభావంతో అంచనా వేసినదానికన్నా ఆదాయం స్వల్పంగా తగ్గిందని ప్రభుత్వం బడ్జెట్‌లోనే ప్రస్తావించింది. గత బడ్జెట్‌ అంచనాలను 95 శాతానికి కుదించుకుంది. గతేడాది రూ.1.49 లక్షల కోట్ల బడ్జెట్‌ పెట్టిన ప్రభుత్వం.. రూ.1.42 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని పేర్కొంది. కానీ కొన్ని అంశాలను పరిశీలిస్తే... తాజా బడ్జెట్‌ భారీగా ఉండాలన్న తాపత్రయంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వాస్తవ ఆదాయ, వ్యయాలను విస్మరించినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు సమర్పించిన లెక్కల ప్రకారం.. జనవరి నెలాఖరు నాటికి (ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల కాలానికి) రూ.66 వేల కోట్ల రెవెన్యూ ఆదాయం వచ్చింది. తాజాగా బడ్జెట్‌లో వెల్లడించిన గణాంకాల్లో.. ప్రస్తుత ఏడాది రెవెన్యూ ఆదాయం రూ.1.08 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. అంటే తొలి పది నెలల ఆదాయం రూ.66 వేల కోట్లుకాగా.. ఫిబ్రవరి, మార్చి రెండు నెలల్లోనే మరో రూ.42 వేల కోట్లు వచ్చినట్లుగా చెబుతోంది. ఇది అంకెల గారడీయేనన్న విమర్శలు వస్తున్నాయి.

భూముల విక్రయంపైనే ఆశ
రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా ఈ ఏడాది రూ.61,369 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కగట్టింది. తాజా బడ్జెట్‌లో దానిని రూ.73,751 కోట్లుగా అంచనా వేసింది. ఇక గతేడాది కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు భారీగా పెరుగుతాయంటూ రూ.29 వేల కోట్ల ఆదాయాన్ని ప్రతిపాదించింది. కానీ ఆ మేరకు వచ్చే దాఖలాలు లేకపోవటంతో.. తాజా బడ్జెట్‌లో అంచనాలకు మించిన ఆదాయ, వ్యయాలను చూపించిందనే విమర్శలున్నాయి. జీఎస్టీ ప్రభావంతో సేల్స్‌ట్యాక్స్‌ ద్వారా రూ.53,482 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర ఎక్సైజ్‌ ఆదాయం ప్రస్తుతం రూ.9 వేల కోట్లుగా ఉండగా.. రూ.10,600 కోట్లకు పెరుగుతుందని ప్రతిపాదించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం స్వల్పంగా రూ.4,500 కోట్ల నుంచి రూ.4,700 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ఇక భూముల విక్రయం ద్వారా రూ.3000 కోట్లు వస్తుందని భావిస్తోంది. వాస్తవానికి భూముల విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు వస్తాయని గత బడ్జెట్‌లో అంచనా వేసిన సర్కారు.. రూ.వెయ్యి కోట్లకు మించి రాకపోవటంతో ఈసారి అంచనాలను తగ్గించుకుంది.

మిగులులోనూ గారడీలే!
అకౌంటెంట్‌ జనరల్‌ (ఏజీ) ఆమోదించిన 2016–17 ఆర్థిక సంవత్సర గణాంకాలను ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో ప్రకటించింది. రూ.1,385 కోట్ల మిగులు ఉందని లెక్కతేల్చింది. ఇక 2017–18 బడ్జెట్‌లో రూ.4,571 కోట్ల మిగులును ప్రతిపాదించిన సర్కారు.. ఆదాయ వ్యయాలు, వాస్తవ పరిస్థితుల దృష్ట్యా రూ.1,545 కోట్లు మాత్రమే మిగులు ఉంటుందని సవరించుకుంది. వాస్తవానికి ఏజీ ధ్రువీకరించిన అంతకు ముందు ఏడాది గణాంకాల్లోనూ ఆర్థిక శాఖ లాఘవం చూపినట్లు కనబడుతోంది. కేపిటల్‌ ఆదాయంలో చేబదులు రుణం పద్దు కింద రూ.12,088 కోట్లు చూపిన ప్రభుత్వం.. అదే పద్దును ఉన్నది ఉన్నట్లుగా కేపిటల్‌ చెల్లింపుల్లో తిరిగి చెల్లించిన ఖర్చు కింద చూపించింది. అంటే వాస్తవంగా 2016–17లో రాష్ట్ర ఆదాయ వ్యయాలు రూ.1.21 లక్షల కోట్లు ఉండగా.. రూ.12 వేల కోట్ల మేరకు పెంచేందుకు ప్రభుత్వం ఈ గారడీ చేసిందని అర్థమవుతోంది. దాంతో మొత్తం బడ్జెట్‌ రూ.1.33 లక్షల కోట్లకు చేరినట్లు ఏజీ పేర్కొనడం గమనార్హం. 

Advertisement
Advertisement