నొక్కేశారు! | Sakshi
Sakshi News home page

నొక్కేశారు!

Published Mon, Mar 2 2015 3:02 AM

steeled

పక్కదారి పట్టిన రూ.25 లక్షలు
 
సాక్షి, హన్మకొండ : వరంగల్ గ్రేటర్ పరిధిలో శునకాల బెడద పెరిగింది. శనివారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తల్లి కుక్కకాటుకు గురవడమే ఇందుకు నిదర్శనం. 20 నెలల క్రితం శునకాలను వదిలించుకోవడానికి కార్పొరేషన్ అధికారులు విషప్రయోగం చేశారు. దీంతో న్యాయస్థానాలు, స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరం తెలుపడంతో నియంత్రణ, వ్యాక్సిన్లు వేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. 2013 జూన్ 17వ తేదీన బల్దియా బడ్జెట్‌లో కుక్కలు, కోతుల నివారణ కోసం రూ.20 లక్షలు కేటాయించారు. టెండర్లు, నిబంధనలు పట్టించుకోకుండానే మూడు సంస్థలకు పనులు అప్పగించడం అప్పట్లో వివాస్పదమైంది. మొదటి 2013 ఆగస్టు 7న వీధికుక్కలను నియంత్రణ చేయడం ప్రారంభించారు.
 
లెక్కాపత్రం లేదు..
బల్దియూ పరిధిలో శునకాలకు కుటుంబ నియంత్రణ చేస్తే చెవికి రంధ్రం చేయాలి. డివిజన్లవారీగా ఏరోజు, ఎన్ని కుక్కలకు ఆపరేషన్లు నిర్వహించారో రికార్డులు ఉండాలి. విధిగా కుక్క ఫొటో తీసుకుని భద్రపర్చాలి. కానీ బల్దియా పరిధిలో ఆపరేషన్లు జరిగినట్లు పేర్కొంటున్న 3,991 కుక్కలకు సంబంధించి రికార్డులు లేవు. 2013 ఆగస్టు నుంచి నవంబర్ వరకు 3,284 కుక్కలకు కుని ఆపరేషన్లు చేపట్టామని.. ఇందుకోసం రూ.20.85 లక్షలు ఖర్చయ్యూయని ఉంది. ఆ తర్వాత 2014లో 697 కుక్కలకు ఆపరేషన్లు చేశామని.. దీనికి రూ.4.49 లక్షలు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా కేటాయించిన నిధుల కంటే రూ.5.34 లక్షలు అదనంగా ఖర్చయ్యాయి. వీటికి 2014 నవంబర్‌లో రూ.25.34 లక్షల బిల్లులు జారీ అయ్యాయి. అంతకుముందు 2011 నుంచి 13 వరకు సామూహికంగా 4,546 కుక్కలను చంపేందుకు రూ 2.64 లక్షలు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. గడిచిన నాలుగేళ్లలో నగరంలో 8,537 కుక్కలకు నిధులు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు.
 
అంతా జేబుల్లోకే..
బల్దియూ పరిధిలో కుక్కల హతం, కు.ని. చేస్తే వాటి బెడద ఉండకూడదు. కానీ, వాటి బెడద రోజు రోజుకు పెరుగుతోంది. శునకాలు గుంపులు, గుంపులుగా తిరగడంతో ప్రజలు భయపడుతున్నారు. నగరంలో 90 శాతం వీధి కుక్కలకు ఆపరేషన్ చేస్తే వాటి చెవికి రంద్రాలు లేవు. అధికారులు, సిబ్బంది, ఏజెన్సీలు కుమ్మక్కై వందల సంఖ్యలో కు.ని. ఆపరేషన్లు జరిపి వేల సంఖ్యలో లెక్కలు రాసి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. నిధులను తమ జేబుల్లో వేసుకున్నారని ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నారుు. ప్రజారోగ్య విభాగానికి చెందిన ఉన్నతాధికారుల కేంద్రంగానే ఈ వ్యవహారం మొత్తం నడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ చేపడితే మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది.
 
 ఒక్కో శునకానికి ఖర్చు
 ఆర్థిక సంవత్సరం    కుక్కలు    విధానం      ఖర్చు        మొత్తం
 2011-12           1,388         హతం        రూ.50      రూ.69,400
 2012-13          1,917        హతం         రూ.50      రూ.95,850      
 2012-13          1241        హతం         రూ.80      రూ.99,280
 2013-14          3,991    ఆపరేషన్       రూ.635     రూ.25,34,00

Advertisement
Advertisement