పోలీసుల భయంతో విద్యార్థి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పోలీసుల భయంతో విద్యార్థి ఆత్మహత్య

Published Fri, Apr 1 2016 4:28 AM

పోలీసుల భయంతో విద్యార్థి ఆత్మహత్య - Sakshi

పెద్దపల్లి: ‘మేం హన్మకొండ పోలీస్‌స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం... నీ మీద కేసరుుంది... రేపు ఠాణాకు వచ్చి కలువ్...’ అంటూ ఫోన్ రావడంతో కలత చెందిన విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఇందిరానగర్‌కాలనీకి చెందిన కల్లెపల్లి ఆశీష్‌కుమార్(19) హన్మకొండలో ఐటీఐ చదివాడు. ఇటీవల పరీక్షలు పూర్తికావడంతో అక్కడే స్నేహితులతో కలసి గదిలో ఉంటున్నాడు. బుధవారం పెద్దపల్లిలోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. అదేరోజు రాత్రి హన్మకొండ పోలీసులు పదేపదే ఫోన్‌చేసి గురువారం ఠాణాకు రావాల్సిందిగా బెదిరించారని తల్లిదండ్రులు రమేష్-రాణి తెలిపారు.

పోలీసులు ఏం చేస్తారోనన్న భయంతో గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆశీష్‌కుమార్ స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు బోరున విలపిస్తూ చెప్పారు. ‘స్నేహితులకు సెలవు..’ అంటూ రాసిన లేఖను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అకారణంగా బెదిరించిన పోలీసులపై మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement