రైల్వే, ఆర్టీసీ సమ్మె సైరన్ | Sakshi
Sakshi News home page

రైల్వే, ఆర్టీసీ సమ్మె సైరన్

Published Fri, Jun 10 2016 1:48 AM

రైల్వే, ఆర్టీసీ సమ్మె సైరన్

ఈ నెల 23న ఆర్టీసీలో ఒకరోజు సమ్మె..
రైల్వేలో జూలై 11 నుంచి సమ్మె

 అటు రైలు కూతకు, ఇటు బస్సు హారన్‌కు సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ రైల్వే ఉద్యోగులు, సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు సమ్మెలకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఈ నెల 23న ఒక రోజు సమ్మెకు 7 సంఘాలతో కూడిన ఆర్టీసీ జేఏసీ పిలుపునివ్వగా... వచ్చే నెల 11వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు రైల్వే ఉద్యోగుల సంఘం ప్రకటించింది. మరోవైపు తపాలా ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కూడా చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ రాయ్‌కు సమ్మె నోటీసు అందజేశారు.   - సాక్షి, హైదరాబాద్

దక్షిణ మధ్య రైల్వే జీఎంకు నోటీసు
రైల్వే ఉద్యోగులు, సిబ్బంది దేశవ్యాప్తంగా వచ్చేనెల 11 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వేలో కార్మిక సంఘాలు జీఎం రవీంద్రగుప్తాకు గురువారం సమ్మె నోటీసు అందజేశాయి. ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ అనుబంధ సంఘం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకరరావు ఆధ్వర్యంలో దాదాపు 3 వేల మంది కార్మికులు రైల్ నిలయానికి తరలివచ్చారు. కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు సిద్ధపడినట్లు ఈ సందర్భంగా శంకరరావు చెప్పారు. ఇక ఐఎన్‌టీయూసీ అనుబంధ సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం ప్రధాన కార్యదర్శి రాఘవయ్య ఆధ్వర్యంలో కార్మికులు వచ్చి సమ్మె నోటీసు అందజేశారు. రైల్వే కార్మికుల కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని, ఏటా 5 శాతం ఇంక్రిమెంటు, సర్వీసులో కనీసం 5 సార్లు పదోన్నతులు ఇవ్వాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్న డిమాండ్లతో సమ్మెకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు.

ఆర్టీసీలో ఒక రోజు సమ్మె
ఈ నెల 23న ఒక రోజు సమ్మె చేయనున్నట్లు 7 కార్మిక సంఘాలతో కూడిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. వేతన సవరణ బకాయిలతోపాటు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలను చెల్లించాలనే డిమాండ్‌తో సమ్మెకు సిద్ధపడింది. కార్మిక సంఘాల నేతలు గత నెల 16న జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ జేఎండీకి సమ్మె నోటీసు ఇచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతం రాకపోవటంతో సమ్మెకు దిగుతున్నారు. అయితే ఇదే సమయంలో కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు కార్మికశాఖ నోటిఫికేషన్ వెలువరించింది. దీంతో ఎన్నికల ప్రక్రి య, ప్రచారానికి సమయం ఉండదన్న ఉద్దేశంతో నిరవధిక సమ్మె యోచన విరమించుకున్నట్లు కార్మిక జేఏసీ నేతలు ప్రకటించారు. వేతన సవరణతో ఆర్టీసీపై పడిన భారాన్ని భరించేందుకు నెలకు రూ.75 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడం, దీనికి సంబంధించి గత 6 నెలల బకాయిలు రూ.450 కోట్లు చెల్లింపు, వేతన సవరణకు సంబంధించి బ కాయిల రెండో విడత చెల్లింపు, 2012కు సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిల చెల్లింపు, 2013 నుంచి బకాయిల బాండ్ల విడుదల డిమాండ్లుగా సమ్మెకు దిగుతున్నట్టు జేఏసీ నేతలు పేర్కొన్నారు.

హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారు
వేతన సవరణతో పెరిగిన జీతాల ఖర్చు నెలకు 75 కోట్లను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారని.. కానీ ఆ హామీని తుంగలో తొక్కారని ఆర్టీసీ కార్మిక జేఏసీ విమర్శించింది. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్‌లో ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి, ఎన్‌ఎంయూ చైర్మన్ కమాల్‌రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యదర్శి వి.ఎస్.రావు తదితరులు మాట్లాడారు. కార్మికుల సమస్యలను పరిష్కారించాలన్న డిమాండ్‌తో నోటీసు ఇచ్చి ఇన్ని రోజులైనా ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు వెళుతున్నామని చెప్పారు.  సీఎం సమక్షంలో కార్మికులతో జరిగిన ఒప్పందాలు రెండేళ్లవుతున్నా అమలు కాకపోవడం దారుణమన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement