అమ్మహస్తం ఆగింది! | Sakshi
Sakshi News home page

అమ్మహస్తం ఆగింది!

Published Fri, Jun 6 2014 11:47 PM

అమ్మహస్తం ఆగింది! - Sakshi

అదనపు సరుకులకు చెక్
బియ్యం, చక్కెర, గోధుమపిండి, కిరోసిన్ మాత్రమే పంపిణీ
డిమాండ్ లేనందునే సరఫరా నిలిచిందంటున్న అధికారులు


అతి తక్కువ ధరకే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు తలపెట్టిన అమ్మహస్తం పథకానికి సర్కారు మంగళం పాడింది. రోజువారీ అవసరాల్లో ప్రధానమైన తొమ్మిది రకాల సరుకులను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందించే సాధారణ సరుకులైన బియ్యం, కిరోసిన్, చక్కెరతో పాటు అదనంగా కారం, పసుపు, చింతపండు, పామాయిల్, గోధుమపిండి తదితర సరుకులను రూ.185కే అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం హంగు, ఆర్భాటాలతో ప్రవేశపెట్టిన ఈ పథకం కథ ప్రస్తుతం ముగిసింది. దీంతో అదనపు సరుకుల పంపిణీ పూర్తిగా నిలిచిపోవడంతో సాధారణ సరుకులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

నాలుగు ‘కట్’..

జిల్లాలో 10.78లక్షల రేషన్ కార్డుదారులకు నెలవారీగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అమ్మహస్తం పథకంలో భాగంగా ఈ కార్డుదారులకు ప్రతినెల తొమ్మిది రకాల సరుకులు ఇస్తున్నారు. అయితే అమ్మహస్తం సరుకుల్లో నాణ్యత కొరవడడంతో కార్డుదారులు ఆదినుంచి కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. నాణ్యమైన సరుకులు అంది స్తున్నామంటూ అప్పటి నేతలు ప్రగల్భాలు పలికినప్పటికీ.. క్షేత్ర స్థాయిలో మాత్రం సరుకుల పట్ల తీవ్ర వ్యతి రేకత ఎదురైంది. ఫలితంగా రేషన్ డీలర్లు క్రమంగా ఈ స్టాకును పక్కనపెట్టారు. బాగా డిమాండ్ ఉన్న బియ్యం, కిరోసిన్, చక్కెర, ఆటా, పామాయిల్ సరుకులకు మాత్రమే డీడీలు క ట్టి స్టాకు తెప్పించుకోవడంతో  అదనపు సరుకుల ప్రాధాన్యం క్రమంగా పడిపోయింది.
 
నిల్వలు ముక్కిపోయి...

 
అమ్మహస్తం పథకం కింద జిల్లాకు కేటాయించిన కారం, పసుపు, చింతపండు సరుకులకు డిమాండ్ లేకుండా పోయి ంది. ఈ నేపథ్యంలో ఈ స్టాకును  రేషన్ డీలర్లు తీసుకోకపోవడంతో వాటిని పౌరసరఫరాల శాఖ అధికారులు జిల్లా గోదాముల్లో నిల్వ చేశారు. దీంతో క్రమంగా ఈ స్టాకు గోదాముల్లో ముక్కిపోయి పాడవడంతో భారీ నష్టమే సంభవించింది. దాదాపు 2లక్షల కారంపొడి ప్యాకెట్లు పాడైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అదనపు సరుకుల సంగతి పక్కనబెట్టి సాధారణ సరుకులైన బియ్యం, చక్కెర, కిరోసిన్, గోధుమలు, పిండి మాత్రం పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాకు 17వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 7వందల మెట్రిక్ టన్నుల గోధుమలు, గోధుమపిండి, 550 మెట్రిక్ టన్నుల చక్కెర కోటాను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేశారు.
 
పామాయిల్ ‘నిల్’..
 
రేషన్ కార్డుదారులకు కిలో చొప్పున అందించే పామాయిల్‌కు కొరత ఏర్పడింది. పామాయిల్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా నిల్చిపోయింది. జిల్లాలో నెలకు 1,078 మెట్రిక్ టన్నుల పామాయిల్ స్టాకు అవసరం. అయితే ఏప్రిల్ నెలతోనే పామాయిల్ సరఫరాకు కాలం చెల్లడంతో కార్డుదారులకు అందలేదు. ఏప్రిల్ నెలలో అందుబాటులో ఉన్న స్టాకు పంపిణీ చేయగా.. ఆ తర్వాత ఎన్నికల తంతు మొదలు కావడంతో పామాయిల్ కథకు తెరపడింది. తాజాగా ఈ నెలలో కూడా పామాయిల్ పంపిణీ నిలిచిపోయింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన  నేపథ్యంలో.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై పామాయిల్ సరఫరా ఆధారపడి ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.
 
 

Advertisement
Advertisement