పంచాయతీ వ్యవస్థ పటిష్టం | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 5 2017 2:18 AM

Strengthen the panchayat system - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీలను మరింత పటిష్టం చేస్తున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మిషన్‌ భగీరథ, నాణ్యమైన విద్యుత్‌ సరఫరాతో పంచాయతీల ఖర్చు గణనీయంగా తగ్గుతుందన్నారు. బుధవారం సర్పంచుల సమ్మేళనం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 30 జిల్లాల నుంచి 180 మంది సర్పంచ్‌లతోపాటు కమిషనర్‌ నీతూ ప్రసాద్, సెర్ప్‌ సీఈవో పౌసమి బసు, అధికారులు రామారావు, వెస్లీ, శేషాద్రి హాజరయ్యారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, వాటిని మరింత బలోపేతం చేసేదిశగా ముందుకు పోతున్నామన్నారు. పంచాయతీల వ్యయభారాన్ని తగ్గించి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వమే పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. హైదరాబాద్‌ మినహా తెలంగాణలోని 30 జిల్లాలను 3 ప్రాంతాలుగా విభజించి, ప్రతి ప్రాంతంలోనూ ఒక సర్పంచ్‌ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు.  రీజియన్‌ 1లో భాగంగా ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కుమ్రంభీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన సర్పంచులతో సమ్మేళనం జరగనుంది. రీజియన్‌ 2లో జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, మేడ్చల్, నాగర్‌ కర్నూలు, నల్గొండ, రంగారెడ్డి,సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల సర్పంచులతోనూ, రీజియన్‌ 3లో భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌(అర్బన్‌– రూరల్‌),యాదాద్రి, జిల్లాల సర్పంచులతోనూ సమ్మేళనాలు జరుగుతాయన్నారు.  

నాబార్డ్, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకాలకింద చేపడుతున్న రోడ్లు, వంతెనల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అభ్యంతరాలతో ఆగిన పనులకు సంబంధించి త్వరలోనే అటవీ మంత్రి, అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement