విద్యుత్ చార్జీల పెంపుపై మల్లగుల్లాలు | Sakshi
Sakshi News home page

విద్యుత్ చార్జీల పెంపుపై మల్లగుల్లాలు

Published Sun, Nov 30 2014 1:29 AM

Struggled hikes in electricity charges

  • ఏఆర్‌ఆర్‌ల తయారీలో డిస్కంలు
  • వచ్చే నెలాఖరుకు తేలనున్న చార్జీల వివరాలు
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెంచే ప్రతిపాదనపై తుది కసరత్తు కొనసాగుతోంది. ప్రతి ఏడాది నవంబర్‌లోనే డిస్కంలు వార్షిక సగటు రాబడి అంచనాలను (ఏఆర్‌ఆర్-అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్) రూపొందిస్తా యి. విద్యుత్ నియంత్రణ చట్టం ప్రకారం నవంబర్ నెలాఖరున విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు సమర్పిస్తాయి.

    ఈసారి నవంబర్ ఆఖరునాటికి ఏఆర్‌ఆర్‌లు సిద్ధం కాకపోవటంతో...  డిసెంబర్ 24 వరకు గడువు ఇవ్వాలని ఇటీవలే టీఎస్‌ఎస్‌పీడీసీఎల్, టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ అధికారులు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ)కి విజ్ఞప్తి చేశారు. డిస్కంల అభ్యర్థనపై ఇప్పటివరకు టీఎస్‌ఈఆర్‌సీ అధికారికంగా స్పందించలేదు. కానీ రెండు వారాలు గడువు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. తాజా ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ అంచనాలకు మించి పెరిగింది.

    రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున విద్యుత్‌ను ఏజెన్సీల నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఒక్కో రోజు యూనిట్‌కు రూ.7  చొప్పున చెల్లించటంతో పాటు.. వరుసగా అయిదు నెలల వ్యవధిలో దాదాపు రూ.2000 కోట్లు విద్యుత్ కొనుగోలుకోసం ఖర్చు చేయాల్సి వచ్చిందని స్వయానా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన విద్యుత్ వాటాలపై భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో కొంతకాలం బహిరంగ మార్కెట్లో కరెంట్ కొనుగోలు చేయక తప్పని స్థితి నెలకొంది.

    ఈ నేపథ్యంలో అందు కనుగుణంగా చార్జీలు పెంచక తప్పదని అధికారుల్లో చర్చ జరుగుతోంది. కానీ కొత్త రాష్ట్రం కావటంతో ప్రజలపై భారం మోపేందుకు ప్రభుత్వం అంగీకరిస్తుందా.. రాయితీలను పెంచి చార్జీల పెంపు శాతాన్ని తగ్గిస్తారా అన్నది ఏఆర్‌ఆర్‌ల తయారీతో తేలనుంది. వినియోగదారులపై భారం ఎంత పడుతుందనేది డిసెంబర్ మూడో వారంలో తేలిపోతుంది.
     

Advertisement
Advertisement