టీచర్లు లేరు; పిల్లలు వంట సామగ్రితో రోడ్డెక్కారు..! | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 8 2018 12:53 PM

Students Call For Strike To Recruit Teachers In Jangaon School - Sakshi

సాక్షి, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని పసరమడ్ల శివారులో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ఉపాధ్యాయుల నియామకం లేకపోవడంతో బోధన జరగడం లేదంటూ జోరు వానలో నినాదాలు చేశారు. విద్యార్థులకు ఎస్‌ఎఫ్‌ఐ, టీఎస్‌ఎఫ్‌ విద్యార్థి సం ఘాల నాయకులు ధర్మభిక్షం, చందూ నాయక్‌ మ ద్దతు పలికారు. వంట సామగ్రితో సిద్దిపేట హైవే పై బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీనివాస్‌ అక్కడకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు గడిచి పోతున్నా ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకం లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ విషయంలో గిరిజన మంత్రి స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. పేద గిరిజన విద్యార్థులకు చదువు అందని ద్రాక్ష చేస్తున్నారని, పాలకులకు ఇక్కడి దయనీయ పరిస్థితి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను నియమించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేదని పేర్కొన్నారు. అధికారులు స్పదించని పక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.


విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్సై శ్రీనివాస్‌

Advertisement
Advertisement